ఇండియన్ ఆల్‌రౌండర్ - యువరాజ్ సింగ్
- December 12, 2024
యువరాజ్ సింగ్ ... భారత క్రికెట్ ప్రేమికులకు సుపరిచితమైన పేరు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు యూవీ తన అద్భుతమైన ప్రదర్శనతో గట్టెక్కించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన డేరింగ్ ఇండియన్ బ్యాట్సమెన్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ఆఫ్ స్పిన్నర్‌గా కెరీర్ ఆరంభించిన యూవీ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ప్రయాణాన్ని కొనసాగించిన యువరాజ్ టీమ్ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. నేడు యువరాజ్ సింగ్ పుట్టినరోజు.
యువరాజ్ సింగ్ 1981, డిసెంబర్ 12న పంజాబ్ రాజధాని చండీగఢ్ పట్టణంలో యోగ్రాజ్ సింగ్, షబ్నమ్ దంపతులకు జన్మించాడు. చండీగఢ్ లోని DAV కాలేజీ నుంచి బీకామ్ పూర్తి చేశాడు. యువరాజ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ భారత క్రికెట్ జట్టులో బౌలర్ గా, సినిమా నటుడిగా రాణించారు. తండ్రి ప్రోద్బలంతో యువరాజ్ క్రికెట్ మీద ఆసక్తి పెంచుకున్నాడు. 1995-2000 వరకు అండర్ 16, అండర్ 19 మరియు రంజీల్లో పంజాబ్ తరపున ఆడాడు. 2000లో జరిగిన అండర్- 19 ప్రపంచకప్ లోనూ యువరాజ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు.
2000 సంవత్సరంలో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అనతికాలంలోనే తనేంటో నిరూపించుకునే ఇన్నింగ్స్ ఆడాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన యువరాజ్ సింగ్ స్పిన్ బౌలర్ కూడా. బ్యాట్ తోనే కాక ఎన్నోసార్లు తన బౌలింగ్ తో భారత్ కు మ్యాచులు గెలిపించాడు. ఫీల్డింగ్ లో చిరుతలా కదులుతూ ది బెస్ట్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు.
2007 టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ పై యువరాజ్ సింగ్ కొట్టిన 6 బంతుల్లో 6 సిక్సులను క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. ఆ మ్యాచులో ఇంగ్లిష్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో 6 బంతుల్లో 6 సిక్సులు బాదాడు. మొన్నటివరకు అంతర్జాతీయ క్రికెట్ లో ఆ రికార్డును చెరపలేకపోయారు. అయితే భారత దేశవాళీ టోర్నీవిజయ్ హజారే ట్రోఫీ 2022లో రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఓవర్లో 7 సిక్సులు కొట్టాడు. ఆ మ్యాచులోనే 12 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేశాడు. టీ20ల్లో అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డు అది. ఇప్పటికీ అది అలానే ఉంది.
2011లో జరిగిన వన్డే ప్రపంచకప్ ను టీమిండియా గెలుచుకుంది. ఆ టోర్నీలో యువీ అద్భుత ప్రదర్శన చేశాడు. అప్పటికే తనకు క్యాన్సర్ సోకింది. అయినా కూడా ఆ టోర్నీలో యువరాజ్ సింగ్ 362 పరుగులు చేసి 15 వికెట్లు పడగొట్టాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు.తన అంతర్జాతీయ కెరీర్ లో మొత్తం 398 మ్యాచులో ఆడిన యువరాజ్ సింగ్.. 11వేలకు పైగా పరుగులు సాధించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో రెండుసార్లు హ్యాట్రిక్స్ తీసిన బౌలర్ గా యువీ ఘనత సాధించాడు. 2009లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన యువరాజ్ సింగ్... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై తొలిసారి హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. మరలా ఆ ఏడాది ఐపీఎల్ లోనే డెక్కన్ ఛార్జర్స్ పై హ్యాట్రిక్ అందుకున్నాడు. 2016, 2019లలో ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లలో యువీ భాగమయ్యాడు.
2019 వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడంతో నిరాశగా కనిపించిన యువీ.. ఆ టోర్నీ జరుగుతుండగానే అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేశాడు. ఆ తర్వాత ప్రైవేట్ లీగ్స్‌లో ఆడిన యువీ.. బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే ఐపీఎల్లో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఏ క్రికెటరైనా రిటైర్మెంట్ తర్వాత విదేశీ ప్రైవేట్ లీగ్‌లలో ఆడితే..? ఆ తర్వాత బీసీసీఐ పరిధిలో జరిగే ఏ టోర్నీలోనూ ఆడేందుకు అనుమతించరు. ఏది ఏమైనా భారత క్రికెట్ చరిత్రలో యువరాజ్ తనకంటూ ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించుకున్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ
- మస్కట్‌లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...







