గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు..!

- October 30, 2024 , by Maagulf
గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు..!

అమరావతి: కోట్లాది మంది భక్తుల ఆదరణ పొందుతున్న గోదావరి పుష్కరాలకు ముహూర్తం నిర్ణయించబడింది. దేశం మరియు విదేశాల నుంచి భక్తులు గోదావరి పుష్కరాలకు తరలిరానున్నారు, దీనితో ప్రభుత్వం మరియు స్థానిక నాయకులు అప్రమత్తమయ్యారు.అవసరమైన ముందస్తు చర్యలను చేపట్టడం ప్రారంభించారు. ఈ సారి గోదావరి పుష్కరాల నిర్వహణలో అనేక ప్రత్యేకతలు ఉంటాయి. తాజాగా పుష్కరాల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకోబడ్డాయి.

2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించబోతున్నారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ పుష్కరాల కోసం ప్రభుత్వ ఏర్పాట్లు మొదలయ్యాయి. 2015లో జరిగిన పుష్కరాల సమయంలో కొన్ని విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈసారి 8 కోట్ల మంది భక్తులు రానున్నారని అంచనా వేస్తున్నారు. అందుకని, గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేశారు. భక్తులకు సౌకర్యం కల్పించేందుకు అధికారులు ఇప్పటికే సీరియస్‌గా పని చేస్తున్నారు.                                                                                                                                            

అఖండ గోదావరి పుష్కరాలు-2027 ముసాయిదా యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధమైంది. భక్తులు అందరూ ఒకే ఘాట్‌లో కాకుండా, గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేస్తారు. ప్రస్తుత 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మంది రాబోతున్నారు. అదనంగా నాలుగు కొత్త ఘాట్ల అవసరాన్ని గుర్తించారు. యాత్రికుల బస ఏర్పాట్లపై చర్చలు జరిపారు. రాజమహేంద్రవరం పరిధిలో గోదావరి ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించారు. కార్పొరేషన్‌ రోడ్ల అభివృద్ధికి రూ.456.5 కోట్లతో, ఆర్‌ అండ్‌ బీ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.678.76 కోట్లతో ప్రతిపాదనలు చేసారు. సిటీ బ్యూటిఫికేషన్ మరియు ఐకానిక్ టూరిజం ప్రాజెక్టు కోసం రూ.75 కోట్లతో ప్రతిపాదించారు.

ఈ సారి గోదావరి పుష్కరాలకు జిల్లాను యూనిట్‌గా తీసుకుని శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని నిర్ణయించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలను ముందే ప్రణాళిక చేసుకుంటున్నామని మంత్రులు తెలిపారు. గోదావరి పుష్కరాలు 2047కి విజన్‌తో ముందుకు సాగుతాయి. దీని కోసం నిధులను సమీకరించి, సమగ్ర అభివృద్ధి యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు కార్యాచరణలో ఉన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గోదావరి పుష్కరాలపై ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com