విస్తారా చివరి ఫ్లైట్ కి కన్నీటితో వీడ్కోలు పలికిన సిబ్బంది
- November 13, 2024
ముంబై: విస్తారా ఎయిర్ లైన్స్ భారతదేశంలో మూడవ అతిపెద్ద దేశీయ విమాన సంస్థ. విస్తారా తన సేవలను ప్రారంభించినప్పటి నుండి ప్రయాణికులకు అధిక ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు అందించడంలో ప్రసిద్ధి చెందింది. ఈ సంస్థ తన సేవలను అంతర్జాతీయ వ్యాప్తంగా విస్తరించి ప్రయాణికుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించిన విస్తారా ఎయిర్ లైన్స్ ఇకపై కనిపించదు.
విస్తారా ఎయిర్ లైన్స్ చివరి సారిగా నవంబర్ 12 2024న ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎగిరింది. చివరి సారిగా ఎగిరిన విమానానికి సిబ్బంది ఎంతో భావోద్వేగంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో సిబ్బంది ప్రయాణికులు కలిసి ఈ చివరి విమానానికి ఘనంగా వీడ్కోలు పలికారు.
విమానం ల్యాండ్ అయిన తర్వాత సిబ్బంది మరియు ప్రయాణికులు కలిసి ఫోటోలు తీసుకున్నారు. సిబ్బంది తమ అనుభవాలను, విస్తారాలో పనిచేసిన స్మృతులను పంచుకున్నారు.
విమానాశ్రయంలో సిబ్బంది, ప్రయాణికులు కలిసి “కల్ హో నా హో” అనే బాలీవుడ్ పాటను ప్లే చేసి, ఆ పాటతో భావోద్వేగంగా వీడ్కోలు పలికారు.ఈ పాట వింటూ, సిబ్బంది మరియు ప్రయాణికులు తమ కళ్లలో ఆనందభాష్పాలతో ఈ ఘట్టాన్ని ముగించారు. ప్రస్తుతం ఈ సంస్థ ఎయిర్ ఇండియాలో విలీనం అయింది. ఈ విలీనం 2024 నవంబర్ 12న పూర్తయింది.
విస్తారా ఎయిర్ లైన్స్ చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సంస్థ 2013లో టాటా సన్స్ మరియు సింగపూర్ ఎయిర్‌లైన్స్ మధ్య సంయుక్త భాగస్వామ్యంగా స్థాపించబడింది. 2015 జనవరి 9న విస్తారా తన తొలి విమానాన్ని ఢిల్లీ నుండి ముంబైకి ప్రారంభించింది. ఇంకా విస్తారా తన అంతర్జాతీయ సేవలను 2019 ఆగస్టులో ఢిల్లీ నుండి సింగపూర్‌కు ప్రారంభించింది.
విస్తారా ఎయిర్ లైన్స్ తన సేవలను ప్రారంభించినప్పటి నుండి 50 మిలియన్లకు పైగా ప్రయాణికులకు సేవలందించింది. 2022 జనవరిలో టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను సొంతం చేసుకున్న తర్వాత, విస్తారాను ఎయిర్ ఇండియాలో విలీనం చేయాలని నిర్ణయించారు. ఈ విలీనం ద్వారా విస్తారా విమానాలు, మార్గాలు మరియు సిబ్బంది ఎయిర్ ఇండియా కింద కొనసాగుతాయి.ఇప్పుడు విస్తారా ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియాలో విలీనం కావడంతో ప్రయాణికులకు మరింత విస్తృతమైన సేవలు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఈ విలీనం ద్వారా ప్రయాణికులకు మరింత మెరుగైన ప్రయాణం లభిస్తుందని కోరుకుందాం.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







