భారత రాజకీయ కురువృద్ధుడు - ఎల్.కె.అద్వానీ

- November 08, 2024 , by Maagulf
భారత రాజకీయ కురువృద్ధుడు - ఎల్.కె.అద్వానీ

ఎల్.కె.అద్వానీ... భారత రాజకీయ యావనికపై చెరగని ముద్ర వేసిన గొప్ప నాయకుడు. లోహ పురుషుడు, భారతీయ జనతా పార్టీ భీష్ముడు, రాజకీయ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఇలా చెప్పుకుంటే పోతే అద్వానీపై ఒక పెద్ద జాబితానే తయారవుతుంది. కరడు గట్టిన దేశ భక్తుడిగా, హిందుత్వవాదిగా ప్రజా జీవితాన్ని ప్రారంభించిన ఆయన, తన సహచరుడైన మహానేత వాజ్‌పేయీ అడుగుజాడల్లో అసలు సిసలైన ప్రజా నాయకుడిగా ఎదిగారు. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ప్రభంజనంలోనూ కమలదళానికి ఊపిరులు ఊదిన సిసలైన సారథిగా కార్యకర్తలు, ప్రజల హృదయాల్లో స్థిరపడిపోయారు. నేడు భారత రాజకీయ కురువృద్ధుడు ఎల్.కె.అద్వానీ గారి జన్మదినం. 

ఎల్.కె.అద్వానీగా సుపరిచితులైన లాల్ కృష్ణ అద్వానీ 1927,నవంబరు 8న అవిభక్త భారతదేశంలోని సింధీ రాష్ట్రంలోని కరాచీ పట్టణంలో సంపన్న సింధీ హిందూ వ్యాపార కుటుంబానికి చెందిన  కిషన్ చంద్ అద్వానీ, జియాని దేవి దంపతులకు జన్మించారు (దేశ విభజనలో  సింధీ రాష్ట్రం, కరాచీ నగరం పాకిస్తాన్ దేశంలో భాగమైంది). కరాచీలోనే డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత బాంబే యూనివర్సిటీ నుంచి లా కోర్స్ పూర్తి చేశారు.

అద్వానీ 14 ఏళ్ళ వయస్సులోనే ఆరెస్సెస్ లో బాల స్వయంసేవక్ గా చేరి, కరాచీ నగర సంఘ్ కార్యదర్శిగా పనిచేశారు. దేశ విభజన తర్వాత బాంబేకు తరలి రావడంతో ఆయన రాజస్థాన్ రాష్ట్రంలోని మత్స్య ప్రదేశ్ (భారత్ పూర్, అల్వార్, కోట, బూండీ, ఝాలావర్ ప్రాంతాలు)  ప్రాంత ప్రచారక్ గా 1947-1952 వరకు పనిచేశారు. సంఘ్ పెద్ద గురూజీ గోల్వాల్కర్ ఆశీస్సులతో జనసంఘ్ ప్రధాన కార్యదర్శి  దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గదర్శనంలో అద్వానీ జనసంఘ్ పార్టీలో చేరారు.

రాజస్థాన్ జనసంఘ్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన అద్వానీ తన పరిచయాలతో భైరాన్ సింగ్ షేఖావత్ లాంటి యువ రాజకీయ నాయకుడిని పార్టీలోకి ఆహ్వానించారు. షేఖావత్ - అద్వానీ ద్వయం వల్ల రాజస్థాన్ రాష్ట్రంలో జనసంఘ్ క్షేత్ర స్థాయిలో బలమైన నాయకత్వం కలిగిన పార్టీగా అవతరించింది. 1957లో ఎంపీగా ఎన్నికైన అటల్ బిహారీ వాజపేయ్ కార్యదర్శిగా ఢిల్లీకి వచ్చిన అద్వానీ, అనతికాలంలోనే వాజపేయ్ సన్నిహితుడిగా మారారు. పార్లమెంట్ సమావేశాల్లో, విదేశాల్లో వాజపేయ్ కు కావాల్సిన అంశాల మీద ఇంగ్లీష్ స్పీచులు  రాసిచ్చేవారు. ఒకపక్క వాజపేయ్ కార్యదర్శిగా కొనసాగుతూనే, మరోపక్క ఢిల్లీ జనసంఘ్ పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు.

ఢిల్లీ జనసంఘ్ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా అద్వానీ పనిచేశారు. 1966-67 వరకు ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్లో జనసంఘ్ పక్ష నేతగా వ్యవహరించారు. 1967-70 వరకు ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగారు. ఇదే సమయంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆకస్మిక  మరణం, పార్టీలో అంతర్గత వర్గ పోరు జరుగుతున్న సమయంలో వాజపేయ్ పక్షాన నిలిచి, ఆయన్ని పార్టీలో తిరుగులేని నాయకుడిగా చేశారు. పార్టీలో వాజపేయ్ పోటీదారులైన నానాజీ దేశముఖ్, బలరాజ్ మాధోక్ వంటి వారిని సమన్వయ పరచడంలో అద్వానీ పాత్ర మరువలేనిది. 1968లో జనసంఘ్ జాతీయ అధ్యక్షుడిగా వాజపేయ్ ఏకగ్రీవంగా ఎన్నికవ్వడంలో సైతం అద్వానీ కీ రోల్ పోషించారు. వాజపేయ్ ను ద్వేషిస్తూ, పార్టీ క్రమశిక్షణను ఉల్లఘించిన మాధోక్ వంటి వారి మీద వేటు వేయడంలో కూడా ముందున్నారు.

1970లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అద్వానీ, హిందీ సీమలో పార్టీ విస్తరణ, నిధుల సేకరణ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. 1971 ఎన్నికల్లో జనసంఘ్ 22 లోక్ సభ సీట్లే సాధించినప్పటికీ, ఓట్ల శాతం పరంగా కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించడంతో అద్వానీ శ్రమ ఉంది. నానాజీ దేశముఖ్ లాంటి కార్యనిర్వహణ సామర్థ్యం కలిగిన వ్యక్తిని పార్టీ బలోపేతానికి అద్వానీ చక్కగా ఉపయోగించుకున్నారు. 1973లో వాజపేయ్ వారసుడిగా జనసంఘ్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన అద్వానీ, ఆ పదవిలో 1977 వరకు కొనసాగారు. ఒక విధంగా చెప్పాలంటే జనసంఘ్ చివరి జాతీయ అధ్యక్షుడు అద్వానీనే కావడం విశేషం. అద్వానీ హయాంలో జనసంఘ్ పలు రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాల్లో కీలక భాగస్వామి అయ్యింది.

1975లో ఇందిరా గాంధీ విధించిన ఎమెర్జెన్సీలో జనసంఘ్ మరియు ఆరెస్సెస్ లు కలిసి పనిచేశాయి. మతతత్వ పార్టీగా ముద్రపడిన జనసంఘ్ పార్టీకి ఆ ముద్ర నుంచి బయటకు తీసుకురావడంలో అద్వానీ గారికి ఎమెర్జెన్సీ ఘట్టం బాగా లభించింది. ఈ సమయంలోనే కాంగ్రెస్ వ్యతిరేక పక్షాల నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడంలో జనసంఘ్ పాత్ర అపూర్వమైనది. అద్వానీ చాణక్యం, వాజపేయ్ సహృదయత, నానాజీ దేశముఖ్ అకుంఠిత కార్యదీక్ష వంటివి విపక్ష నేతల మైత్రిని సాధించిపెట్టాయి. ఎమెర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత 1977లో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో విపక్ష పార్టీలన్నీ విలీనమయ్యే ప్రతిపాదన రాగానే, అద్వానీ ఎటువంటి సంకోచం లేకుండా అంగీకరించారు. అలా, విపక్ష పార్టీలను విలీనం చేసి ఏర్పడిన జనతా పార్టీలో అద్వానీ, వాజపేయ్ లు ఎటువంటి ఉన్నతమైన పార్టీ పదవులను ఆశించలేదు.

1977 ఎన్నికల్లో ఇందిరా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి, జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అద్వానీ సమాచార & ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1977-79 వరకు ఆ శాఖ మంత్రిగా కొనసాగారు. 1979లో జనతా పార్టీలో వచ్చిన చీలికలు, పూర్వ జనసంఘ్ నాయకులపై వ్యక్తిగత అసూయ వంటి పలు కారణాల వల్ల జనతా పార్టీ నుంచి అద్వానీ, వాజపేయ్ మరియు ఇతర సీనియర్ పూర్వ జనసంఘ్ నేతలు సైతం బయటకు వచ్చారు. 1980 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఢిల్లీలో వాజపేయ్ నాయకత్వంలో అద్వానీ, భైరాన్ సింగ్ షెకావత్, రాజమాత విజయరాజే సింధియా వంటి పలువురు నేతలతో కలిసి భారతీయ జనతా పార్టీని స్థాపించారు.

భారతీయ జనతా పార్టీ లేదా భాజపా వ్యవస్థాపక అధ్యక్షుడిగా వాజపేయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా అద్వానీ చూసుకున్నారు. వాజపేయ్ నేతృత్వంలో భాజపా తన పూర్వ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి లౌకికవాద భావజాలం వైపు పరుగులు తీసింది. 1984లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో మనస్థాపం చెందిన వాజపేయ్ గారు భాజపా అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగడంతో ఆయన స్థానంలో పార్టీ సారథ్యాన్ని చేపట్టిన అద్వానీ, సంఘ్ పెద్దల సహకారంతో భాజపాను బలోపేతం చేస్తూ వచ్చారు. హిందుత్వవాద భావజాలం  వైపు పార్టీని నడిపిస్తూ, అయోధ్య రామమందిర నిర్మాణ బాధ్యతను భుజానకెత్తుకోవడంతో భాజపా వేగంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. 1989 సార్వత్రిక ఎన్నికల్లో 89 స్థానాలను కైవసం చేసుకోవడమే కాకుండా, యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన పాత్ర పోషించింది.

1990లో అద్వానీ చేపట్టిన అయోధ్య రథ యాత్ర ద్వారా భాజపాకు మరింత రాజకీయ మైలేజీ లభించింది. అయితే, బీహార్లో యాత్ర జరుగుతున్న లాలూ ప్రభుత్వం అద్వానీని అరెస్ట్ చేయడం ద్వారా అద్వానీ పట్ల దేశ ప్రజల్లో సానుభూతి పెరిగి, ఆయనకు జాతీయ రాజకీయాల్లో తిరుగులేని మాస్ లీడర్ ఇమేజ్ లభించింది. హిందూ హృదయ సామ్రాట్, లోహ పురుష్ గా ఆయన్ను కీర్తించడం ద్వారా   వ్యక్తి కేంద్రీకృత రాజకీయాలకు దేశంలో పునాది పడింది. అద్వానీ చరిష్మా భాజపాను తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత అద్వానీ ప్రాబల్యం మరింత పెరిగింది. ఎంతలా అంటే ఆయన్ని విమర్శిస్తే ఎన్నికల్లో ముస్లింల ఓట్లు గంపగుత్తగా పడే అంతలా ఆయనకు కరడుగట్టిన హిందుత్వవాదిగా ముద్రపడింది.

1991 ఎన్నికల్లో 120 సీట్లను కైవసం చేసుకొని కాంగ్రెస్ తర్వాత అతిపెద్దగా పార్టీగా అవతరించడమే కాకుండా, పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష హోదాను భాజపా దక్కించుకుంది. అద్వానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఈ ఐదేళ్ళలో భాజపా క్షేత్ర స్థాయిలో బలోపేతం కావడమే కాకుండా, రాజస్థాన్, గుజరాత్ మరియు శివసేనతో కలిసి మహారాష్ట్రలో అధికారాన్ని కైవసం చేసుకుంది. 1996 సార్వత్రిక ఎన్నికల నాటికి దేశ రాజకీయాల్లో భాజపా శక్తివంతమైన పార్టీగా అవతరించింది. 1996 ఎన్నికల్లో తనకు బదులు వాజపేయ్ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్లడం ద్వారా 161 సీట్లను సాధించి 11వ లోక్ సభలో అతిపెద్ద పార్టీగా నిలవడంలో అద్వానీ పాత్ర మరువలేనిది. 13 రోజుల పాటు వాజపేయ్ ప్రధానిగా పనిచేశారు.

1997లో స్వర్ణ జయంతి రథ యాత్రను చేపట్టిన అద్వానీ, భాజపాను మరింత విస్తరించడంతో కీలకంగా వ్యవహరించారు. 1998 ఎన్నికల్లో 180 సీట్లను కైవసం చేసుకున్న భాజపాను అధికారంలో కూర్చోబెట్టేందుకు ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ఎన్డీయే కూటమిని ఏర్పాటు చేసి కేంద్రంలో వాజపేయ్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు అయ్యేలా అద్వానీ దగ్గరుండి చూసుకున్నారు. వాజపేయ్ ఆహ్వానం మేరకు కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టి 1999 వరకు కొనసాగారు.

1999లో జయలలిత మద్దతు ఉపసంహరణతో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో సైతం మరోసారి 180 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించి ఎన్డీయే కూటమిలోని పార్టీల సహకారంతో మరోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అద్వానీ మరోమారు తోడ్పడ్డారు. 1999-2004 వరకు హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, 2002లో పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకు దేశ 7వ ఉపప్రధానిగా సైతం బాధ్యతలు చేపట్టి 2004 వరకు కొనసాగారు. 2004లో అద్వానీ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లిన భాజపా ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో పాటు అద్వానీ చరిష్మాను తగ్గించింది. 2004-09 వరకు ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగారు. ఇదే సమయంలో తన హిందుత్వ వాద ముద్రను చెరిపేసుకోవాలని చూసి పలు వివాదాల్లో చిక్కుకున్నారు. 2009 ఎన్నికల్లో సైతం అద్వానీ నాయకత్వం భాజపాను విజయతీరాలకు చేర్చలేకపోయింది. ఈ ఎన్నికల తర్వాత అద్వానీ రాజకీయ ప్రభ భాజపాలో తగ్గడం మొదలైంది.

2013లో జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో 2014 ఎన్నికల్లో భాజపాను విజయతీరాలకు చేర్చే బాధ్యతను అద్వానీ ప్రియ శిష్యుడైన, అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి కమలదళం పెద్దలు కట్టబెట్టారు. ఈ నిర్ణయంతో అద్వానీ ప్రత్యక్ష రాజకీయ జీవితం ముగిసిందని రాజకీయ మేధావులు సైతం తేల్చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో కమలం పార్టీ 272 సీట్లను కైవసం చేసుకోవడంతో అద్వానీ రాజకీయ జీవితం చరమాంకానికి వచ్చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వయోభారంతో ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలిగారు.      

భారతదేశ రాజకీయాల్లో వాజపేయ్-అద్వానీల జోడి గురించి ఎంత చెప్పుకున్న తక్కువనే చెప్పాలి. అద్వానీ రాజకీయాల్లోకి వచ్చేనాటికి వాజపేయ్ జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వాజపేయ్ రాజకీయ కార్యదర్శిగా, అనుచరుడిగా ఉన్న అద్వానీ, తదనంతర కాలంలో ఆయనకు అత్యంత ఆత్మీయుడిగా, స్నేహితుడిగా మారారు. వాజపేయ్ రాజకీయ జీవితంలో అద్వానీ పాత్ర ఎంత కీలకమో, అద్వానీ రాజకీయ ఎదుగుదలలో వాజపేయ్ పాత్ర అంతే కీలకం. జనసంఘ్ పార్టీలో దీన్ దయాల్ ఉపాధ్యాయ తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా వాజపేయ్ మారడంలో తెరవెనుక అద్వానీ అలుపెరుగని కృషి  ఉంది. భాజపాను స్థాపించిన తర్వాత జరిగిన 1984 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 2 సీట్లకే పరిమితం అయిన సమయంలో పార్టీ అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న  వాజపేయ్ మీద ఎటువంటి విమర్శలు రాకుండా అద్వానీ చూసుకున్నారు.

1985-1996 మధ్యలో భారత రాజకీయాల్లో వాజపేయ్ తన మునపటి ప్రభను కోల్పోయి కేవలం సాధారణ ఎంపీగానే కొనసాగుతున్న సమయంలో, అద్వానీ ఆయన్ని రాజకీయంగా తెరమరుగు కానీయకుండా కాపాడుకుంటూ వచ్చారు. ఇటువంటి అనేక అరుదైన సంఘటనలు అద్వానీ- వాజపేయ్ ల మధ్య ఎన్నో ఉన్నాయి. వీరిద్దరూ కలిసి భాజపాను దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా మార్చారు అని రాజకీయ మేధావులు సైతం ముక్త కంఠంతో అంగీకరిస్తారు. తమతో పాటుగా భైరాన్ సింగ్ షెకావత్, విజయరాజే సింధియా, కృష్ణ లాల్ శర్మ, మురళీ మనోహర్ జోషి, సుందర్ లాల్ పట్వా, జానా కృష్ణమూర్తి వంటి దిగ్గజ నేతలను సైతం రాజకీయంగా ఎదిగేందుకు తోడ్పడ్డారు. భారత రాజకీయ చరిత్రలో అద్వానీ- వాజపేయ్ ద్వయం ప్రస్తావన లేకుండా చెప్పుకోవడం అంటే అది అసంపూర్ణం అనే చెప్పాలి.

అద్వానీ రాజకీయాల్లో ఎందరో సామాన్య వ్యక్తులను సైతం తిరుగులేని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దారు. దివంగత అరుణ్ జైట్లీ, ప్రమోద్ మహాజన్, సుష్మ స్వరాజ్, కళ్యాణ్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీలు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వంటి పలువురు సీనియర్ భాజపా నేతలు ఆయన తీర్చిద్దిన వారే. ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సైతం పరోక్షంగా ఆయన వద్ద శిష్యరికం చేశారు.

భారత రాజకీయాల్లో 7 దశాబ్దాల పాటు క్రియాశీలకంగా వ్యవహరించిన అద్వానీ రెండు సార్లు రాజ్యసభకు, 1989-2019 మధ్యలో 7 సార్లు లోక్ సభ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. భారత రాజకీయాల్లో రైటిస్ట్ భావజాలానికి ప్రాచ్యుర్యం కల్పించిన నాయకుడిగా అద్వానీ చరిత్రలో నిలిచిపోయారు. రాగ ద్వేషాలకు అతీతంగా ప్రజా సేవే పరమావధిగా రాజకీయాలు చేసిన అద్వానీ గారికి 2015లో పద్మ విభూషణ్ పురస్కారాన్ని, 2024లో భారతరత్నను కేంద్రం ప్రధానం చేసింది.                  

- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com