సినిమా రివ్యూ: ‘మట్కా’

- November 14, 2024 , by Maagulf
సినిమా రివ్యూ: ‘మట్కా’

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కి మంచి హిట్టొచ్చి చాలా కాలమే అయ్యింది.అయితే, ‘మట్కా’ తొలి పోస్టర్ నుంచీ అంచనాలు నమోదు చేసింది. టీజర్, ట్రైలర్లు ఆ అంచనాల్ని రెట్టింపు చేసుకుంటూ వచ్చాయ్. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించారు. మరి రిలీజ్‌కి ముందు అంచనాలు పెంచిన ‘మట్కా’ వరుణ్ తేజ్‌కి కలిసొచ్చిందా.? లేదా.? అంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
బర్మా నుంచి శరణార్ధిగా విశాఖ పట్నానికి వస్తాడు వాసు (వరుణ్ తేజ్). శరణార్ఱుల శిబిరంలో చిన్న పిల్లాడైన వాసుకి ప్రసాద్ ( సత్యం రాజేష్) పరిచయమవుతాడు. అక్కడ అనుకోకుండా జరిగిన ఓ గొడవ వల్ల వాసు జైలుకెళ్లాల్సి వస్తుంది. తిరిగొచ్చిన వాసు, కొబ్బరి కాయల వ్యాపారం చేసే  అప్పల్ రెడ్డి (అజయ్ ఘోష్) వద్ద పనికి కుదురుతాడు. అలా కొబ్బరి కాయల కొట్టులో పని చేసే వాసు పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్‌గా ఎలా ఎదిగాడు.? వాసుని ఇష్టపడి ప్రేమించి, పెళ్లి చేసుకున్న సుజాత (మీనాక్షి చౌదరి) కథేంటీ.? వాసు జీవితంలో ఎంపీ నానిబాబు (కిషోర్), సోఫియా (నోరా ఫతేహి)లకు ప్రత్యేకత ఏంటీ.? మట్కా కింగ్‌గా చెలామణీ అవుతున్న వాసుని పట్టుకోవడానికి సీబీఐ ఆఫీసర్ సాహు (నవీన్ చంద్ర) ప్రయత్నాలు ఫలించాయా.? అంచెలంచెలుగా ఎదిగిన మట్కా కింగ్ వాసు కథ చివరికి ఏ కంచెకి చేరింది.? తెలియాలంటే ‘మట్కా’ ధియేటర్లలో చూడాల్సిందే.

నటీ నటుల పని తీరు:
నో డౌట్.! ఈ సినిమా వరుణ్ తేజ్‌ని నటుడిగా నెక్స్‌ట్ మెట్లు ఎక్కించిందనడంలో అతిశయోక్తి లేదు. తొలి సినిమా నుంచీ వరుణ్ తేజ్ కథల ఎంపికలో తనదైన హవా ప్రదర్శిస్తూనే వున్నాడు. కొన్నిసార్లు తప్పటడుగులు వేసినప్పటికీ తనలోని నటుడికి ప్రతీ కథా సవాల్ విసిరేలాగే ప్లాన్ చేసుకుంటాడు వరుణ్ తేజ్. అలాంటిదే ‘మట్కా’లోని వాసు పాత్ర కూడా. డిఫరెంట్ వేరియేషన్లున్న పాత్రలో వరుణ్ తేజ్ చక్కగా ఒదిగిపోయాడు. ఫిజిక్ దగ్గర్నుంచీ, హావ భావాలు పండించడం.. 90ల కాలం నాటి వ్యక్లుల నడక, నడత.. ఇలా చాలా మేకోవర్ చూపించాడు. అందుకు హ్యాట్సాఫ్ అనాల్సిందే. ప్రియురాలు, భార్యగా నటించిన మీనాక్షి చౌదరికి ఈ సినిమాలో కాస్త స్కోపున్న పాత్రే దక్కిందని చెప్పొచ్చు. అలాగే నోరా ఫతేహి వ్యాంప్ రోల్ అయినా గుర్తుండిపోయే ప్రత్యేకమైన పాత్రలో కనిపించి మెప్పించింది. సత్యం రాజేష్, అజయ్ ఘోష్ తదితరులు తమకు అలవాటైన పాత్రల్లో తేలిగ్గా నటించుకుంటూ పోయారు. సలోని చాలా కాలం తర్వాత కనిపించింది. ఓ సర్‌ప్రైజింగ్ రోల్ నటించి మెప్పించింది. నవీన్ చంద్రకు తనకు కొట్టిన పిండి అయిన పాత్రే దక్కింది.  మిగిలిన పాత్రధారులు తమ తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
‘పలాస’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి సినిమాల్ని ప్రేక్షకుడికి కన్విన్సింగ్‌గా తెరకెక్కించడంలో సక్సెస్ అయిన చిన్న డైరెక్టర్ కరుణ్ కుమార్. అలాంటి ఓ డైరెక్టర్‌కి మెగా హీరోల్లో వరుణ్ వంటి హీరో దొరకడం.. అది కూడా ‘మట్కా’ వంటి కథతో రావడం నిజంగా గొప్ప విషయమే. అయితే, ప్రచార చిత్రాల్లో చూపించినంతగా ఈ సినిమాలో యాక్షన్ ఘట్టాలు అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. పొట్ట చేత పట్టుకుని వచ్చిన హీరో, ఏకంగా మట్కా కింగ్‌లా ఎదిగాడంటే ఆ క్రమంలో ఎన్నో రకాల సంఘర్ణణలుంటాయ్. కానీ, అవేమీ ఆశించిన రీతిలో ప్రేక్షకుడ్ని ఎంగేజ్ చేయవు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ఈ పాటికే చాలా చాలా కథలొచ్చాయ్. మట్కా ఆట నేపథ్యం ఈ సినిమాకి కొత్త కథా వస్తువే. ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని వరుణ్ తేజ్‌తో తెరపై చూపించాడు డైరెక్టర్. డైలాగ్స్ కట్టిపడేస్తాయ్. అలాగే సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ జీవి ప్రకాష్ మ్యూజిక్. సన్నివేశానికి తగ్గట్టుగా, నేటివిటీకి తగ్గట్లుగా ఇచ్చిన బీజీఎమ్ సినిమాని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. అక్కడక్కడా ఎడిటింగ్ కత్తెరల అవసరముంది. కానీ, ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లుగా వున్నాయ్. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ వర్క్ బాగుంది.

ప్లస్ పాయింట్స్:
వెండితెరకు ఇంతవరకూ పరిచయం కాని ‘మట్కా’ ఆట, ఆయా వేరియేషన్స్‌లో వరుణ్ తేజ్ పర్‌ఫామెన్స్, హీరో కటౌట్‌కి తగ్గట్లుగా చిత్రీకరించిన యాక్షన్ ఘట్టాలు, కింద స్థాయి నుంచి పై స్థాయికి హీరో ఎదిగిన తీరు తెరపై ఆవిష్కరించిన విధానం..

మైనస్ పాయింట్స్:
పాటల్ని సరైన సిట్యువేషనల్‌లో సింక్ చేయకపోవడం, కొన్ని సన్నివేశాలు ఇక్కడ ఇది అవసరమా.? అనిపించేలా వుండడం (పాప కిడ్నాప్ సమయంలో వచ్చే పాట గట్రా),  సాగతీతగా అనిపించిన సన్నివేశాలు..

చివరిగా:
సారా పాతదే కొత్త సీసాలో వేసి సీల్ చేశారంతే.! ఈ సినిమా క్లైమాక్స్‌లో వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్ తరహాలో ఈ సినిమా కథ పాతదే.. చాలా సినిమాల్లో చాలా సార్లు చూసేశాం. అయితే కథనంలో కొంత కొత్తదనం ప్రయత్నించారు.. మరి ‘మట్కా’కి అది వర్కవుట్ అయ్యిందా.? డిజప్పాయింట్ చేసిందా.? అనేది తెలియాలంటే ఆ బాధ్యత సినిమా చూసిన ప్రేక్షకులకే వదిలేయాలంతే.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com