సినిమా రివ్యూ: ‘మెకానిక్ రాకీ’

- November 22, 2024 , by Maagulf
సినిమా రివ్యూ: ‘మెకానిక్ రాకీ’

‘గామి’ అనే ప్రయోగాత్మక చిత్రం, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వంటి మాస్ చిత్రాల తర్వాత తర్వాత మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నుంచి వచ్చిన తాజా చిత్రమే ‘మెకానిక్ రాకీ’. ఈ సినిమాకి తనదైన శైలిలో ప్రమోషన్లు చేశాడు విశ్వక్ సేన్. మరి, ఆ ప్రమోషన్లు ఫలించాయా.? సినిమా హిట్ ట్రాక్ ఎక్కిందా.? తెలియాలంటే, ఈ రోజు అనగా నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మెకానిక్ రాకీ’ సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
నగుమోము రాకేష్ అలియాస్ రాకీ (విశ్వక్ సేన్) ఇంజనీరింగ్ మధ్యలోనే ఆపేసి, తన తండ్రి వద్ద మెకానిక్ షెడ్‌లో పని చేస్తుంటాడు. మెకానిక్ వర్క్ చేస్తూనే డ్రైవింగ్ స్కూల్ కూడా రన్ చేస్తుంటాడు రాకీ. ఈ క్రమంలోనే అక్కడి లోకల్ డాన్ తన మెకానిక్ షెడ్డును కబ్జా చేయాలనుకుంటాడు. ఎలాగోలా ఆ మెకానిక్ షెడ్‌ని, తన డ్రైవింగ్ స్కూల్‌ని కాపాడుకోవాలనుకుంటాడు రాకీ. మరోవైపు తన వద్ద డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చిన ఇద్దరమ్మాయిలు మాయ (శ్రద్ధా శ్రీనాధ్), ప్రియ (మీనాక్షి చౌదరి). కాలేజీలో చదువుకున్నప్పుడు తాను ప్రేమించిన అమ్మాయే ప్రియ అని తెలుస్తుంది రాకీకి. అయితే, తన ప్రేమ గురించి చెప్పాలనుకున్న టైమ్‌లో అనూహ్య పరిస్థితుల్లో చదువు మానేయాల్సి రావడం.. ఆ అమ్మాయే మళ్లీ తన వద్దకు డ్రైవింగ్ నేర్చుకోవడానికి రావడం జరుగుతాయ్. అయితే, కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ప్రియ గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయ్ రాకీకి. ఆ షాకింగ్ విషయాలేంటీ.? తన ప్రేమను మెకానిక్ రాకీ దక్కించుకున్నాడా.? అలాగే తన మెకానిక్ షెడ్ కబ్జాకి గురి కాకుండా ఆపుకోగలిగాడా.? మాయ, రాకీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది.? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే, ‘మెకానిక్ రాకీ’ ధియేటర్లలో చూడాల్సిందే.

నటీ నటుల పని తీరు:
ఎప్పటిలాగే విశ్వక్‌సేన్ తన పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. తనదైన కామెడీ పండించడంతొ పాటూ ఎమోషనల్ సీన్లలోనూ తనదైన పర్‌ఫామెన్స్ బాగా పండించాడు. హీరోయిన్లలో శ్రద్ధా శ్రీనాధ్ ఓ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్. మెయిన్ లీడ్ హీరోయిన్ అయిన మీనాక్షి చౌదరి తనదైన నటనతో ఆకట్టుకుంది. అందంగా కనిపిస్తూనే, మంచి ప్రాధాన్యత వున్న పాత్రలు దక్కాయ్ వీరిద్దరికీ. మిగిలిన పాత్రల్లో సునీల్, నరేష్, హర్ష చెముడు, రఘు తదితరులు తమ తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
దర్శకుడు రవితేజ ఈ సినిమా కోసం ఓ మంచి కథను ఎంచుకున్నాడు. అయితే, తొలి అర్ధ బాగాన్ని కనెక్టింగ్‌గా నడిపించడంలో విఫలమయ్యాడు. కానీ, సెకండాఫ్‌కి వచ్చేసరికి కథ ట్రాక్ ఎక్కేసింది. వరుస ట్విస్టులతో సినిమాని ఫాస్ట్‌గా నడిపించాడు. ఫస్టాఫ్‌లో అనిపించిన బోర్ ఫీలింగ్ అంతా, సెకండాఫ్‌కి వచ్చేసరికి తీరిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాతే కథ డిఫరెంట్ మలుపు తిరుగుతుంది. ఈ తరం ప్రేక్షకులతో పాటూ, మిడిల్ క్లాస్ ప్రేక్షకులకీ బాగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. మిడిల్ క్లాస్ వాళ్లకు జరిగే అన్యాయాలు, వారి అవసరాల్ని అవకాశంగా మార్చుకుని బతికే మోసగాళ్ల సంఘటనల్ని సెకండాఫ్‌లో బాగా చూపించారు. రకరకాల స్కామ్స్‌ని టచ్ చేసి లైటర్ వింగ్‌లో చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే, భావోద్వేగా సన్నివేశాల్ని ఇంకాస్త ఎఫెక్టివ్‌గా చూపించి వుంటే బాగుండేది. సెకండాఫ్‌లో వచ్చి పోయే ప్రతీ పాత్రా ప్రేక్షకుడిపై ప్రత్యేకమైన ప్రభావం చూపిస్తుంటుంది. ఫైనల్‌గా క్లైమాక్స్‌ని ఎండ్ చేసే విధానం కూడా బాగుంటుంది. నిర్మాణ విలువలకు ఎక్కడా వంక పెట్టడానికి లేదు. అలాగే కెమెరా పనితనం కూడా బాగుంది. మరో ప్లస్ పాయింట్ ఈ సినిమాకి బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. సినిమాని నెక్స్‌ట్ లెవల్‌లో తీసుకెళ్లి కూర్చోబెట్టింది బిజోయ్ బీజీఎమ్. అయితే, స్టోరీ పరంగా పాటలు కాస్త డిస్ర్టబెన్స్ అనిపిస్తాయ్. సీరియస్ మూడ్‌ని పాటలు డైవర్ట్ చేసేశాయన్న ఫీల్ కలుగుతుంది. ఫస్టాఫ్‌పై దర్శకుడు ఇంకాస్త ఎక్కువ దృస్టి పెట్టి వుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ వర్క్ గుడ్.

ప్లస్ పాయింట్స్:
సెకండాఫ్‌లో వచ్చే ట్బిస్టులు, విశ్వక్ సేన్ నటన, ఇంటర్వెల్ బ్యాంగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్..

మైనస్ పాయింట్స్:
బోరింగ్ ఫస్టాఫ్, కథ సీరియస్ మోడ్‌లో సాగుతున్న టైమ్‌లో అడ్డంగా వచ్చిన కామెడీ సన్నివేశాలు..

చివరిగా:
‘మెకానిక్ రాకీ’  అక్కడక్కడా కాస్త రిపేర్లున్నప్పటికీ ఫర్వాలేదు. ఫస్టాఫ్ సో సోగా అనిపించినా సెకండాఫ్ ట్విస్టుల్ని ఎంజాయ్ చేయొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com