టీం ఇండియా ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం...!
- October 07, 2024
భారత క్రికెట్ జట్టులో బౌలింగ్ విభాగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆది నుంచి స్పిన్నర్ల మీద ఎక్కువ ఆధారపడే మన జట్టుకు 70,80 దశకల్లోనే కపిల్ దేవ్ వంటి దిగ్గజ క్రికెటర్ రూపంలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ దొరికారు. ఆయన తర్వాత ఎంతో మంది ఫాస్ట్ బౌలర్లు జట్టులోకి వచ్చారు, వెళ్లారు అన్న చందాన సాగిన తరుణంలో జవగళ్ శ్రీనాథ్, వెంకటేష్ ప్రసాద్ ద్వయం జట్టుకు వెన్నెముకగా నిలిచారు.ఇక మిలీనియం ఆరంభంలో పై వారందరినీ స్పూర్తిగా తీసుకొని జట్టులోకి వచ్చాడు జహీర్ ఖాన్. మొదట్లో నిలకడ లేమితో తడబడినా, తర్వాత కాలంలో తన అత్యుత్తమ ప్రదర్శనతో జట్టుకు పెద్ద దిక్కుగా మారాడు. నేడు టీం ఇండియా మాజీ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం జహీర్ ఖాన్ జన్మదినం.
జాక్ అలియాస్ జహీర్ ఖాన్ 1978,అక్టోబర్ 7న మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా శ్రీరాంపూర్ పట్టణంలో జన్మించాడు. ఇంటర్మీడియెట్ వరకు అక్కడే చదువుకున్నాడు. చిన్నతనం నుంచి జహీర్ క్రికెట్ అంటే మక్కువ ఏర్పడటంతో, వారి తల్లిదండ్రులు సైతం ప్రోత్సహించడంతో అటను మెరుగుపరుచుకునేందుకు స్థానిక కోచ్ వద్ద శిక్షణ తీసుకోవడం ప్రారంభించాడు. ఇదే సమయంలో ఫాస్ట్ బౌలింగ్ వైపు రావడం జరిగింది. ఇంటర్ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరినా ఆట మీద ఉన్న మక్కువతో మధ్యలోనే ఆపేసి క్రికెట్ మీదే ఫోకస్ చేస్తూ వచ్చాడు.
జహీర్ మెరుగైన శిక్షణ కోసం ముంబై చేరుకొని కోచ్ సుధీర్ నాయక్ వద్ద ఫాస్ట్ బౌలింగ్ మెళకువలు నేర్చుకున్నాడు. సుధీర్ నాయక్ మార్గదర్శనంలో స్థానిక టోర్నీల్లో ఆడుతూ, క్రమక్రమంగా రాష్ట్రవాళీ టోర్నీల్లో మంచి ప్రదర్శనలు ఇస్తూ రావడంతో చెన్నైలోని MRF ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణకు ఎంపికయ్యాడు. అక్కడ బౌలింగ్ కోచ్ టి.ఏ.శేఖర్ ఆధ్వర్యంలో బౌలింగ్ యాక్షన్ మీద సాధన చేసి, రివర్స్ స్వింగ్ బౌలరుగా మారాడు. శేఖర్ సూచనల మేరకు మహాష్ట్ర నుంచి కాకుండా బరోడా తరుపున రంజీ మ్యాచులు ఆడటం ప్రారంభించి తన బౌలింగ్ ప్రదర్శనతో 2000-01 రంజీ ట్రోఫీని బరోడా కైవసం చేసుకోవడంలో కీలకమైన పాత్ర పోషించాడు.
రంజీల్లో జహీర్ ప్రదర్శనకు ముగ్ధులైన సెలెక్టర్లు 2000లో బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేశారు. అదే సంవత్సరం జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కెన్యా మీద ఓడిల్లోకి అరంగేట్రం చేశాడు. 2000-07 వరకు నిలకడ లేమి, గాయాలు కారణంగా జట్టులో సుస్థిరమైన స్థానాన్ని సాధించలేక ఇబ్బంది పడ్డాడు. అయితే, ఆ సమయంలో టీం ఇండియా సారథులుగా వ్యవహరించిన సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే ప్రోత్సాహంతో సమన్వయం కోల్పోకుండా ఆట తీరును మెరుగు పరుచుకుని 2007 ఆరంభం నాటికి జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఆ తర్వాత నుంచి జట్టులో ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి పెద్ద దిక్కుగా మారాడు.
2002 ఛాంపియన్స్ ట్రోఫీ, 2011 ప్రపంచ కప్ టోర్నీల్లో జహీర్ కీలకమైన పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2011 ప్రపంచ కప్ టోర్నీలో టీం ఇండియా బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించి, జట్టు జైత్ర యాత్రలో వెన్నెముకగా నిలిచాడు. ఇదే టోర్నీలో నకుల్ బౌలింగ్ ను ప్రపంచానికి పరిచయం చేశాడు జహీర్. ఆ టోర్నీలో 21 వికెట్లు పడగొట్టాడు. 28 సంవత్సరాల తర్వాత ఇండియా ప్రపంచ కప్ కైవసం చేసుకోవడంలో జహీర్ పాత్ర మరువలేనిది. ఆ తర్వాత వరుస గాయాలు, ఫిట్నెస్ కారణాలతో ఇబ్బంది పడ్డాడు. 2015లో తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ రంగానికి వీడ్కోలు పలికాడు. రిటైర్మెంట్ అనంతరం టీం ఇండియా బౌలింగ్ కన్సల్టెంటుగా వ్యవహరించాడు. ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీలో లక్నో సూపర్ జెయింట్స్ టీంకు మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు.
ఒకటిన్నర దశాబ్దం పాటు తన వైవిధ్య భరితమైన బౌలింగుతో అలరించిన జహీర్ 92 టెస్టులు ఆడి 311 వికెట్లు, 200 వన్డేలు ఆడి 282 వికెట్లు, 17 అంతర్జాతీయ టీ20లు ఆడి 17 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 11 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. 2011లో అర్జున అవార్డు, 2020లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!