ఎన్టీఆర్ కి భారతరత్న వచ్చేవరకు వదిలిపెట్టం : సీఎం చంద్రబాబు

- December 15, 2024 , by Maagulf
ఎన్టీఆర్ కి భారతరత్న వచ్చేవరకు వదిలిపెట్టం : సీఎం చంద్రబాబు

అమరావతి: విజయవాడలోని పోరంకిలో నిర్వహించిన ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు ‘తారక రామం- అన్నగారి అంతరంగం’ పుస్తకాన్ని, అలాగే ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ స్పెషల్ క్యాలెండర్ ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి ఆవిష్కరించారు. ‘తారక రామం- అన్నగారి అంతరంగం’ పుస్తకంలో ఎన్టీఆర్ సినిమా కెరీర్ విశేషాలు, పలు ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు, ఆయన గురించి సమాచారాన్ని, ఆయన గురించి ఇతర ప్రముఖులు చెప్పిన మాటలను పొందుపరిచారు.

ఇక ఈ కార్య‌క్ర‌మంలో సీనియర్ సినీ పాత్రికేయులను ఘనంగా సన్మానించారు. మోహన్ గోటేటి, బీకే ఈశ్వర్, కె.ఉడయవర్లు, కె.ఉమామహేశ్వరరావు, గౌస్, శాతవాహన, యు.వినాయకరావు, రెంటాల జయదేవ, అనురాధ, రమణమూర్తి తదితర పాత్రికేయులు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మెమెంటోలు అందుకున్నారు.

మ‌నం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్..

అనంత‌రం మాట్లాడిని సీఎం చంద్రబాబు… మనం చూసిన ఏకైక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు అన్నారు. గత ఏడాది మొత్తం ఎన్టీఆర్ శత జయంతి జరుపుకున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం జరుపుకుంటున్నాం అని అన్నారు. 75 సంవత్సరాల ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుక.. ఇది ఒక అపూర్వ ఘట్టం. తెలుగు జాతి ఆత్మగౌరవం, పౌరుషం అనగానే గుర్తుకు వచ్చే మొదటి నాయకులు నందమూరి తారక రామారావు.

నాకు ఏ ఇజాలు లేవు.. ఉన్నది ఒకటే అది హ్యూమనిజం అని ఆనాడే తెలిపిన వ్యక్తి ఎన్టీఆర్. ఇప్పుడు ఒక సినిమా 3 ఏళ్ళు పడుతుంది.. కానీ, ఎన్టీఆర్ మాత్రం సంవత్సరానికి 10-15 సినిమాలు నటించేవారు! ఎన్టీఆర్ ఏ పాత్ర పోషించిన అందులో జీవించేవారు. భారతదేశ సినీ చరిత్రలో ఎన్టీఆర్ లా విభిన్న పాత్రలు పోషించిన నటులు ఎక్కడా ఉండరు.

ఎన్టీఆర్ లా పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి కావడం చరిత్రలో ఎక్కడా జరగలేదు.. భవిష్యత్తులో ఎక్కడైనా జరుగుతుందనే నమ్మకం లేదు. దేశంలో మొట్టమొదటిసారి రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు.

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడం అనేది ఆయన్ని గౌరవించడం కాదు.. దేశాన్ని గౌరవించుకోవడం.. జాతిని గౌరవించడం… ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చే వరకు కచ్చితంగా వదిలిపెట్టం.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చే వరకు పోరాడి సాధిస్తాం అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com