నైటింగేల్ ఆఫ్ సౌతిండియా - పి.సుశీల

- November 13, 2024 , by Maagulf
నైటింగేల్ ఆఫ్ సౌతిండియా - పి.సుశీల

సినీ సంగీతంపై వాలిన ఆ కోకిల హాయిహాయిగా, మధురాతిమధురంగా ఆలపిస్తుంటే కొన్ని తరాలు మైమరిచి ఆలకించాయి. వేలవేల పాటలు ఆమె మంత్రగళంలో జీవం పోసుకుని.. పరిమళం అద్దుకున్నాయి. కొత్త అందచందాలతో శ్రోతల వీనుల విందు చేశాయి. హృదయాలను రసభరితం చేశాయి. ఆమే దక్షిణాది లతామంగేష్కర్‌గా పి.సుశీల పేరొందారు. నేడు గాన కోకిల పి.సుశీల గారి పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని గాన లహరులనూ, స్వర మధురిమలనూ నెమరువేసుకుందాం.

సంగీతాభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు సుశీల. దక్షిణాది గానకోకిలగా ఫేమస్ అయిన సుశీలమ్మ 1935 నవంబర్ 13న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని విజయనగరంలో ఒక సంపన్నకుటుంబంలో జన్మించారు. ఈమె తండ్రి పి.ముకుందరావు క్రిమినల్ లాయరుగా పని చేసేవారు. తల్లి శేషావతారం గృహిణి.  ఆమె తల్లిదండ్రులిద్దరికీ సంగీతం అంటే ప్రాణం. యం.యస్.సుబ్బలక్ష్మి అంతటి గాయనిని చేయాలదే ఆమె తండ్రి కోరిక. దాంతో చిన్నప్పుడే ద్వారంపూడి వెంకటస్వామి నాయుడు వద్ద శాస్త్రీయ సంగీతం నేర్పించారు.

మొదట్లో ఆలిండియా రేడియోలో ఆలపించేది సుశీల. ఆమె లోని గానమాధుర్యాన్ని గుర్తించిన ప్రముఖ సంగీత దర్శకుడు పెండ్యాల ..కన్నతల్లి అనే తెలుగు సినిమాలో పాడే అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. పెండ్యాల నుంచి ఇప్పటి ఏ.ఆర్.రహమాన్ వరకు ఎందరో గొప్ప సంగీత దర్శకులు ఆమె గాత్రాన్ని సంగీతాభిమానులకు చేరువ చేసారు. చిరకాలం నిలిచిపోయే పాటలనిచ్చారు.. చిన్నప్పటి నుంచి సుశీలకు శాస్త్రీయ సంగీతం కన్నా...సినిమా పాటలపై మోజు ఎక్కువగా ఉండేది. లతా మంగేష్కర్, జిక్కి, భానుమతి వంటి గాయనీ మణుల పాటలను వింటూ ప్రాక్టీస్ చేస్తుండేది. దాంతో పాటు విజయనగరం మహారాజ కళాశాలలో సంగీతంలో డిప్లోమా పూర్తి చేశారు.

 ఆ తర్వాత సంగీత విద్వాన్  కోర్సు కోసం మద్రాసుకు మకాం మార్చారు. ఆ నిర్ణయమే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. చిత్రపరిశ్రమకు చేరువగా ఉండటంతో.. సినిమా రంగంలో అడుగు పెట్టెందుకు మార్గం సులువైంది. సుశీలకు కోరస్ సింగర్ గా తొలి అవకాశం లభించింది. ఆమె సినీరంగ ప్రవేశం చేసిన 1952 నాటికే బాలసరస్వతీదేవి. జిక్కి, పి.లీల, ఎం.ఎల్‌. వసంతకుమారి లాంటి ప్రతిభావంతులన గాయనులుండేవారు. వారి మధ్య తన ఉనికిని చాటుకోవటం అంత సులువైన పని కాదు. ఆమె మొదటి పాట 'కన్నతల్లి' చిత్రంలోది. పెండ్యాల సంగీత దర్శకత్వంలో ఎందుకు పిలిచావెందుకు అన్న ఆ పాటను ఎ.ఎం రాజాతో కలిసి పాడారు.

తెలుగులో 1955 నుంచీ చాలాకాలం వరకూ సుశీల పాటలేని చిత్రం దాదాపు లేకపోయింది. 1960 - 1970ల మధ్య తొలి భాగం వరకూ ఆమె కెరియర్‌లోనే అత్యుత్తమమని సంగీతభిమానులు భావిస్తారు. "1980 తర్వాత సినిమాలో వేగం పెరిగింది. 'గుగ్గుగ్గుగ్గు గుడిసుంది' లాంటి పాటలు పాడనన్నా నాచేత పాడించారు. అవి మరోతరం ప్రేక్షకులకు నన్ను దగ్గర చేశాయి" అంటారు సుశీల. తెలుగు సినీసంగీత స్వర్ణయుగ చరిత్రంలో ఆమెది ఘనతర ఆధ్యాయం! ఆరు దశాబ్దాల్లో 12 భాషల్లో (తెలుగు, తమిళం కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళ్లు పడుగు, సింహళీస్, మరాఠీ) దాదాపు 40 వేలకు పైగా పాటలు పాడారు. ఆ ఘనత అందుకున్న అతికొద్ది గాయనీ మణుల్లో ఆమె ఒకరు. భారతదేశంలో లతా మంగేష్కర్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అరుదైన గాయనీ మణి సుశీల కావడం విశేషం.

సుశీల గానం ప్రత్యేకతలు ఏమిటి? పాటలోని ప్రతి పదం చక్కగా వినపడేంత స్పష్టత. సన్పివేశానుగుణంగా భావయుక్తంగా సహజంగా తీయగా పాడటం. ఏ హీరోయిన్‌కు పాడితే అచ్చం ఆమె గొంతే అనిపించే గానం మరో విశిష్టత. ఆనాటి గొప్ప సంగీత దర్శకులైనా...పెండ్యాల, సుసర్ల, సాలూరి, ఆదినారాయణరావు, కె.వి.మహదేవన్, సత్యం, యం.యస్.విశ్వనాథన్ వంటివారంతా సుశీలతోనే పాడించేవారు. అలాగే ఘంటసాల కూడా తన సంగీత దర్శకత్వంలో పాటలన్ని ఆమెకే ఇచ్చేవారు. అది సుశీల మార్క్ గొప్పతనం. ఘంటసాల, సుశీల కాంబినేషన్ తర్వాత 70వ దశకంలో.. బాలుతో ఆమె కాంబినేషన్ కు మంచి పేరొచ్చింది.  

దాదాపు మూడు దశాబ్దాలకు పైగా..దక్షిణాది చిత్ర సీమను సుశీలమ్మ తిరుగులేని గాయినిగా ఏలారు. గాయకుల్లో ఘంటసాలకు ఎంత ఫాలోయింగ్ ఉందో ...గాయనీమణుల్లో సుశీలమ్మకు అంతే ఫాలోయింగ్ ఉంది. నేటి తరం గాయనీగాయకులకు ఆమె పాటే పెద్దబాలశిక్ష. ఇక 80లలో చక్రవర్తి, కె.వి.మహదేవన్, రమేష్ నాయుడు వంటి వారు సుశీలతోనే పాడించేవారు. ఆ తర్వాత ఆమె ప్రాభవం తగ్గుతూ వచ్చింది. అయినా ఆమె పాటలకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

సుశీల గాన మాధుర్యానికి ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. ఐదు సార్లు జాతీయఅవార్డులు అందుకున్న గాయనీ మణిగా రికార్డు సృష్టించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ గాయనిగా ఆరు నందులు ఆమెను వరించాయి. అలాగే వివిధ స్టేట్ గవర్నమెంట్ అవార్డులు ఆమె ప్రతిభను వెతుక్కుంటూ వచ్చాయి. ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారంతో పాటు.... తమిళ నాడు గవర్నమెంటు నుంచి కలైమామణి వంటి పురస్కారాలు ఆమెను వరించాయి. 2008లో కేంద్రం  పద్మభూషణ్ తో గౌరవించింది. ఈ కోకిలమ్మ మరిన్ని వసంతాలు చూస్తూ మరెన్నో అవార్డులు సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.

- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com