ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన రద్దు..!

- November 25, 2024 , by Maagulf
ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన రద్దు..!

న్యూ ఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. తుపాను కారణంగా అన్ని పోర్టులకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.

మరోవైపు తుపాను కారణంగా ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన రద్దైంది. ఈ నెల 29న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ హబ్ కి ప్రధాని శంకుస్థాపన చేయాల్సిందిగా తుపాను ప్రభావంతో పర్యటన రద్దైంది. దీంతో మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేసేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 29న విశాఖలో ప్రధాని మోదీ పర్యటించాల్సి ఉంది. అచ్యుతాపురం మండలం పూడిమడికలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రీన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ను ప్రారంభించాల్సి ఉంది. దాంతో పాటు పలు రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులను జాతికి అంకితయం చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ఏయూలో విస్తృత ఏర్పాట్లు కూడా చేశారు అధికారులు. ప్రధాని వచ్చిన వెంటనే నేరుగా ఏయూకి చేరుకోవాల్సి ఉంది.

అదే సమయంలో ప్రజలకు అభివాదం చేసేలా ఒక రోడ్ షో ను నిర్వహించాలని భావించారు. సిరిపురం నుంచి ఎస్పీ బంగ్లా వరకు రోడ్ షో నిర్వహించాలని కూటమి నేతలు ప్లాన్ చేశారు. అయితే, అనూహ్యంగా తుపాను ప్రభావంతో ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దైంది. దీనికి ప్రత్యామ్నాయంపై అధికారులు దృష్టి పెట్టారు. అదే రోజున వర్చువల్ గా గ్రీన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ను ప్రారంభించే అవకాశం ఉంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com