దేవేంద్ర ఫడ్నవిస్: కార్పొరేటర్ టూ మహారాష్ట్ర సీఎం
- December 05, 2024
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి జయభేరి మోగించిన నేపథ్యంలో ఆ రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేదానిపై చర్చ మెుదలైంది. ఆ చర్చలన్నిటికి తెర దించుతూ బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మరోసారి మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. అసలు ఇంతకి ఎవరు ఈ దేవేంద్ర ఫడ్నవిస్ ? కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లాంటి బలమైన నేత మహారాష్ట్ర నుంచి ఉండగా సంఘ్ మరియు బీజేపీ నేతలు ఎందుకు అతనికి బలమైన మద్దతుదారులుగా నిలబడుతున్నారు ? అనేది చాలా మందికి అంతుబట్టని అంశం.
మరాఠా రాజకీయాల్లో మేరు నగధీరులను ఎదర్కొని నిలబడ్డ నేతగా జాతీయ మీడియా కీర్తిస్తున్న బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ 1970, జూలై 22న నాగ్‌పూర్ పట్టణంలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన గంగాధర్ రావు ఫడ్నవిస్, సరితా తాయి దంపతులకు జన్మించారు. తండ్రి గంగాధరరావు ఫడ్నవిస్ జనసంఘ్ నేత మరియు సంఘ్ పెద్దలకు అత్యంత ఇష్టుడైన వ్యక్తి. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో జనసంఘ్ బలోపేతం చేయడానికి కృషి చేశారు.జనసంఘ్ తరపున ఎమ్యెల్సీగా ఎన్నికవ్వడమే కాకుండా ఎమెర్జెన్సీ ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యారు. భాజపా అగ్రనేతలైన వాజపేయ్, అద్వానీలు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు.
ఇక మేనత్త శోభా ఫడ్నవిస్ ఒకసారి ఎమ్యెల్సీగా, నాలుగు సార్లు ఎమ్యెల్యేగా మహారాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. శివసేన భాజపా కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తల్లి సరితాయి సైతం విదర్భ హోసింగ్ సొసైటీ డైరెక్టర్ గా పనిచేశారు. నాగ్‌పూర్ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ లో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన తర్వాత ధరంపేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్, నాగ్‌పూర్ లా కాలేజీ నుంచి ఎల్.ఎల్.బి, నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో ఎంబీఏ, జర్మనీలోని DSE-German Foundation for International Development నుంచి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో డిప్లొమా పూర్తి చేశారు.
తండ్రి గంగాధరరావు స్పూర్తితో చిన్నతనంలోనే సంఘంలో బాల స్వయం సేవక్ గా చేరారు. ఇంటర్మీడియెట్లోనే సంఘ్ అనుబంధ విద్యార్ధి విభాగం ఎబీవీపిలో చేరిన ఫడ్నవిస్ అంచెలంచెలుగా ఎదుగుతూ నాగ్‌పూర్ యూనివర్సిటీకి అధ్యక్షుడిగా పనిచేశారు. సంఘ్ పెద్దల సహకారంతో భాజపాలో చేరిన ఫడ్నవిస్ 1992లో నాగ్‌పూర్ మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా తొలిసారి ఎన్నికయ్యారు. 1997-99 వరకు నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా పనిచేశారు.
1999లో అసెంబ్లీ ఎన్నికల్లో నాగ్‌పూర్ వెస్ట్ నుంచి తొలిసారి ఎమ్యెల్యేగా ఎన్నికైన ఫడ్నవిస్, అదే నియోజకవర్గం నుంచి 2004లో సైతం ఎన్నికయ్యారు. 2008లో వచ్చిన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009 నుంచి నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ నుంచి వరుసగా నాలుగు సార్లు ఎన్నికయ్యారు. 2014లో భాజపా - శివసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనూహ్యంగా సీఎం పదవిని చేపట్టారు. అలా, మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పనిచేసిన బ్రాహ్మణ వర్గానికి చెందిన మనోహర్ జోషి తర్వాత రెండో నేతగా రికార్డ్ సృష్టించారు. 2014-19 వరకు మహారాష్ట్ర సీఎంగా అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడ్డారు.
2019 ఎన్నికల్లో అనిశ్చితి ఫలితాలతో పాటుగా శివసేనతో ఉన్న 35 ఏళ్ళ రాజకీయ మైత్రి బంధం ముగియడం జరిగింది.అయితే, అనూహ్యంగా ఎన్సీపీ సీనియర్ నాయకుడు అజిత్ పవార్ సహకారంతో 5 రోజుల పాటు సీఎంగా ఎన్నికైనా, మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చున్నారు. తన రాజకీయ చాణక్యంతో శివసేన పార్టీలో చీలిక తీసుకొచ్చి ఏకనాథ్ షిండేను సీఎం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. షిండే క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా కొనసాగారు. రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ ను సైతం ప్రభుత్వంలో కలుపుకొని పోయారు. తనతో పాటుగా అజిత్ పవార్ సైతం డిప్యూటీ సీఎంగా ఉండేందుకు అంగీకరించారు.
మోడీ- షా ద్వయానికి భాజపా సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మీదున్న వ్యతిరేక భావమే ఫడ్నవిస్ రాజకీయ ఎదుగుదలకు మరియు స్థిరత్వానికి దోహదపడింది. గడ్కరీ రాజకీయ గురువుల్లో ఒకరైన గంగాధరరావు ఒకరు. ఈ కారణంతోనే దేవేంద్రను గడ్కరీ రాజకీయంగా ప్రోత్సహించారు. 2014లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నితిన్ గడ్కరీ సీఎం అవ్వాలనుకున్నా, మోడీ- షా మోకాలడ్డటంతో గడ్కరీ బదులు ఫడ్నవిస్ సీఎం అయ్యారు. అప్పటి నుంచి గడ్కరీకి పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తూ ఉన్నారు.
2024 లోక్ సభ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘోరంగా దెబ్బ తినడంతో ఫడ్నవిస్ డీలా పడినా, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఘన విజయాన్ని అందుకొని కూటమి తరపున మూడో సారి మహారాష్ట్ర సీఎంగా ఎన్నికయ్యారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







