ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా

- December 09, 2024 , by Maagulf
ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా 1990 ఐఏఎస్ బ్యాచ్ అధికారి సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) నియమితులైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం సంజయ్ మల్హోత్రా ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ) పదవిని నిర్వహిస్తున్నారు. అంతకుముందు తన మునుపటి పదవిలో ఆయన భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. దీంతోపాటు ఆయనకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో ఆర్థిక, పన్నుల రంగంలో మంచి అనుభవం ఉంది.

ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌కి రేపు చివరి రోజు. ఆ తర్వాత బుధవారం నుంచి కొత్త ఆర్‌బీఐ 26వ గవర్నర్‌గా సంజయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సంజయ్ మల్హోత్రా మూడేళ్లపాటు నియమితులయ్యారు. మల్హోత్రా నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సంజయ్ రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. ఆయన కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని అందుకున్నారు. ఆ తర్వాత అమెరికాలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com