ఐరెన్ లేడి అఫ్ ఇండియా
- November 19, 2024
78 ఏండ్ల స్వాతంత్ర్య భారతావనికి మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. ఆమె 49 ఏళ్ల వయసులోనే పదవీ బాధ్యతలు స్వీకరించారు. నాలుగు సార్లు ప్రధానిగా సుమారు16 ఏండ్లకు పైగా దేశానికి సేవలందించారు. ఇందిరాగాంధీ అంటేనే.. ధైర్యం, ఆత్మవిశ్వాసం, తెగువ, అంకుఠిత దీక్ష, సాధికారత వంటివి గుర్తుకు వస్తాయి. ఒక మహిళగా ప్రపంచస్థాయి నేతలతో పోటీ పడి దేశాన్ని పాలించిన రాజనీతిజ్ఞురాలు. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి ఆమె పెట్టింది పేరు. ఇందిర తన పాలనా కాలంలో వ్యవసాయం నుంచి అంతరిక్షం, దేశ ఆర్థిక స్వావలంబన నుంచి అణుశక్తి దాకా ఎన్నో అంకురార్పణలకు ఆద్యురాలు. నేడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి
ఇందిర పాలన తొలినాళ్లలో ఆనాటి ప్రతి పక్ష నేతలు ఆమెపై వ్యంగ్యాస్త్రాలు సంధించా రు. ఆమె ధైర్యసాహసాలను కూడా కీర్తించారు. ఇందులో సోషలిస్ట్ నేతలు రామ్ మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్, కాంగ్రెస్ నేత మొరార్జీదేశాయ్ వంటివారు ముందు వరుసలో ఉంటారు. తొలిసారి ప్రధాని పదవిని చేపట్టాక ఆమె పాలన , ప్రసంగ తీరును హేళన చేస్తూ.. రామ్ మనోహర్ లోహియా..‘ గూంగీ గుడియా’అంటూ వ్యంగ్యంగా సంబోధించారు.
తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్ ) విముక్తికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడంతో జనసంఘ్ నాయకుడు, అటల్ బిహారీ వాజ్ పేయి ఇందిరను ‘దుర్గాదేవి’గా అభివర్ణించారు. జయప్రకాశ్ నారాయణ్ ‘ ఇందిరా హఠావో.. దేశ్ బచావో’ నినాదంతో దేశవ్యాప్తంగా తిరిగారు. గూంగీ గుడియాగా అవహేళనకు గురైన స్థాయి నుంచి బంగ్లాదేశ్కు విముక్తి ప్రదాతగా ఆమెను అంతర్జాతీయంగా 'ఐరన్ లేడీ'గా ప్రశంసించే పతాకస్థాయి దాకా ఎదిగారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఇందిర పేరిట అత్యున్నత పురస్కారం ఏర్పాటు చేసి తొలిసారి ఆమెకు అవార్డును ప్రదానం చేసింది. అంతర్జాతీయంగా భారత పేరును ఇందిర మార్మోగించారు. ఆమె ప్రతిష్ట ‘ఇండియా అంటే ఇందిర.. ఇందిర అంటే ఇండియా’గా మారిపోయింది.
1966 జనవరిలో ఇందిర ప్రధానిగా తొలిసారి పదవి చేపట్టాక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 1962లో చైనాతో యుద్ధంలో భారత్ ఓటమి తర్వాత దేశ ఆర్థికవ్యవస్థ క్షీణించింది. మూడో పంచవర్ష ప్రణాళికను ఆపి వేశారు. వార్షిక ప్రణాళికలు అమలు చేశారు. దేశ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కారణమైన కొఠారీ కమిషన్ సిఫారసులను అమల్లోకి తెచ్చారు.1967 పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆమె విజయం సాధించి రెండోసారి ప్రధాని అయ్యాక..1968లో హరిత విప్లవం ద్వారా అధిక దిగుబడిని ఇచ్చే గోధుమ, వరి వంగడాలను సృష్టించి, భవిష్యత్ తరాలకు ఆహార కొరత రాకుండా కృషి చేశారు. 1969లో 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు.
1970లో శ్వేత విప్లవం ద్వారా పాడిపరిశ్రమను వృద్ధిలోకి తెస్తూ.. దేశమంతటా మిల్క్ గ్రిడ్‌కు రూపకల్పన చేశారు. దేశ ప్రగతికి ఆర్థిక భారమైన రాజ భరణాలను రద్దు చేశారు. 20 సూత్రాల పథక కార్యక్రమం అమలు చేశారు. పేదల సంక్షేమానికి పక్కా ఇల్లు నిర్మాణం, ఉపాధి కల్పన, భూమి పంపిణీ వంటివి ప్రారంభించారు. దళిత, గిరిజన, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఎనలేని కృషి చేశారు. అంతరిక్షంలోకి తొలి భారతీయుడిని పంపారు. అక్కడికి వెళ్లిన వ్యోమగామి రాకేశ్ శర్మతోనూ ఆమె మాట్లాడారు. 1972 ఎన్నికల్లో ‘గరీబీ హఠావో’ నినాదంతో మూడోసారి అధికార పీఠమెక్కారు.1974లో పోఖ్రాన్ లో అణుశక్తి పరీక్షలు జరిపి అగ్రదేశాలను ఇండియా వైపు చూసేలా చేశారు. 1976లో దేశ రాజ్యాంగ పీఠికలో లౌకిక, సామ్యవాద పదాలను చేర్చారు.
1984లో పంజాబ్ లోని స్వర్ణ దేవాలయంలో చొరబడిన వేర్పాటు వాదుల ఏరివేతకు చేపట్టిన సైనిక ఆపరేషన్ ‘బ్లూ స్టార్’ తో తీవ్ర ఆరోపణలు, విమర్శలను ఎదుర్కొన్నారు. అనంతరం తన అంగరక్షకుల చేతిలోనే ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. దేశంలో తొలిసారి హత్యకు గురైన ప్రధాని ఆమెనే. భారతరత్న పొందిన తొలి మహిళా ప్రధాని కూడా ఆమె. ఇందిరాగాంధీ హత్యకు గురికాకుండా ఉండి ఉంటే దేశపాలన మరోలా ఉండేదని భావించేవారు ఇప్పటికీ ఉన్నారు.
ఇప్పటికీ మారుమూల పల్లెల్లోని ప్రజలు ఇందిరాగాంధీ సేవలను, చేపట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుని కొనియాడతారు. తెలుగు రాష్ట్రాల ప్రజలైతే ఆమెను ఇప్పటికీ ప్రేమగా ‘ఇందిరమ్మ’ అనే పిలుస్తుంటారు. పేదలకు ఇండ్ల నిర్మాణం, భూమి పంపిణీ, సంక్షేమ పథకాలకు ఆద్యురాలిగా ఇందిరమ్మను తెలుగు ప్రజానీకం గుర్తుచేసుకుంటూనే ఉంటున్నది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







