ఇండియన్ క్రికెట్ రన్ మెషీన్ - విరాట్ కోహ్లీ
- November 05, 2024
అతనొక రన్ మెషీన్. రికార్డులు బద్ధలు కొట్టేందుకే పుట్టిన పురుగుల రారాజు. ఎంతటి లక్ష్యాన్నైనా సరే అవలీలగా కరిగించే ఛేజ్ మాస్టర్. అంతేకాదు ఈతరం క్రికెటర్లకూ ఆరాధ్యుడు. అథ్లెట్ ను తలపించే దేహధారుడ్యంతో ఎందురికో స్పూర్తిగా మారిన ఫిట్ నెస్ ఫ్రీక్..ఇన్ని ప్రత్యేకతలున్న ఆ ఆటగాడు ఎవరో కూడా భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. తన క్లాస్ ఇన్నింగ్స్ తో అభిమానులు గుండెల్లో నిలిచిపోయారు. నేడు విరాట్ కోహ్లీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
కోహ్లి 1988, నవంబర్ 5న ఢిల్లీలో నివసిస్తున్న పంజాబీ మూలాలున్న ప్రేమ్‌నాథ్ కోహ్లీ, సరోజ్ కోహ్లీ దంపతులకు జన్మించాడు. తండ్రి ప్రేమనాథ్ క్రిమినల్ లాయర్. కోహ్లీకి సోదరుడు వికాస్, సోదరి భావన ఉన్నారు.అండర్-19 ప్రపంచకప్ హీరోగా జట్టులోకి అడుగుపెట్టి, విలువైన ఆటగాడిగా, సమర్ధుడైన నాయకుడిగా జట్టుపై తనదైన ముద్రవేసిన కోహ్లి..2008 నుంచి 2024 వరకు వన్డే క్రికెట్‌లో మొత్తం 295 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 13906 పరుగులు చేశాడు. ఈ కాలంలో 50 సార్లు సెంచరీ ఇన్నింగ్స్‌లు సాధించగా, యాభై 72 సార్లు చేశాడు. వన్డేల్లో అత్యధిక 100 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, T20I) తన పేరు మీద అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను కలిగి ఉన్నాడు. 2008 నుండి మొత్తం 538 మ్యాచ్‌లు ఆడుతూ 21 సార్లు ఈ అవార్డును గెలుచుకున్నాడు. టెస్టుల్లో మూడుసార్లు, వన్డేల్లో 11సార్లు, టీ20ల్లో 7సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును అందుకున్నాడు. వన్డేల్లో సచిన్ సగటు 44కాగా, కోహ్లీది ఏకంగా 58. అంతలా కోహ్లీ వన్డేల్లో నిలకడగా రాణించాడు.
కోహ్లీ వ్యక్తిగత విషయానికొస్తే.. బాలీవుడ్ హీరోయిన్ అనుష్కా శర్మ(Anushka Sharma)ను 2017లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఓ షాంపూ యాడ్‌లో కలిసి నటించిన ఈ ఇద్దరూ .. ఆపై ప్రేమ పక్షుల్లా విహరించారు. చివరకు ఇరువురు కుటుంబాలను ఒప్పించి పెండ్లితో ఒక్కటయ్యారు. ఇటలీలోని ఓ రిసార్ట్‌లో వీళ్ల పెండ్లి అంగరంగ వైభవంగా జరిగింది. విరుష్కగా పాపులర్ అయిన ఈ జంటకు వామిక, అకాయ్ అనే పిల్లలు ఉన్నారు.
ఏ దేశంలో ఆడినా, పిచ్ ఎలాంటిదైనా, అవతల ఉన్నది ఎంతటి దిగ్గజ బౌలర్ అయినా కోహ్లీకి లెక్క ఉండదు. క్రీజులో అడుగుపెట్టాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. అలుపు సలుపు లేకుండా పరుగులు స్కోర్ చేయడమే అతడి పని. అందరూ ఇబ్బంది పడే ఛేదనలో మొనగాడిలా నిలబడి జట్టును గెలిపిస్తాడు. మామూలుగా ఒత్తిడి ఎక్కువైతే ఎలాంటి బ్యాటర్ అయినా తడబడతాడు. కానీ ఎంత ఒత్తిడి ఉంటే అంతగా రెచ్చిపోవడం అతడికే సాధ్యమవుతుంది. కోహ్లీని ఎవరైనా రెచ్చగొడితే, తనలోని అత్యుత్తమ ఆటగాడు బయటికి వచ్చేస్తాడు. అందుకే వేరే జట్ల మాజీ ఆటగాళ్లు, కోహ్లీతో పెట్టుకోవద్దని, అతణ్ని రెచ్చగొట్టొద్దని తమ ఆటగాళ్లకు సూచిస్తుంటారు. అంతలా ప్రమాదకరంగా మారిపోతాడు కింగ్ కోహ్లీ.
అయితే మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పటి కంటే ఛేజింగ్లో విరాట్ రెచ్చిపోతాడు. ఛేజింగ్లోనే విరాట్ రన్స్, శతకాలు, సగటు ఎక్కువగా ఉన్నాయి. విజయవంతమైన ఛేదనల్లో కోహ్లీ సగటు 90కి పైనే. అన్ని వన్డే ఛేదనల్లో కలిపి కోహ్లీ 27 శతకాలు సాధించాడు. భారత్ తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు 23 శతకాలు చేశాడు. స్వదేశంలో 24 సెంచరీలు సాధించిన కోహ్లీ, విదేశాల్లో 26 సార్లు మూడంకెల స్కోరు చేయడం విశేషం. సచిన్ మొత్తంగా 100 అంతర్జాతీయ శతకాలు సాధించగా, కోహ్లీ ప్రస్తుతం 80 సెంచరీలపై ఉన్నాడు. మధ్యలో రెండు మూడేళ్లు సెంచరీలు లేక ఇబ్బంది పడ్డాడు కానీ, లేదంటే సచిన్కు మరింత చేరువగా ఉండేవాడే. అయినప్పటికీ ఇంకో మూణ్నాలుగేళ్లు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగితే సచిన్ వంద శతకాల రికార్డును కూడా అందుకోవడం కష్టమేమీ కాకపోవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







