టాలీవుడ్ యువ సామ్రాట్-నాగచైతన్య
- November 23, 2024
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా.. టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున వారసుడిగా అక్కినేని వంశం నుంచి మూడోతరం నటుడిగా ‘జోష్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య. తోలి సినిమాతోనే నటుడిగా నిరూపించుకున్న ఈ అక్కినేని యువ కిశోరం, హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వివిధ జనర్లలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు. ఎక్స్పీరిమెంటల్ మూవీస్ చేయడంలో తన జనరేషన్ హీరోల కంటే చైతూ ఒక అడుగు ముందున్నాడు. నేడు టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య పుట్టినరోజు.
అభిమానులు చైతూగా పిలుచుకునే నాగ చైతన్య 1986, నవంబర్ 23న హైదరాబాద్ లో అక్కినేని నాగార్జున, దగ్గుబాటి లక్ష్మి దంపతులకు జన్మించాడు. చైతూ నాలుగేళ్ళప్పుడు తల్లిదండ్రులు విడిపోవడంతో, తల్లితో కలిసి చైన్నెలో ఉండేవాడు. ప్లస్ టూ వరకు చెన్నైలో, ఆ తర్వాత హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత నటన మీదున్న ఆసక్తితో హైదరాబాద్, ముంబై నగరాల్లో యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. 2009లో జోష్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన జోష్ చిత్రంతో చైత్య నటుడిగా నిరూపించుకున్నా, కమర్షియల్ సక్సెస్ కాలేదు.
2010లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించిన "ఏ మాయ చేసావే" చిత్రం చైతన్యకు తోలి సక్సెస్ ను ఇవ్వడమే కాకుండా, లవర్ బాయ్ ఇమేజీని తెచ్చి పెట్టింది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 100% లవ్ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రేమ కథా చిత్రాలు ద్వారా రొమాంటిక్ హీరోస్ గా వెలిగిన తాత, తండ్రి ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకూడదని భావించి, మాస్ జానర్ సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు. అలా మాస్ జానర్లో తీసిన దడ, బెజవాడ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను రాబట్టలేకపోయాయి. ఇదే సమయంలో 2013లో డాలీ దర్శకత్వంలో తీసిన తడాఖా చిత్రం హిట్ అయ్యింది.
2014లో తన తాత నట సామ్రాట్ ఏఎన్నార్, తండ్రి నాగార్జునతో కలిసి నటించిన మనం చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఏఎన్నార్ నటించిన చివరి చిత్రం మనం కావడం విశేషం. ఈ చిత్రం విడుదలకు కొద్దీ నెలల ముందే ఏఎన్నార్ మరణించారు. ఆ తర్వాత ఆటోనగర్ సూర్య, ఒకలైలా కోసం, దోచేయ్ చిత్రాల్లో నటించినా ప్రేక్షకుల ఆదరణ నోచుకోలేదు. 2016లో చందూ ముండేటి దర్శకత్వంలో మలయాళ చిత్రం ప్రేమాన్ని రీమేక్ చేయగా అది హిట్ అయ్యింది. సాహసం శ్వాసగా సాగిపో, యుద్ధం శరణం చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. 2017లో రారండోయ్ వేడుకచూద్దాంతో హిట్ అందుకున్నాడు. 2018లో నటించిన శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సావిత్రి బయోపిక్ చిత్రంలో ఏఎన్నార్ గా ప్రత్యేక అతిధి పాత్రలో నటించాడు.
2019లో శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన మజిలీ చిత్రం విజయంతో చైతూ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు. 2020లో వచ్చిన వెంకీమామ చిత్రం అంతగా ఆడకపోయినా 2021లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సూపర్ హిట్ అయ్యింది. 2022లో తన తండ్రి నాగార్జునతో కలిసి నటించిన బంగార్రాజు చిత్రం, ఆ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే ఏడాది చేసిన థాంక్యూ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా చిత్రంతో హిందీ చిత్రసీమకు పరిచయం అయ్యాడు. 2023లో వెంకట్ ప్రభు దర్శకత్వంలో బైలింగ్వల్ మూవీ కస్టడీ ద్వారా కోలీవుడ్లోకి డెబ్యూ ఇచ్చాడు. ఆ సినిమా రెండు భాషల్లో సో సోగా వెళ్ళింది. మనం దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నటించిన "ధూత" వెబ్ సిరీస్ కు అన్ని భాషల్లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా జర్నలిస్ట్ సాగర్ వర్మగా చైతూ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం చందూ ముండేటి దర్శకత్వంలో తండేల్ చిత్రంలో నటిస్తున్నాడు.
చైతన్య జీవితం తెరిచిన పుస్తకమే అయినప్పటికీ... ఆ జీవిత మజిలీలో మలుపులు ఎన్నో ఉన్నాయి! వాటిలో కొన్ని ప్రేక్షకులకు తెలిసి ఉండవచ్చు. మరికొన్ని తెలిసే అవకాశం లేకపోవచ్చు. ఉదాహరణకు... సమంతతో వేరు పడిన విషయం అందరికీ తెలుసు. అయితే, ఎందుకు వేరు పడ్డారు? అనే ప్రశ్నకు సమాధానం ప్రేక్షకులు ఎవరికీ తెలియదు. సాధారణంగా ప్రతి మనిషిలో నవరసాలు ఉంటాయి. సంతోషం, కోపం, దుఃఖం వంటివి అప్పుడప్పుడూ పబ్లిక్‌గా ప్రదర్శిస్తూ ఉంటాం. ముఖ్యంగా సెలబ్రిటీలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు... అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే, చైతన్య విషయంలో అటువంటి కేస్ ఒక్కటి కూడా లేదు.
నాగ చైతన్య కంటే ఆయన వ్యక్తిత్వం ఎక్కువ మాట్లాడుతుంది. హీ ఈజ్ వెరీ కూల్. వెరీ కామ్! ఆయన చిరునవ్వే చాలా విషయాలకు సమాధానం చెబుతుంది. పబ్లిక్‌గా ఎప్పుడూ కోప్పడిన సందర్భాలు లేవు. చిన్న చిన్న విషయాలకు సైతం కొందరికి కోపం వస్తుంది... సినీ ప్రముఖులు అని కాదు, సామాన్యులకు కూడా! అటువంటి వారందరూ ఆయన నుంచి ఆ ఒక్కటీ నేర్చుకోవాలి. ఎవరెంత కవ్వించినా ఓపిగ్గా సమాధానాలు ఇవ్వడం, ప్రశాంతంగా ఉండటం చైతూ నుంచి నేర్చుకోవాలి.
నటుడిగా తనను తాను ఎప్పుడో ప్రూవ్ చేసుకున్న చైతన్య, ఇప్పుడు ప్రయోగాలకూ సై అంటున్నారు.హీరోగా మంచి పొజిషన్లో ఉండి కూడా వెబ్ సిరీస్ చేశారు. కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలో, వినూత్న కథలు, ప్రయోగాలు చేయడంలో నాగార్జున ముందుంటారు. చైతన్య కూడా అదే విధంగా రిస్క్ తీసుకోవడానికి రెడీ అన్నట్లు అడుగులు వేస్తున్నారు. రాబోయే రోజుల్లో నటుడిగా మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తూ... హ్యాపీ బర్త్ డే చైతూ.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..







