సక్సెఫుల్ యంగ్ డైరెక్టర్-అనిల్ రావిపూడి

- November 23, 2024 , by Maagulf
సక్సెఫుల్ యంగ్ డైరెక్టర్-అనిల్ రావిపూడి

నవతరం దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకత పంథాలో సాగుతున్నారు అనిల్ రావిపూడి. చూడగానే బాగా తెలిసిన కుర్రాడిలా కనిపిస్తారు. అతనిలో అంత విషయం ఉందని ఒహ పట్టానా నమ్మబుద్ధి కాదు.కెరీర్‌ ప్రారంభంలో తన మాటలతో గారడీ చేసిన హిట్ దర్శకుడిగా మారి మేజిక్‌ చేస్తున్నారు. అనిల్ తీసిన వినోదాల విందుల గురించి తెలియగానే ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది. ‘పటాస్’లో ఆయన పంచిన పకపకలు, ‘సుప్రీమ్’లో అనిల్ పెట్టిన కితకితలు, ‘రాజా ది గ్రేట్’, ఎఫ్2లలో గిలిగింతల చిందులు జనం మరచిపోలేక పోతున్నారు. ఆ తరువాత వచ్చిన అనిల్ రావిపూడి చిత్రాల్లోనూ అదే తంతు. పొట్టలు చేత పట్టుకొని నవ్వడమే ప్రేక్షకుల వంతయింది. నేడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి పుట్టినరోజు.

అనిల్ రావిపూడి 1982, నవంబర్ 23న ఉమ్మడి ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలంలోని చిలుకూరువారి పాలెం గ్రామంలో రావిపూడి బ్రహ్మయ్య, అనంత లక్ష్మి దంపతులకు జన్మించారు. అనిల్ చిన్నప్పుడే వాళ్ళ ఫ్యామిలీ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అమరవాయి ప్రాంతానికి వెళ్లి అక్కడ భూములు కొని వ్యవసాయం చేసుకుంటూ స్థిరపడింది. అనిల్ స్కూల్లో ఉన్నప్పుడే సినిమాల మీద ఆసక్తి పెరిగింది. తర్వాత కొంతకాలానికి తండ్రి బ్రహ్మయ్యకు ఆర్టీసీలో డ్రైవర్‌గా ఉద్యోగం రావడంతో వారి కుటుంబం తిరిగి స్వగ్రామానికి దగ్గర ఉన్న అద్దంకి పట్టణంలో స్థిరపడింది. గుంటూరులో టెన్త్, ఇంటర్మీడియట్ పూర్తి చేసి, వడ్లమూడిలోని ‘విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ’లో ఇంజనీరింగ్ చేరిన అనిల్ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్స్, కల్చరల్ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొనేవారు.

కాలేజీలో ఉన్నప్పుడే మూవీ డైరెక్టర్‌ అవ్వాలనే లక్ష్యంతో బీటెక్ పూర్తి చేసిన తర్వాత, పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా డైరెక్టర్ అరుణ్‌ ప్రసాద్‌, అనిల్ కు దూరపు బంధువు. సినిమాల మీద తనకున్న ఇంట్రెస్ట్ గురించి ఆయనకు చెప్పగానే మొదట సందేహించినా, తర్వాత తాను తీస్తున్న  ‘గౌతమ్‌ ఎస్‌ఎస్‌సీ’ డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో అప్రెంటీస్‌గా చేర్చుకున్నారు. ఆ తరువాత కెమెరామేన్ శివ ద్వారా వి.ఎన్.ఆదిత్య పరిచయమయ్యారు. నాగార్జున ‘బాస్’ సినిమాకు ఆదిత్య దగ్గర పనిచేశారు అనిల్. ఆ సినిమాకు శివనే సినిమాటోగ్రాఫర్. శివ డైరెక్షన్లో వచ్చిన శౌర్యం, శంఖం చిత్రాలకు రైటర్ గా పనిచేశారు. ఆ తర్వాత కందిరీగ, మసాల, ఆగడు, సుడిగాడు” వంటి చిత్రాలకు రచనచేస్తూ సాగారు. తనకు రైటింగ్లో హాస్యబ్రహ్మ జంధ్యాల గారు ఆదర్శమంటారు అనిల్.

2015లో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన పటాస్ సినిమాతో అనిల్ డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా సుప్రీం, రవితేజతో రాజా ది గ్రేట్ చిత్రాలు సూపర్ హిట్ అవ్వడంతో అనిల్ డైరెక్టర్ గా నిలదొక్కుకున్నారు. సీనియర్ హీరో వెంకటేష్, యువ నటుడు వరుణ్ తేజ్ లతో తీసిన ఎఫ్2 చిత్రం 2018లో సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో మరో హిట్ అందుకున్నారు. ఈ చిత్రం ద్వారా సీనియర్ నటి విజయశాంతి తిరిగి నటించడం మొదలు పెట్టారు. ఎఫ్2 చిత్రానికి సీక్వెల్ గా ఎఫ్3 చిత్రాన్ని తీయగా, బాక్సాఫీస్ వద్ద ఎబో యావరేజ్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తీసిన భగవంత్ కేసరి చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

ప్రస్తుతం వెంకటేష్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను అనిల్ తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమా టైటిల్‌కి తగినట్లుగానే వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌కాబోతోంది. “నేను కథలు ఎప్పుడూ ‘యూనివర్సల్ పాయింట్’తోనే రాస్తాను. స్టార్స్ తో సినిమాలు తీయాల్సి వస్తే మాత్రం తప్పకుండా వారి ఇమేజ్ ను కూడా దృష్టిలో పెట్టుకొని రాసుకుంటాను. అందరినీ ఆకట్టుకొనే కథలను రాసుకోగలననే నమ్మకం నాకుంది. అదే నా బలంగా భావిస్తాను” అంటున్నారు అనిల్. రాబోయే రోజుల్లో  మరికొన్ని జనరంజకమైన చిత్రాలతో అలరిస్తారని ఆశిద్దాం. 

 --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com