జాతీయ రైతు దినోత్సవం

- December 23, 2024 , by Maagulf
జాతీయ రైతు దినోత్సవం

మన పూర్వీకుల అనుభవాలను, గత చరిత్ర యొక్క వైభవాన్ని నెమరువేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాం. సమాజానికి ఒక నిర్ధేశిత సందేశం ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూ ఉంటాం. సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేసాం. ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది. పుట్టిన రోజు, పెండ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు, ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాం. మరి ఈరోజు జాతీయ రైతు దినోత్సవం గురించి ఆలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాం.

దేశానికి రైతు వెన్నుముక. ఈరోజున కడుపు నిండా అన్నం తింటున్నామంటే అది రైతు చలువే. అలాంటి రైతు పగలు ,రాత్రి  శ్రమించి పంట పండించినా అది చేతికి అందుతుందనే నమ్మకం లేదు. అయినా సరే రైతులు మాత్రం కుంగిపోకుండా ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడాది ప్రకృతి కరుణించకపోతుందా, పంట చేతికందక పోతుందా అనే ఒక చిన్న ఆశతో  జీవనం సాగిస్తున్నారు. అందుకే ఆ రైతు కోసం ప్రతి ఏటా డిసెంబర్  23 వ తేదీని దేశవ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని జరుపుకుంటాం. రైతు కుటుంబం నుంచి వచ్చి ప్రధాని పదవిని అలంకరించిన చౌదరీ చరణ్‌సింగ్‌ జన్మదినం కూడా ఈరోజే. భారత రైతాంగం కోసం ఆయన చేసిన సేవలకు గుర్తుగానే కిసాన్ దివస్ లేదా జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటాం.

భారతదేశ రాజకీయ చరిత్రలో చరణ్ సింగ్ గొప్ప రైతు నాయకుడు. జమిందారీ రద్దు, రెవెన్యూ రికార్డుల స్థిరీకరణ వంటి పలు విప్లవాత్మక  సంస్కరణలకు ఆద్యుడిగా ఆయన్నే పేర్కొంటారు.దేశ ప్రధానిగా చరణ్ సింగ్ పనిచేసింది కొద్ది కాలమే అయినా… వ్యవసాయ రంగానికి విశేష కృషి చేశారు. రైతుల మేలు కోసం ఆయన ఎన్నో వ్యవసాయ చట్టాలను అమల్లోకి తెచ్చారు. అన్నదాతలను ఆదుకునే ఎన్నో పథకాలు అమలు చేశారు. చ‌ర‌ణ్ సింగ్ రైతు బంధుగా పేరుతెచ్చుకున్నారు.

 పర్యావరణ కాలుష్యం కారణంగా ఏటా అతివృష్టి, మరోవైపు అనావృష్టి అనునిత్యం వెంటాడుతూనే ఉన్నాయి. రైతన్నల జీవితాలకు భరోసా లేని స్థితిని  తెస్తున్నాయి. అందుకే దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో రైతులు పోషిస్తున్న పాత్ర గురించి దేశ ప్రజలందరికీ తెలియచెప్పటం కోసం జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటాం. రైతులకు వ్యవసాయంపై అవగాహన పెంచటం, వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త విధానాలను తెలియచెప్పటం, తక్కువ పెట్టుబడులతో అధిక ఉత్పత్తిని సాధించేందుకు రూపొందించిన వైజ్ఞానిక వ్యవసాయం గురించి ప్రచారం చేయటం కూడా జాతీయ రైతు దినోత్సవం లక్ష్యం. 

భారత భాగ్య విధాతా! జీవన సౌభాగ్య ప్రధాతా! ఓ రైతన్నా నీకు మా నెనరులు! ఈ లోకాన్నీ నడిపించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడైతే ఆ సూర్యుని నుంచి వచ్చే శక్తిని వినియోగించుకుని లోకంలోని ప్రజలందరి ఆకలి బాధను తొలగించే పరోక్ష దైవాలు రైతులు. నేల తల్లిని నమ్ముకొని, పలు రకాల ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ, శ్రమించి పంటలను పండించి దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తారు వ్యవసాయదారులు. ఒకప్పుడు అందరి వృత్తి వ్యవసాయమే.

రైతు లేనిదే ఈరోజు మనిషి లేడు.. రైతు అహర్నిశలు కష్టపడితే తప్ప మన కంచంలోకి అన్నం రాదు.. ఈరోజు దేశమంతా ఆరోగ్యంగా కడుపు నిండా అన్నం తింటుంది అంటే అది రైతు వల్లే. అలాంటి రైతు ఆరు నెలలు కష్టపడినా, శ్రమ అంతా చేతికి దక్కుతుందనే నమ్మకం లేదు. అయినా సరే రైతులు మాత్రం అటు ప్రకృతి మీద, ఇటు ప్రభుత్వం మీద భారం వేసి జీవనం సాగిస్తున్నారు.

నేడు వ్యవసాయం ఒక జూదంగా మారింది. ఒక రోజు వర్షాల కోసం.., ఇంకోరో జు విత్తనాల కోసం.. మరో రోజు ఎరువుల కోసం.., బ్యాంకు రుణాల కోసం ఇలా ప్రతి విషయంలోనూ ఒత్తిళ్లకు గురి కావాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడుతోంది. ఒత్తిళ్లు, నష్టాలు, వ్యవసాయ పనుల చాకిరీ భరించలేక చాలామంది భూమి ఉన్నా వ్యవసా యం మానేస్తున్నారు. కొందరు భూమిని కౌలుకు ఇస్తున్నారు. ఎన్నికల్లో పార్టీలు రైతు లకు ఎన్ని హా మీలిచ్చినా రైతుల పరిస్థితి మాత్రం మారడం లే దు. పంటలు సాగు చేసి దిగుబడి రాక అప్పుల బా ధలు భరించలేక, సరైన సమయంలో రుణమాఫీ కాక, దిక్కుతోచని స్థితిలో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. భూ మివారిది కాదు.. పంట పండితే పూర్తి పంట చేతికి రాదు.. వీరికి వ్యవసాయ రుణాలు కూడా రావు. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కాపాడుతున్న వీరి విషయంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. వారికి సొంత భూమి లేకపోవడం, భూమి కౌలుకు తీసుకుంటే ఎక్కువరేట్లు చెల్లించడం, భూమి యాజమాని కాకపోవడం వల్ల పంటరుణాని కి ఎవరూ నమ్మడం లేదు. దీంతో రూ.5, 10ల ప్రైవేటు వడ్డీల మీద ఆధారపడి వీరు వ్యవసాయం చేస్తున్నారు. ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చిన రుణఅర్హత పత్రాలకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవే టు వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడి అప్పుల పాలవుతున్నారు.

ప్రస్తుత పరిస్థిలలో వర్షాల కోసం, విత్తనాలు , ఎరువుల కోసం.. బ్యాంకు రుణాల కోసం ఇలా ప్రతి విషయంలోనూ ఒత్తిళ్లకు గురి కావాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడుతోంది. ఓవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి అనునిత్యం వెంటాడుతూనే ఉన్నాయి. అన్నదాతల జీవితాలకు భరోసా లేని పరిస్థితి. ఒకవేళ ప్రకృతి కరుణించి దిగుబడి బాగున్నా పండిన పంటకు సరైన ధరలేక నిస్సాహయుడిగా మిగిలిపోయే పరిస్థితి.

కష్టపడి కాలానికి ఎదురీది పంటలు పండిస్తే దళారులు రైతుల మీద పడి దోచుకుంటున్నారు. మార్కెట్లో తిష్టవేసిన దళారులు రైతుల శ్రమను చౌకగా కొని ఎక్కువ రేట్లకు జనాలకు అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. దీంతో రైతులు కూలీగా మిగులుతుంటే దళారులు లక్షాధికారులు అవుతు న్నారు. ఈ దళారుల వ్యవస్థను అరికట్టే విధంగా ప్రభు త్వం చర్యలు తీసుకొని రైతును రాజుగా చే యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక పం టల విషయంలో రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయ శాఖలో సిబ్బంది కొరత రైతులను నష్టాలకు గురిచేస్తోంది.

కష్టాలసాగు కడగండ్లు మిగిల్చినా రైతులు గుండెనిబ్బరం చేసుకోవాలి.. ఒక్కసారి కు టుంబం గురించి ఆలోచించుకోవాలి. భార్య, పిల్లల పరిస్థితి ఏమిటని ప్రశ్నించుకోవాలి. కష్టాలు ఈ రోజు ఉండచ్చు... రేపు పోవచ్చు..దేశానికి అన్నం పెట్టే రైతన్నే అధైర్యపడితే ఈ సమాజానికి మెతుకు దొరకదు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వందల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడడం ప్రతి ఒక్కర్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికీ ఎక్కడో ఓ చోట రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. అందుకే రైతన్నలు బతికి సాధించాలని మేధావులు, స్వచ్ఛంద సంఘాలు కోరుతున్నాయి

 --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com