సోషలిస్టు, రాజకీయ మల్ల యోధుడు
- November 22, 2024
ఆయన తన రాజకీయ గురువైన సోషలిస్టు దిగ్గజం లోహియా స్పూర్తితో ఓ సమాంతర ప్రజాస్వామ్య వేదికను సృష్టించారు. కాంగ్రెస్ వారసత్వాన్ని సవాల్ చేసి జాతీయ నేతగా ఎదిగారు. భారతీయ జనతా పార్టీ దూకుడుకు కళ్లెం వేసి.. తన శక్తియుక్తులతో వామపక్ష సిద్ధాంతాలను తిప్పికొట్టారు. ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో తమగళం వినిపించేందుకు బాటలు వేశారు. రాష్ట్రాల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వాలు పరిశీలించే పరిస్థితులు తెచ్చారు. అంతటి ఛరిష్మ కలిగిన నాయకుడు.. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్. బడుగు, బలహీన వర్గాల అభ్యన్నతికి ఆయన చేసిన కృషి విశేషమైనది. నేడు సోషలిస్టు రాజకీయ దురంధరుడు ములాయం సింగ్ యాదవ్ జయంతి.
ములాయం సింగ్ యాదవ్ 1939, నవంబర్ 22న యునైటెడ్ ప్రావిన్స్ లోని ఇటావా బ్లాక్ సైఫై గ్రామంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో సుఘర్ సింగ్ యాదవ్, మూర్తిదేవి దంపతులకు జన్మించారు.చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సమయంలో మల్ల యోధుడిగా కుస్తీ పోటీల్లో పాల్గొని గెలుస్తూ అందులో వచ్చిన డబ్బులతో చదువుకున్నారు. ఇటావాలోని ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలో డిగ్రీ, షికోబాద్ పట్ణణంలోని ఏ.కె కళాశాలలో వ్యాయమ శిక్షక కోర్స్, ఆగ్రా యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు కర్హల్ లోని జైన్ ఇంటర్ కళాశాలలో PETగా పనిచేశారు.
ములాయం సింగ్ చదువుకుంటున్న రోజుల్లో సోషలిస్టు నేతలైన జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియాల పట్ల ఆరాధన భావాన్ని కలిగి ఉండేవారు.
అప్పటి సోషలిస్టు పార్టీ యువనేత, మాజీ ప్రధాని చంద్రశేఖర్ స్ఫూర్తిత్తో విద్యార్ధి రాజకీయాల్లో అడుగుపెట్టి ఆనతి కాలంలోనే, లోహియాకు దగ్గరయ్యారు. లోహియా నాయకత్వంలోని సంయుక్త సోషలిస్టు పార్టీలో చేరి, ఆయన శిష్యరికంలో రాజకీయ నాయకుడిగా రాటుదేలారు. 1967 ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జశ్వంత్‌నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అక్కడి నుంచి ములాయం రాజకీయ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది.
1970లలో చరణ్ సింగ్, రాజ్ నారాయణ్ వంటి సోషలిస్టు ఉద్దండులతో కలిసి పనిచేసిన ములాయం.. 1975 ఎమెర్జెన్సీ సమయంలో అరెస్ట్ అయ్యి 19 నెలలు జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న సమయంలోనే సోషలిస్టు, ఇతర విపక్ష పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నారు. 1977లో జనతా పార్టీ తరపున యూపీ అసెంబ్లీకి పోటీ చేసి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 1977-80 మధ్యలో రామ్ నరేష్ యాదవ్, బనారసీ దాస్ మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. 1980లో జనతాపార్టీ విచ్చిన్నం తర్వాత చరణ్ సింగ్ నేతృత్వంలోని లోక్ దళ్ పార్టీ యూపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1982-85 వరకు యూపీ శాసనమండలిలో ప్రతిపక్షనేతగా వ్యవహరించారు.
1985లో చరణ్ సింగ్ కుమారుడు అజిత్ సింగ్ లోక్ దళ్ వ్యవహారాల్లో క్రియాశీలకం కావడంతో, తన కుమారుడి ఎదుగుదల కోసం చరణ్ సింగ్ ములాయంను రాజకీయంగా సైడ్ లైన్ చేయడం మొదలు పెట్టడంతో, లోక్ దళ్ పార్టీ నుంచి వేరుపడి 1986లో క్రాంతికారీ మోర్చా పార్టీని ములాయం ఏర్పాటు చేశారు. 1989లో కాంగ్రెస్ వ్యతిరేకంగా సోషలిస్టులు అందరూ కలిసి తమ పార్టీలను విలీనం చేసి జనతాదళ్ పార్టీని స్థాపించారు. ములాయం సైతం తన పార్టీని జనతాదళ్ పార్టీలో విలీనం చేశారు. అదే ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను మట్టి కరిపించి జనతాదళ్ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంలో ములాయం పాత్ర కీలకం. జనతాదళ్ అగ్రనేతలైన చంద్రశేఖర్, దేవీలాల్ ఆశీస్సులతో 1989లో ములాయం మొదటి సారి యూపీ సీఎంగా ఎన్నికయ్యారు.
1990 ప్రారంభంలో భాజపా అగ్రనేత అద్వానీ తలపెట్టిన అయోధ్య రథయాత్ర సమయంలో, దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో అయోధ్యలోని బాబ్రీ మసీదును ముట్టడించిన కరసేవకులపై కాల్పులు జరిపించి మెజారిటీ హిందూ వర్గానికి దూరమయ్యారు. ఇదే అద్వానీని అయోధ్యలోకి ప్రవేశించకుండా అరెస్ట్ చేయించి ముస్లిం మైనారిటీ రక్షకుడిగా ఎదగాలనుకున్న సమయంలోనే అద్వానీని బీహార్లో అరెస్ట్ అవ్వడం, కేంద్రంలో జనతాదళ్ ప్రభుత్వం పడిపోవడం చకచకా జరిగిపోయాయి. ఇదే సమయంలో మండల్ కమిషన్ రిజర్వేషన్లు విషయంలో యూపీ వ్యాప్తంగా నిరసనలు చెలరేగడంతో యాదవులు, ముస్లిములు తప్ప మిగిలిన అన్ని వర్గాల ప్రజలు ములాయంకు దూరంగా జరిగారు.
జనతాదళ్ పార్టీలో చీలిక ఏర్పడి చంద్రశేఖర్, దేవీలాల్ ఆధ్వర్యంలో ఏర్పడిన సమాజ్‌వాదీ సోషలిస్టు పార్టీలోకి చేరిన ములాయం తన సీఎం పీఠాన్ని కాపాడుకోగలిగారు. 1991లో మారిన రాజకీయ సమీకరణలతో చంద్రశేఖర్ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకుంది. యూపీలో అదే పార్టీ మద్దతుతో కొనసాగుతున్న ములాయం ప్రభుత్వం కూడా కుప్పకూలింది. 1991లో జరిగిన యూపీ శాసనసభ మధ్యంతర ఎన్నికల్లో ములాయం సారథ్యంలోని సమాజ్‌వాదీ సోషలిస్టు పార్టీ ఓటమి పాలైంది. 1992లో సమాజ్‌వాదీ సోషలిస్టు పార్టీ నుంచి వేరుపడి సమాజ్‌వాదీ పార్టీని ములాయం స్థాపించారు. తన రాజకీయ గురువు లోహియా సిద్ధాంత భావజాలమే, తమ పార్టీ సిద్ధాంతాలుగా ఆయన ప్రకటించుకున్నారు. తమ పార్టీ ఎన్నికల గుర్తుగా దక్షిణ భారతదేశానికి చెందిన తెదేపాను ఆదర్శంగా తీసుకోని సైకిల్ ను ఎంచుకున్నారు.
యూపీలో ఏర్పడ్డ భాజపా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే 1992 డిసెంబర్ 6 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన జరిగిందని ఆరోపిస్తూ, కేంద్రంలో ఉన్న పివి నరసింహారావు సర్కార్ భాజపా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి .. రాష్ట్రపతి పాలనను విధించింది. 1993 డిసెంబర్‌లో యూపీ శాసనసభ ఎన్నికలు జరగగా.. రామ మందిర్ నినాదంతో భాజపా మళ్లీ అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. కానీ కాన్షిరాం నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీతో చేతులు కలిపిన ములాయం.. కమలనాథుల అవకాశాలకు గట్టి దెబ్బకొట్టారు. యాదవులు, దళితులు, ముస్లింల ఓట్లను కూడగట్టడం ద్వారా 1993లో ములాయం రెండోసారి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు.
1994 చివర్లో బీఎస్పీ అగ్రనాయకురాలు మాయావతి మీద సమాజ్‌వాదీ కార్యకర్తల దాడిని నిరసిస్తూ, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ చేయడంతో ములాయం సీఎం పదవికి రాజీనామా చేశారు. 1996లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మెయిన్ పురీ నుంచి ఎంపీగా ములాయం ఎన్నికయ్యారు. కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1996-98 నుంచి దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్ ప్రభుత్వాల్లో రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో వాజపేయ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓటమి పొందిన తర్వాత, కాంగ్రెస్ తరపున సోనియా గాంధీని దేశ ప్రధానిగా ఎన్నుకోవడానికి నిరాకరించి, 1999 లోక్ సభ ఎన్నికలకు ఒక విధంగా కారకులయ్యారు.
2003లో మాయావతి రాజీనామాతో సీఎం అయ్యేందుకు సామదాన భేద దండోపాయాలను ఉపయోగించడంతో పాటుగా తన రాజకీయ బంటు అమర్ సింగ్ ద్వారా స్వతంత్ర ఎమ్యెల్యేలను తనవైపు తిప్పుకొని మూడో సారి సీఎం అయ్యారు. సుమారు నాలుగేళ్ళ పాటు సీఎంగా ఉన్న ములాయం 2007 ఎన్నికల్లో తన పార్టీ ఓటమి చవి చూడటంతో యూపీ బాధ్యతలను తన కుమారుడు అఖిలేష్ యాదవ్ కు అప్పగించి లోక్ సభకు పరిమితం అయ్యారు. యూపీ అసెంబ్లీకి 10 సార్లు ఎమ్యెల్యేగా, 7 లోక్ సభకు ఎంపీగా ఎన్నికయ్యారు.
ముఖ్యమంత్రిగా ఉత్తర్ప్రదేశ్‌ను ములాయం అభివృద్ధి పథంలో నడిపించారు. యూపీలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టడమే కాకుండా, పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు. తన పారదర్శక పాలనతో అన్ని వర్గాలను తన వెంట నడిపించుకోగల సమర్థుడైన నేతని ములాయం అని ప్రత్యర్థులే కొనియాడేలా చేసుకున్నారు. చివరి రోజుల్లో అధికారంలో లేకున్నా ములాయం ప్రయత్నం వల్ల ఏకమైన లౌకిక ప్రాంతీయశక్తులకు కేంద్రంలో తమగళం వినిపించే అవకాశం దొరికింది. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీలు రాష్ట్రాల న్యాయమైన డిమాండ్లు, హేతుబద్ధంగా పరిశీలించక తప్పని పరిస్థితులకు ములాయం మార్గం చూపారు. 2022, అక్టోబరు 10న అనారోగ్యంతో 82వ ఏట కన్నుమూశారు.
- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!