నజఫ్గడ్ నవాబ్-వీరేంద్ర సెహ్వాగ్
- October 20, 2024
ప్రపంచ క్రికెట్లో వీరబాదుడికి కేరాఫ్ అడ్రస్ వీరేంద్ర సెహ్వాగ్. టెస్ట్, వన్డే, టీ20.. ఫార్మాట్ ఏదైనా సెహ్వాగ్ ట్రీట్మెంట్లో మాత్రం తేడా ఉండదు. క్రీజులో ఉన్నంత సేపు ప్రత్యర్థి బౌలర్ ఎవరనేది లెక్కచేయకుండా వీర బాదుడు బాదే ఏకైక ఆటగాడు సెహ్వాగ్ అనే చెప్పాలి. భారత డాషింగ్ ఓపెనర్‌గా తన విధ్వంసకర బ్యాటింగ్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్నప్పటికీ కామెంటేటర్‌గా, విశ్లేషకుడిగా భారత క్రికెట్ అభిమానులకు సెహ్వాగ్ దగ్గరగానే ఉన్నాడు. నేడు భారత దిగ్గజ క్రికెటర్, నజఫ్గడ్ నవాబుగా ప్రసిద్ధి గాంచిన వీరేంద్ర సెహ్వాగ్ పుట్టినరోజు.
వీరేంద్ర సెహ్వాగ్ 1978,అక్టోబర్ 20న ఢిల్లీ దగ్గర ఉన్న నజఫ్గడ్ అనే చిన్న పట్టణంలో జన్మించాడు. జామియా ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. చిన్నతనం నుంచి క్రికెట్ మీద ఆసక్తి ఉండటంతో తల్లి ప్రోత్సాహంతో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీల్లో మంచి ప్రతిభ కనబర్చి ఢిల్లీ తరుపున దేశవాళీ టోర్నీల్లో బాగా ఆడుతూ టీం ఇండియా సెలెక్టర్ల దృష్టిలో పడి 999లో తన మొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ పాకిస్థాన్ తో ఆడాడు. ఆ సిరీస్‌లో పేలవమైన ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోయాడు. 2000 చివర్లో తిరిగి జట్టులో చోటు సాధించి అద్భుతమైన ఆట తీరును కనబరుస్తూ బ్యాటింగ్ ఆర్డర్ లో టాప్ 4కు చేరుకున్నాడు. అప్పటి టీం ఇండియా సారథి సౌరవ్ గంగూలీ ప్రోత్సాహం తోడవడంతో జట్టులో సెహ్వాగ్ స్థానం స్థిరమైంది. ఆ తర్వాత గంగూలీ తన స్థానాన్ని వన్ డౌన్ కు మార్చుకొని సెహ్వాగ్ ను ఓపెనర్‌గా ప్రమోట్ చేశాడు. 2001లో సౌత్ ఆఫ్రికా సిరీస్ ద్వారా భారత టెస్ట్ జట్టులో చేరాడు.
ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్ బ్యాట్స్‌మెన్ అంటే.. గంటల తరబడి క్రీజులో ఉండాలి. కొన్ని వందల బంతులు ఆడాలి. ఓపికగా పరుగులు రాబట్టాలి. సునీల్ గవాస్కర్, గ్రాహం గూచ్, జెఫ్రే బాయ్‌కాట్ వంటి దిగ్గజ ఓపెనర్లు చేసింది అదే. ఆఖరికి వన్డేల్లో భీకర బ్యాట్స్‌మెన్‌గా పేరుతెచ్చుకున్న సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య, హర్షెల్లే గిబ్స్ వంటి వారు కూడా టెస్టులకు వచ్చేసరికి చాలా నెమ్మదిగా ఆడేవారు. కానీ వీరేంద్రుడి రాకతో దాని స్వరూపం మారిపోయింది. టెస్ట్ మ్యాచ్ ఆరంభం కూడా పొట్టి ఫార్మాట్‌లానే ఉండేది. అందుకే ఏ భారత బ్యాట్స్‌మెన్‌కు సాధ్యంకాని ట్రిపుల్ సెంచరీని బాదేశాడు. అదీ ఒకసారి కాదు.. రెండుసార్లు. 2004లో పాకిస్థాన్ మీద 309 పరుగులు చేసిన సెహ్వాగ్.. 2008లో దక్షిణాఫ్రికాపై 319 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో డాన్ బ్రాడ్‌మెన్, బ్రియాన్ లారాల తర్వాత రెండు ట్రిపుల్ సెంచరీలు బాదిన చేసిన ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. టెస్టుల్లో భారత జట్టు తరుపున అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.
2011 ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టు ఆడిన తోలి మ్యాచులో సెహ్వాగ్ చేసిన 175 పరుగులు భారత జైత్ర యాత్రకు నాంది పలికేలా చేసింది. ఆ టోర్నీలో జట్టు విజయానికి సెహ్వాగ్ తన వంతు పాత్ర పోషించి 28 ఏళ్ళ తర్వాత ఇండియా విశ్వవిజేతగా నిలవడంతో కీలకం అయ్యాడు. ఇవే కాకుండా, 2002 ICC ఛాంపియన్స్ ట్రోఫీ, 2007 T20 ప్రపంచ కప్ విజయాల్లో సెహ్వాగ్ కీలక సభ్యుడు. 251 వన్డేలు ఆడిన సెహ్వాగ్.. 35.05 సగటుతో 8273 పరుగులు చేశాడు. 15 సెంచరీలు బాదాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 219.ఇంక 104 టెస్టు మ్యాచుల్లో 49.34 సగటుతో 8586 పరుగులు సాధించాడు. 23 సెంచరీలు బాదాడు. 2015లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.
ఇంక ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ, పంజాబ్ జట్ల తరపున ప్రాతినిధ్యం వహించిన సెహ్వాగ్ తనదైన శైలిలో రాణించాడు. 96 మ్యాచులు ఆడి 28.89 సగటుతో 2629 పరుగులు చేశాడు. 2 సెంచరీలు బాదాడు.అత్యధిక వ్యక్తిగత స్కోర్ 122. తన తరంలో ఉన్న అన్ని జట్ల ఆటగాళ్లతో విధ్వంసకరమైన బ్యాట్స్‌మెన్‌గా ప్రశంసలు అందుకున్న ఏకైక వ్యక్తి వీరేంద్రుడు కావడం విశేషం. అలాగే, రిటైర్మెంట్ తర్వాత తాను 2011లో స్థాపించిన సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ బాధ్యతల్లో పూర్తిగా నిమగ్నమయ్యాడు. దానితో పాటుగా కామెంటేటర్‌గా, క్రికెట్ విశ్లేషకుడిగా సేవలందిస్తున్నాడు. అలాగే, వెటరన్ క్రికెటర్స్ టోర్నీల్లో పాల్గొంటున్నాడు.
సెహ్వాగ్ వ్యక్తిగత జీవితానికి వస్తే తన బంధువైన ఆర్తి ఆహ్లావత్ ను ప్రేమించి పెద్దల ఆశీర్వాదంతో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరబ్బాయిలు (ఆర్యవీర్, వేదాంత్). ఆర్తి లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. 2002లో అర్జున అవార్డు, 2010లో పద్మశ్రీ పురస్కారంతో పాటుగా అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకున్నాడు. సెహ్వాగ్ సెన్సాస్ ఆఫ్ హ్యూమర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటకు గుడ్‌బై చెప్పినప్పటి నుంచి ట్విట్టర్లో సెహ్వాగ్ చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడు. తన చమత్కార ట్వీట్లతో అందరినీ ఆకర్షిస్తున్న సెహ్వాగ్.. కింగ్ ఆఫ్ ట్విట్టర్‌గా వెలిగిపోతున్నాడు.ఇప్పటికీ సెహ్వాగ్ ఆడిన పాత మ్యాచ్‌ల హైలైట్స్ టీవీల్లో వస్తే చాలా మంది అభిమానులు కన్నార్పకుండా చూస్తారనడంలో అతిశయోక్తి కాదు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స