రాజకీయ మేధో శిఖరం-అరుణ్ జైట్లీ
- December 28, 2024
అరుణ్ జైట్లీ... భారతదేశ రాజకీయాల్లో దశాబ్దాల పాటు కీలకమైన పాత్ర పోషించిన రాజకీయవేత్త. భాజపా ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతూ ల్యూటెన్స్ ఢిల్లీ వర్గాల్లో పార్టీ పట్ల సానుకూలత తెచ్చిన ఘనత జైట్లీ సొంతం. కెరీర్ ప్రారంభంలో నల్ల కోటు ధరించి వకీలుగా కోర్టుల్లో, ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా ప్రజా క్షేత్రంలో విజయవంతం అయ్యారు. క్రైసిస్ మేనేజర్ గా భాజపా అంతర్గత వ్యవహారాలను సరిదిద్దేవారు. బిజినెస్ మరియు మేధావి వర్గానికి అత్యంత ఇష్టుడైన నేతగా కొనసాగారు జైట్లీ. నేడు భాజపా రాజకీయ దిగ్గజం, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జయంతి.
అరుణ్‌జైట్లీ 1952, డిసెంబర్ 28న న్యూఢిల్లీలోని ప్రముఖ న్యాయవాది మహరాజ్ కిషన్ జైట్లీ, రత్నప్రభ దంపతులకు జన్మించారు.1960-1969 మధ్య సెయింట్ జేవియర్స్ పాఠశాల (దిల్లీ)లో సాగింది. 1973లోశ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు.1977లో దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. 1977 నుంచి జైట్లీ సుప్రీంకోర్టు, కొన్ని హైకోర్టుల్లో లా ప్రాక్టీస్ చేశారు. 1989లో సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్‌గా ఎంపికయ్యారు. 1990లో దిల్లీ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ హోదాలో చివరి వరకు కొనసాగారు. క్రిమినల్ మరియు కార్పొరేట్ వ్యవహారాల న్యాయవాదిగా పలు ప్రతిష్టాత్మక కేసులను జైట్లీ స్వయంగా వాదించారు. దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లలో ఆయన ఒకరిగా కొనసాగారు.
దిల్లీలో చదువుకుంటున్న కాలంలోనే విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న అరుణ్ జైట్లీ,1974లో ఏబీవీపీ తరపున ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇదే సమయంలో ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొని 19 నెలల పాటు అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చున్నారు. 1977లో జైలు నుంచి విడుదలైన తర్వాత న్యాయవాదిగా పనిచేస్తూనే ఢిల్లీ జనతా పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. 1980లో వాజపేయ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ (భాజపా) ఆవిర్భావం తర్వాత, ఆ పార్టీలో చేరిన జైట్లీ, ఢిల్లీ పార్టీ లీగల్ వ్యవహారాలను చూసుకునేవారు.
1987లో భాజపా రామ జన్మభూమి ఉద్యమాన్ని చేపట్టిన తర్వాత ఢిల్లీ ల్యూటెన్స్ వర్గాల్లో హిందుత్వ పార్టీగా ముద్ర పడింది. ఆ ముద్రను చెరిపే బాధ్యతను అప్పటి పార్టీ అధ్యక్షుడు అద్వానీ జైట్లీకి అప్పగించారు. జైట్లీ ఆ బాధ్యతల్లో చాలా వరకు సఫలీకృతం అయ్యారు. 1989 ఎన్నికల నాటికి భాజపా 2 సీట్ల నుంచి 85 సీట్లకు పెరగడమే కాకుండా, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు తెలపడంలో జైట్లీ తన వంతు పాత్ర పోషించారు. 1991లో అద్వానీ స్థానంలో మురళీ మనోహర్ జోషి భాజపా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా జైట్లీ ఎన్నికయ్యారు. ఆనాటి నుంచి తన చివరి శ్వాస వరకు జాతీయ కార్యవర్గంలోనే ఉన్నారు.
1992లో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో ప్రమేయం ఉన్న భాజపా అగ్ర నేతలను కాపాడేందుకు లీగల్ వ్యూహాన్ని రచించారు. ఈ సంఘనటనతోనే జైట్లీకి పార్టీలో ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. 1996లో భాజపా 13 రోజుల ప్రభుత్వం పడిపోయిన తర్వాత సెక్యులర్ పార్టీల మద్దతును కూడగట్టే బాధ్యతలను వెంకయ్య, ప్రమోద్ మహాజన్, జైట్లీకి భాజపా అధిష్టానం ఇచ్చింది. 1998,1999లలో ఏర్పడ్డ ఎన్డీయే కూటమి ప్రభుత్వాల్లో భాగస్వాములుగా దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు చేరడంలో ఈ ముగ్గురి పాత్ర కీలకం.
2000 సంవత్సరం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ 1999 -2004 వరకు నుంచి ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర సమాచార ప్రసార (స్వతంత్ర), వాణిజ్య, న్యాయ శాఖల మంత్రిగా పనిచేశారు. వాజ్‌పేయ్ ప్రభుత్వంలో పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిగా స్వతంత్ర హోదాలో పనిచేశారు. అలాంటి శాఖ ఏర్పాటుచేయడం అదే తొలిసారి. ఆ శాఖకు తొలిమంత్రి జైట్లీనే. 2004-09 వరకు భాజపా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. 2007లో గుజరాత్, 2008లో కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా గెలుపులో తన వంతు పాత్ర పోషించారు. 2009-14 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.
2014లో నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఆయన వేర్వేరు మంత్రిత్వ శాఖల బాధ్యతలు చూశారు. 2014 నుంచి 2016 వరకు సమాచార ప్రసార శాఖ మంత్రిగా.. 2014 - 17 మధ్య మోదీ ప్రభుత్వంలోనే రక్షణ మంత్రిగా, 2014 - 19 కాలంలో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖల మంత్రిగానూ పనిచేశారు. 2019లో అనారోగ్యం కారణంగా రాజకీయాల నుంచి క్రియాశీలకంగా విరమించుకున్నారు.
2000-18 వరకు గుజరాత్ నుంచి వరసగా మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికైన జైట్లీ, 2018లో మాత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి నాలుగో సారి రాజ్యసభకు ఎన్నికై 2019 వరకు కొనసాగారు. అరుణ్ జైట్లీ ఒకే ఒక్కసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అమృత్‌సర్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చేతిలో సుమారు లక్ష ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
జైట్లీ , ప్రధాని మోడీ మైత్రి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, వాజపేయ్ - అద్వానీ తర్వాత పార్టీలో రెండో తరానికి చెందిన నాయకుల జాబితాలో జైట్లీ, మోడీ ఒకే సారి భాజపాలో క్రియాశీలకంగా పనిచేయడం మొదలు పెట్టారు. ఆరెస్సెస్ నేపథ్యం కలిగిన మోడీ, లీబరల్ నేపథ్యం కలిగిన జైట్లీలు యాదృచ్ఛికంగానే స్నేహితులయ్యారు. 1995 అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్ రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడంలో అప్పటి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మోడీతో ముంబై భాజపా జాతీయ సమావేశాల్లోనే సన్నిహిత పరిచయం ఏర్పడింది. 1996 మొదట్లోనే రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మోడీ గుజరాత్ వదిలి ఢిల్లీ చేరిన సమయంలో జైట్లీనే మోడీ వెన్నంటి ఉన్నారు. 1996-2000 మధ్యలో మోడీని పార్టీ జాతీయ వ్యవహారాల్లో భాగం చేయడంలో జైట్లీ పాత్ర ఉంది.
2001లో మోడీ గుజరాత్ సీఎం అవ్వడానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. 2002 గుజరాత్ అల్లర్లను నియంత్రించడంలో మోడీ విఫలం అయ్యారని సీఎం పదవి నుంచి వైదొలగాలని పార్టీలోని అత్యధిక సూచించిన సమయంలో కూడా అద్వానీతో పాటుగా జైట్లీ నైతికంగా మద్దతు తెలిపారు. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలోనే వ్యాపారవేత్తలతో సమావేశాలు ఏర్పాటు చేయించడం ద్వారా వారికి మోడీకి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడటంతో జైట్లీ పాత్ర కీలకం. ఢిల్లీ రాజకీయాల్లో మోడీ ప్రతినిధిగా ఉంటూ వచ్చిన జైట్లీ, మోడీకి మద్దతుదారులను కూడగడుతూ వచ్చారు. 2014 ఎన్నికలకు మోడీ నాయకత్వంలోనే వెళ్లాలని ప్రతిపాదించిన వ్యక్తుల్లో అరుణ్ జైట్లీ ఒకరు. 2014 ఎన్నికల తర్వాత మోడీ తన మంత్రివర్గంలో మిత్రుడు జైట్లీకి ఆర్థిక మంత్రి పదవిని కట్టబెట్టారు. మోడీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ కితాబులు అందుకున్నారు.
రాజకీయాల్లో నిత్యం తీరిక లేకుండా గడిపే జైట్లీ క్రికెట్ పాలక మండళ్లలో బాధ్యతలు చేపట్టి ఆ క్రీడాభివృద్ధికి సహకరించారు. బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా ఆయన పనిచేశారు. అంతకుముందు దిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. ఢిల్లీ కోట్ల స్టేడియాన్ని ఆధునీకరించడంతో పాటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పిచ్ లను తయారు చేయించారు. ఢిల్లీ తరపున ఐపీఎల్ లీగ్ లో ఢిల్లీ డేర్ డేవిల్స్ జట్టు రావడంలో కూడా ఆయన పాత్ర ఉంది.
హిందుత్వ భావజాలం ఉండే బీజేపీలో లిబరల్ ఫేస్ ఉన్న అతికొద్ది మంది నేతల్లో ఆయన ఒకరు. పుస్తక పఠనం ఆయన వ్యాపకాల్లో ఒకటి. అలాగే.. న్యాయపరమైన అంశాలు, వర్తమాన వ్యవహారాలపై తాను రాసిన వ్యాసాలు.. వివిధ వేదికలపై చేసిన ప్రసంగాలను సంకలనంగా చేసి పుస్తకం వెలువరించారు. సమస్యల పరిష్కారంలో జైట్లీ శైలి ఇతర బీజేపీ జాతీయ నేతల కంటే భిన్నంగా ఉంటుందని... సామరస్యంగా పరిష్కారాలు చూపించగలిగే సత్తా ఆయన సొంతమని, తెగే వరకు లాగే తత్వం కాదని మేధావులు పేర్కొంటారు. న్యాయ సంబంధిత అంశాల్లోనూ ఆయన సమతూకం పాటిస్తారని చెప్పారు.
భాజపాకు దేశంలోని ఎలైట్ వర్గాని(మేధావులు, వ్యాపారవేత్తలు, లాయర్లు)కి వారధిగా వ్యవహరించిన జైట్లీకి పార్టీలకతీతంగా దేశంలోని అన్ని పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భాజపా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నిధుల సమకూర్చారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా 66 ఏళ్ళ వయస్సులో 2019, ఆగస్టు 24న మరణించారు. ఈనాడు మోడీ సర్కార్ ప్రతిపక్షాల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపడంలో ఆయనలేని లోటు స్పష్టంగా కనబడుతుంది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం







