గిరిజన బెబ్బులి-కొమురం భీమ్
- October 22, 2024
ప్రపంచ చరిత్రలో ఆదివాసీల పోరాటాలు అపూర్వమైనవి. అవన్నీ భూమికోసం, భుక్తి కోసం, స్వయం పాలన కోసం జరిగినవి. కొండ కోనల్లో ప్రకృతితో సహజీవనం సాగించే గిరిపుత్రులకు అడవిపై హక్కు వారి సామాజిక న్యాయం. భారత దేశానికి ఆంగ్లేయుల రాకపూర్వమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల పరిధిలో క్రీ. శ.1240 నుంచి క్రీ. శ.1749 మధ్య గోండ్వానా రాజ్యంగా ఏర్పడ్డాయి. గోండ్వానాలో అంతర్భాగమైన ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల ఆదివాసీ ప్రజలు నిజాం నిరంకుశ పాలనలో నిర్బంధాలకు గురయ్యారు. 'జల్-జంగల్- జమీన్' అనే నినాదంతో ఆదిమ జాతుల వారికి స్వయం పాలన దక్కాలని రణభేరి మోగించి, నిజాం నవాబుకు గుండెల్లో సింహస్వప్నంగా మారాడు గిరిజనోద్యమ నాయకుడు కొమురం భీమ్. నేడు గిరిజన బెబ్బులి కొమురం భీమ్ జయంతి.
కొమురం భీమ్ 1901, అక్టోబర్ 22న నైజం రాజ్యంలోని ఉత్తర తెలంగాణ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో గోండు తెగకు చెందిన కొమురం చిన్నూమ్, సోంబాయి దంపతులకు జన్మించారు. తన చిన్నతనంలోనే నిజాం నవాబు అటవీ సిబ్బంది చేసిన దాడిలో తండ్రిని కోల్పోయారు. తర్వాత భీం కుటుంబం సుర్దాపూర్ గ్రామానికి మారింది. తనకు వారసత్వంగా వచ్చిన పోడు భూమిని సాగుచేసుకుంటున్న తరుణంలో నిజాం అనుయాయుడు ‘సిద్దిక్’ అనే జాగీర్దార్ ఆ భూమిని దురాక్రమణ చేయడంతో భీంకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రజాకార్లు గోండులతో వెట్టిచాకిరి చేయించే వారు. స్త్రీలపై అత్యాచారాలు, వస్తు దోపిడీ వంటి ఆరాచకాలకు పాల్పడ్డారు. వస్తు మార్పిడి తప్ప డబ్బు కండ్లజూడని అమాయక ఆదివాసులు అడవుల్లో పశువులను మేపినా, పొయ్యి కట్టెలు తెచ్చుకున్నా, బంబరు, ధూపపెట్టి అనే పేరుతో బలవంతంగా శిస్తులు వసూలు చేసేవారు.
రజాకార్ల దోపిడీ, దుశ్చర్యలను గోండులు ఖండించినందుకు జంగ్లాతోళ్లు స్థానిక జమీందార్లతో కలిసి జోడేఘాట్ పరిసరాల్లోని ఇండ్లను, పంటలను ధ్వంసం చేశారు. తెల్లదొరలపై ‘మన్యసీమ’లో1922 నుంచి1924 వరకు అల్లూరి సాగించిన మన్యం పోరాటం స్ఫూర్తితో కొమురం భీమ్ జోడేఘాట్ గుట్టల నుంచి నిజాం పాలకులపై 'జల్-జంగల్- జమీన్' అనే నినాదంతో ‘తుడుం’ మోగించారు. తమ భూములను అన్యాయంగా ఆక్రమించిన అరాచక తురక భూస్వామి ‘ సిద్ధిఖ్’ ను హతమార్చిన భీమ్ అసోం రాష్ట్రంలో తలదాచుకున్నారు.ఇక్కడి ఉద్యమానికి కాస్త విరామం ఏర్పడినా, అసోంలో కార్మిక ఉద్యమాలకు సారథ్యం వహించారు. తన సహచరుడు కుమ్రం సూరు ద్వారా చదువు నేర్చుకుంటూ రాజకీయం పట్ల అవగాహన పెంచుకున్నాడు. ఇంకా వెడ్మరాము, లచ్చువటేల్ లు భీమ్ ఉద్యమానికి సహకరించిన ప్రధాన అనుచరులు.
సూరు సాయంతోనే భీమ్ ఆదివాసి హక్కుల పోరాటానికి తగిన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆసిఫాబాద్ పరిధిలోని జోడేఘాట్, బాబేజరి, పట్నాపూర్, టోకెన్నావాడు, శివగూడ, చల్‌బరిడి, బీమన్ గొంది, కల్లేగావ్, అంకుశాపూర్, నర్సాపూర్, కేశగూడ, లైన్ పటల్ అనే12 గ్రామాలకు చెందిన యువకుల సైన్యంతో కొమురం భీమ్ ఆ ప్రాంతాలను కలిపి స్వతంత్ర గోండు రాజ్యంగా ప్రకటించాడు. అందుకు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ అబ్దుల్ సత్తార్ తో జరిపిన చర్చలు సఫలం కాలేదు. కులపెద్దల సలహా మేరకు తమ డిమాండ్లను అర్జీ రాసుకుని నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖానుకు విన్నవించడానికి హైదరాబాద్ వెళితే అధికారులు భీంకు అనుమతి ఇవ్వకపోవడమేగా అవమానించారు.
‘ఉద్యమంలో గెలిస్తే బతుకుతాం. వచ్చే తరాలు బతుకుతాయి. ఉద్యమం నశిస్తే పోరాట స్ఫూర్తయినా మిగులుతుంది. వెన్ను చూపడం తగదు. వెనుతిరుగేది లేదు’’ అని నినదించిన భీమ్ సందేశం భావితరాలకు స్ఫూర్తిదాయకం. చివరకు కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన రహస్య సమాచారంతో నిజాం సైన్యంతో జోడేఘాట్ గుట్టల్లో జరిగిన యుద్ధంలో కొమురం భీమ్ 1940, అక్టోబర్ 27న వీరమరణం పొందారు.
ఆనాటి కొమురం భీమ్ పోరాట ఫలితంగానే భారత రాజ్యాంగంలో ఆదివాసులకు అవసరమైన హక్కులను 5వ, 6వ షెడ్యూల్లో చేర్చడమే గాక వారికి ప్రత్యేకమైన రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఆదివాసీల ఆశాజ్యోతి కొమురం భీమ్ పోరాట స్ఫూర్తి సాయపడిందని చెప్పవచ్చు. స్వయంపాలన ఉద్యమానికి పితామహుడిగా నిలిచిన కొమురం భీమ్ చరిత్ర భావితరాలకు ఆదర్శనీయం.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి