రాధిక మంగిపూడి రాసిన 'విజయనగర వైభవ శతకం' ఆవిష్కరణ

- October 14, 2024 , by Maagulf
రాధిక మంగిపూడి రాసిన \'విజయనగర వైభవ శతకం\' ఆవిష్కరణ

విజయనగరం: 'విజయనగర ఉత్సవ్ 2024' ప్రారంభోత్సవ సభలో మంగిపూడి రాధిక రాసిన విజయనగర వైభవ శతకం ఆవిష్కరించబడింది.శాసనసభ సభాపతి అయ్యన్నపాత్రుడు, మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు, రాష్ట్ర MSME SERP NRI సంబంధాల మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, విజయనగరం శాసనసభ సభ్యురాలు ఆదితిగజపతి, జిల్లా కలెక్టర్ అంబేద్కర్, ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు తదితర ప్రముఖులు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

శ్రీమతి రాధిక మంగిపూడి తన స్వస్థలమైన విజయనగరం యొక్క చరిత్ర, వారసత్వము, కళలు, అక్కడ పుట్టిన మహానుభావులు.. ఒక్కొక్క విషయాన్ని గూర్చి ఒక్కొక్క తేటగీతి పద్యాన్ని రూపొందించి 111 పద్యాలతో ఈ 'విజయనగర వైభవ శతకం' రచించారు. విజయనగరం జిల్లా వైభవాన్ని కీర్తిస్తూ వెలువడుతున్న తొలి పద్యశతకం ఇది.ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దేవత పైడితల్లి అమ్మవారి ఉత్సవ సందర్భంగా ఆ అమ్మవారికి ఈ పుస్తకం అంకితం ఇవ్వబడింది. ' విజయనగరం సాగి జ్ఞానాంబ మెమోరియల్ బుక్ ట్రస్ట్' వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు.

మంగిపూడి రాధిక బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ రచయిత్రి, వ్యాఖ్యాత్రి, అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల రూపకర్త, “శ్రీ సాంస్కృతిక కళాసారధి” సింగపూర్ సంస్థ ప్రధాన కార్యనిర్వాహకవర్గ సభ్యురాలు, మరియు ''గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం' సంస్థ' వ్యవస్థాపక అధ్యక్షురాలు. 100 కు పైగా అంతర్జాతీయ కార్యక్రమాలకు వ్యాఖ్యాత్రిగా వ్యవహరించారు. ఇప్పటివరకు రెండు కథా సంపుటులు, రెండు కవితా సంపుటలు, ఒక పద్య శతకం, ఒక వ్యాస సంపుటి రచించారు. 

"ఈ శతకం తన ఆరవ పుస్తకం అని, విజయనగరంలో ఇందరు పెద్దల చేతులమీదుగా ఈ పుస్తకం ఆవిష్కరణ జరగడం చాలా సంతోషంగా ఉందని, ఆ అవకాశాన్ని అందించిన మంత్రివర్యులకు, జిల్లా అధికారులకు రాధిక ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

సింగపూర్ 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తదితర సభ్యులందరూ రాధికకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.త్వరలో మరల అంతర్జాతీయ స్థాయిలో "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు"వేదిక పై ఖతార్ దేశంలో దోహా నగరంలో ఈ శతకంలో పాటుగా రాధిక రాసిన మరొక వ్యాస సంపుటి కూడా ఆవిష్కరింపబడుతోందని హర్షం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com