రేపు లోక్‌సభలో జమిలి ఎలక్షన్‌ బిల్లు..!

- December 16, 2024 , by Maagulf
రేపు లోక్‌సభలో జమిలి ఎలక్షన్‌ బిల్లు..!

న్యూ ఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూపొందించిన రెండు కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఒకే దేశం-ఒకే ఎన్నిక లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించే జమిలి ఎన్నికలపై లోక్‌సభలో బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలిసింది. రేపు (మంగళవారం) లోక్‌సభలో ఈ బిల్లులను ప్రవేశ పెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి.కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపాయి. ఆ తర్వాత దీనిని చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనున్నారు.

బలాన్ని పెంచుకుంటున్న బీజేపీ
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని పెంచుకుంది. తమ బలం పెరగడంతో జమిలి ఎన్నికలపై తన దృష్టిని సారించింది. వాస్తవానికి రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు, కేంద్ర పాలిత ప్రాంత చట్టాలు (సవరణ బిల్లు)ను సోమవారం సభలో ప్రవేశ పెట్టనున్నట్లు ముందుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా రివైజ్‌ చేసిన లోక్‌సభ బిజినెస్‌ జాబితాలో వీటిని తొలగించారు. లోక్‌సభ కార్యదర్శి విడుదల చేసిన రివైజ్డ్‌ జాబితాలో సోమవారం ఈ రెండు బిల్లులకు సంబంధించిన అజెండాను పెట్టలేదు. దీంతో ఈ బిల్లులు నేడు సభ ముందుకు రాలేదు. మంగళవారం ఈ బిల్లులు లోక్‌షభ ముందుకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది.

జమిలి ఎన్నికలు కొత్తదేమీ కాదు
దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు, లోక్‌సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే జమిలి ఎన్నికల ప్రధాన ఉద్దేశం. వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు. 1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని, 1967 వరకు లోక్‌సభకు, రాష్ర్టాల అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి.అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్‌ చేయడం తదితర కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి.దీంతో లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరపడం మొదలైంది.

ఇండియా కూటమి అనుమతి ఇచ్చేనా?
ఇండియా కూటమి ముందు నుంచి ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నది. మరి ఈ జమిలి బిల్లును ఎంతవరకు మద్దతు ఇస్తుందో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com