తెలంగాణ రాజకీయ యోధుడు...!

- November 08, 2024 , by Maagulf
తెలంగాణ రాజకీయ యోధుడు...!

ఎనుముల రేవంత్ రెడ్డి ... రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత సుపరిచితమైన పేరు. విద్యార్ధి రాజకీయాల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిగా దాక సాగిన రేవంత్ రాజకీయ ప్రయాణం అంత సులువుగా సాగలేదనే చెప్పాలి. ప్రజా ఉద్యమాలు, పాదయాత్రలతో నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ, ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగిన నాయకుడు రేవంత్ రెడ్డి. సీఎంగా ఎన్నికైన నాటి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యతలో తలమునకలై ఉన్నారు రేవంత్. నేడు తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టిన రోజు.

రేవంత్ రెడ్డి 1969,నవంబర్ 8న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట తాలూకాలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో ఎగువ మధ్యతరగతి  రైతు కుటుంబంలో జన్మించారు. రేవంత్ తొలుత కొండారెడ్డి పల్లెలో చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసం భాగ్యనగరానికి చేరుకున్నారు. నారాయణగూడ రెడ్డి హాస్టల్లో ఉంటూ ఇంటర్ పూర్తి చేశారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ కళాశాల ఆంధ్ర విద్యాలయ కళాశాలలో బీఏ పూర్తి చేశారు.

రేవంత్ ఇంటర్ చదువుతున్న సమయంలోనే ఆరెస్సెస్ అనుబంధ విద్యార్ధి సంఘం ఎబివిపిలో చేరారు. డిగ్రీ చదువుతున్న సమయంలో బర్కత్ పురలోని సంఘ్ కార్యాలయంలో జాగృతి మాస పత్రికకు లే అవుట్ ఆర్టిస్టుగా పనిచేశారు రేవంత్. విద్యార్ధి దశ తర్వాత దశాబ్దం పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగిన రేవంత్, కేసీఆర్ స్థాపించిన తెరాస పార్టీలో చేరారు. ఆ పార్టీ నేత హరీష్ రావుతో సన్నిహిత పరిచయం కూడా అప్పుడే ఏర్పడింది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస తరుపున ఎన్నికల ప్రచారం చేసిన రేవంత్ 2006లో రంగారెడ్డి జిల్లా మిడ్జచల్ జెడ్పిటిసిగా ఎన్నికయ్యారు. 2007లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ  తెదేపా మద్దతుతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2008లో చంద్రబాబు సమక్షంలో తెదేపాలో రేవంత్ చేరారు.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా తరుపున మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో రేవంత్ ముందుండేవారు. తెదేపా అధినేత చంద్రబాబు ప్రోత్సాహంతో పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్రలతో కలిసి కాంగ్రెస్ మీద చేసిన అనేక పోరాటాలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెదేపా మీద కేసీఆర్ బృందం చేసిన అసత్య ప్రచారాలను తిప్పికొట్టడంలో రేవంత్ ముందుండేవారు. తెదేపా తెలంగాణ ఎమ్యెల్యేల పక్ష ఉపనేతగా రేవంత్ ఆరోజుల్లో చాలా యాక్టివ్ రోల్ ప్లే చేసేవారు.

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో తెదేపా తరుపున కొడంగల్ నుంచి రెండోసారి ఎమ్యెల్యేగా ఎన్నికైన రేవంత్, అసెంబ్లీలో తెదేపా శాసనసభా పక్ష ఉపనేతగా ఎన్నికయ్యారు. ఎర్రబెల్లి, తలసాని వంటి సీనియర్ నేతలు తెరాసలోకి వెళ్లిపోవడంతో అసెంబ్లీలో శాసనసభా పక్ష నేతగా 2015లో బాధ్యతలు చేపట్టి తెరాస ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద అసెంబ్లీ లోపల, బయట పోరాటాలు నడిపించారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో తెరాస ప్రభుత్వం రేవంత్ ను అన్యాయంగా అరెస్ట్ చేయడం ద్వారా, ఆయన పట్ల ప్రజల్లో సానుభూతి పెరిగింది. ఈ అరెస్ట్ రేవంత్ రాజకీయ జీవితాన్ని సైతం మలుపు తిప్పింది.

అప్పటి సీఎం కేసీఆర్ ను ధైర్యంగా ఎదురించగలిగిన సత్తా ఉన్న ఏకైక ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ ప్రజల గుర్తింపు పొందారు. తెదేపాను తెలంగాణాలో లేకుండా చేయాలనే లక్ష్యంతో ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఎమ్యెల్యేలను తెరాసలో చేర్చుకున్న కేసీఆర్ మీద పోరాటానికి సరైన వేదిక కోసం రేవంత్ వెతుకుతున్న సమయంలోనే  కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం రావడంతో, తెదేపాకు రాజీనామా చేసి కాంగ్రెస్ పెద్దలైన సోనియా, రాహుల్ గాంధీల సమక్షంలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తరుపున 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్ ఓటమి కోసం కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించి తొలిసారి ప్రజా క్షేత్రంలో ఓటమిని రేవంత్ చవిచూశారు. అయినప్పటికీ అధైర్య పడకుండా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్ గిరి లోక్ సభ నుంచి పోటీ చేసి ఎంపిగా ఎన్నికయ్యారు.

ఎంపీగా ఎన్నికైన మొదటి రోజు నుంచే తన పనితీరుతో కాంగ్రెస్ అధిష్టానం వద్ద మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఢిల్లీ రాజకీయాల్లో రేవంత్ రెడ్డికి విస్తృతమైన పరిచయాలు ఏర్పడ్డాయి. ఢిల్లీ రాజకీయాల్లో తీరికలేకుండా గడుపుతున్నప్పటికీ, తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రేవంత్, కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ సమాజం గురవుతున్న దోపిడీకి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు, తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలు చేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ శ్రమను గుర్తించిన కాంగ్రెస్ అధిష్ఠానం, ఆయన్నే సీఎంగా ఎంపిక చేసింది. రాజకీయాల్లోకి వచ్చిన రెండు దశాబ్ధాల్లోనే రేవంత్ తన పనితీరుతో తెలంగాణ ప్రజల్ని, కాంగ్రెస్ పెద్దల్ని ముఖ్యమంత్రి అయ్యారు.

రేవంత్ వ్యక్తిగత జీవితానికి వస్తే, ఆయనది ప్రేమ వివాహం. రాజకీయ దిగ్గజం, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సోదరుని కుమార్తె గీతాను ప్రేమించి పెద్దల ఆశీర్వాదంతో వివాహం చేసుకున్నారు. వీరికి పాప నైమిషా ఉంది. రేవంత్ రెడ్డికి మొత్తం ఏడుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. పెద్దన్న భూపల్ రెడ్డి రిటైర్డ్ ఎస్సై, రెండో అన్న కృష్ణారెడ్డి, మూడో అన్న తిరుపతి రెడ్డి కొడంగల్ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా పని చేశాడు. నాల్గొవ సోదరుడు జగదీశ్వర్ రెడ్డి యూఎస్‌లో స్ధిరపడ్డాగా మరో ఇద్దరు సోదరులు కొండల్ రెడ్డి, కృష్ఱారెడ్డి హైదరాబాద్‌లో వ్యాపారాలు చేస్తున్నారు. మరో సోదరుడు కొండల్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు కవల సోదరులు.        
 
రేవంత్ సీఎంగా ప్రస్తుతం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే పనిలో పడ్డారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ప్రజలకు సుపరిపాలనను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఐటీ రంగంలో రాజధాని హైదరాబాద్ కున్న గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచడమే కాకుండా, అభివృద్ధిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వికేంద్రీకరించేందుకు కృషి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ అభివృద్ధి నమూనాను భారతదేశం మొత్తం చెప్పుకుంటుందని రేవంత్ నిశ్చయంగా చెబుతున్నారు. అందుకు తగినట్లుగానే లక్ష్యాలను నిర్దేశించుకొని పనిచేస్తున్నారు.      

- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com