విమాన ప్రయాణీకులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసిన భారత్

- November 05, 2024 , by Maagulf
విమాన ప్రయాణీకులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసిన భారత్

న్యూఢిల్లీ: విమాన ప్రయాణాల్లో ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. విమానాలు భూమట్టానికి 3,000 మీటర్ల (సుమారు 9,843 అడుగులు) ఎత్తుకు చేరుకున్న తర్వాత మాత్రమే ప్రయాణీకులు వైఫై, ఇతర ఇంటర్నెట్ సేవలను ఉపయోగించడానికి అనుమతి ఉంటుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

భారత గగనతలంలో ప్రయాణించే అన్ని విమానాలకు ఈ నిబంధన వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చింది.

కొత్త రూల్ ఎందుకు?
ఎయిర్‌క్రాఫ్ట్, మారిటైమ్ కమ్యూనికేషన్ రూల్స్- 2018ను సవరించి ఈ కొత్త నిబంధనను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రయాణీకుల సౌలభ్యం, వైమానిక కార్యకలాపాల భద్రత మధ్య సమతుల్యతను పాటించడమే లక్ష్యంగా ఈ సరికొత్త రూల్‌ను కేంద్రం తీసుకొచ్చింది. ఈ నూతన మార్గదర్శకాల ప్రకారం.. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను విమానం నిర్దేశించిన ఎత్తుకు చేరుకున్న తర్వాత మాత్రమే వినియోగించడానికి అవకాశం ఉంటుంది. టేకాఫ్‌తో పాటు విమానం ఎత్తుకు చేరుకునే సమయంలో ఫ్లైట్ కమ్యూనికేషన్ సిస్టమ్‌కు ఎలాంటి అంతరాయాలు ఎదురుకాకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ కొత్త నిబంధన ప్రత్యేకంగా భారత గగనతలానికి మాత్రమే వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. విమానం ఎత్తుకు చేరుకునే ప్రారంభ దశల్లో టెరెస్ట్రియల్ మొబైల్ నెట్‌వర్క్‌లకు (టవర్ల) సంబంధించిన అంతరాయాలను నిరోధించాలనే ఉద్దేశమే ఈ కొత్త నిబంధనకుు ప్రాథమిక కారణమని వివరించింది. మొబైల్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ భూ-ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం కలిగించే ఆస్కారం ఉందని, అందుకే ఈ పరిమితిని విధించినట్టు కేంద్ర ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ మారిటైమ్ కమ్యూనికేషన్ (సవరణ) రూల్స్, 2024ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

ఈ రూల్స్ ప్రకారం విమానం 3,000 మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత ఎలక్ట్రానిక్ పరికరాలను ఆన్‌బోర్డ్‌లో ఉపయోగించడానికి అనుమతించిన తర్వాత మాత్రమే.. ఇంటర్నెట్ యాక్సెస్ అందుబాటులో ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిబంధనను విమానయాన సంస్థలు తప్పనిసరిగా పాటించాలి. తద్వారా విమానంలో కనెక్టివిటీకి మరింత నిర్మాణాత్మకమైన రూపం ఇవ్వడంతో పాటు సురక్షితమైన విధానాన్ని అందించినట్టు అవుతుందని కేంద్ర పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com