తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

- September 22, 2024 , by Maagulf
తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అధికారుల బృందం పెట్టుబడుల ఆకర్షణ కోసం విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో వారు అమెరికా మరియు జపాన్ దేశాలను సందర్శించనున్నారు. ఈ రోజు, సెప్టెంబర్ 21న, హైదరాబాద్ నుండి బయలుదేరి, అక్టోబర్ 4న తిరిగి వస్తారు.

ఈ పర్యటనలో ప్రధానంగా మైనింగ్ మరియు గ్రీన్ పవర్ విభాగాలకు సంబంధించిన ఆధునిక పద్ధతులు, లోతైన అధ్యయనం చేయడం, అలాగే పెట్టుబడులను ఆహ్వానించడం లక్ష్యంగా ఉంది. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో లాస్‌వేగాస్‌లో జరగనున్న అంతర్జాతీయ మైనింగ్ ఎక్స్‌పోలో పాల్గొంటారు. అక్కడ వివిధ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. సెప్టెంబర్ 26న లాస్‌ ఏంజెల్స్‌కు చేరుకుని, సెప్టెంబర్ 27న ఎడ్ వార్డ్స్, సన్ బోర్న్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ విధానాన్ని పరిశీలిస్తారు. సెప్టెంబర్ 28న పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులతో సమావేశమవుతారు.

సెప్టెంబర్ 29న టోక్యోకి చేరుకుని, సెప్టెంబర్ 30న స్థానిక పెట్టుబడిదారులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. అక్టోబర్ 1న పెట్టుబడిదారులతో వ్యక్తిగతంగా (వన్ టు వన్) సమావేశమవుతారు. యామాన్షి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును సందర్శిస్తారు. అక్టోబర్ 2న తోషిబా, కవాసాకి, అక్టోబర్ 3న పానసోనిక్ ప్రధాన కార్యాలయాలను సందర్శిస్తారు. అక్టోబర్ 4న హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడడం లక్ష్యంగా ఉంది.

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com