అదానీపై కేసు.. స్పందించిన అమెరికా అధ్యక్ష భవనం

- November 22, 2024 , by Maagulf
అదానీపై కేసు.. స్పందించిన అమెరికా అధ్యక్ష భవనం

వాషింగ్టన్‌: అమెరికాలో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీపై కేసు నమోదుకావడం గ్లోబల్‌గా చర్చనీయాంశమైంది. సౌర విద్యుదుత్పత్తి సరఫరా ఒప్పందాలు చేసుకోవడానికి భారత్‌లో రూ. 2,029 కోట్ల లంచాలు ఇచ్చారని, ఆ సొమ్ము కోసం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించారని గౌతమ్‌ అదానీ సహా ఏడుగురిపై కేసు నమోదైంది. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ స్పందించింది. ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమించగలవని విశ్వాసం వ్యక్తం చేసింది.

వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి కరీన్‌ జీన్‌ పియర్‌ తన రోజువారీ మీడియా సమావేశంలో అదానీ గ్రూప్‌ వ్యవహారం గురించి స్పందించారు. అదానీపై కేసు నమోదైన విషయం మా దృష్టికి వచ్చింది. ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంచ్‌ కమిషన్‌, న్యాయశాఖనే సరైన సమాచారం ఇవ్వగలదు. భారత్‌ -అమెరికా మధ్య సంబంధాలు ఎప్పటిలాగే బలంగా ఉన్నాయి. అనేక అంశాలపై సహకారం అందించుకుంటున్నాం. మిగతా సమస్యల మాదిరిగానే ప్రస్తుత సంక్షోభాన్ని కూడా ఇరు దేశాలు అధిగమించగలవు. రెండు దేశాల మధ్య బంధం బలమైన పునాదిపై నిలబడిందని కరీన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

కాగా, అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీతో పాటు సాగర్‌ అదానీ, వినీత్‌ ఎస్‌.జైన్‌, అజూర్‌ పవర్‌ సీఈఓ రంజిత్‌ గుప్తా తదితరులు లంచాల పథకానికి కీలక పాత్రధారులని ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ చట్టం (FCPA) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో గౌతమ్‌ అదానీ సహా మరికొందరిపై అమెరికా కోర్టు అరెస్ట్‌ వారంట్లు జారీ చేసినట్లు కొన్ని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. 20 ఏళ్లలో 2 బిలియన్‌ డాలర్ల లాభం కోసం సౌర విద్యుత్‌ కొనుగోలులో అధిక ధరలు పెట్టించి, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నత వర్గాలకు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com