తెలుగు ప్రతినాయక రారాజు-రాజనాల

- January 03, 2025 , by Maagulf
తెలుగు ప్రతినాయక రారాజు-రాజనాల

తెలుగు సినీ చరిత్రలో విలనిజం అంటే ఇదిరా... అని తెగేసి చెప్పిన మేటి ప్రతినాయకుడు రాజనాల. పరుషమైన డైలాగ్స్ దగ్గర నుండీ ఆహార్యం, మేనరిజం, స్టైల్ అన్నింటిలోనూ వైవిధ్యాన్ని కనబరిచిన గొప్ప విలన్ ఆయన. పాతతరం నటుల్లో ఎంతమంది విలన్లు ఉన్నా.. టక్కున గుర్తుకొచ్చే పేరు రాజనాల అనడంలో మాత్రం అతిశయోక్తి లేదు. ఈ రోజు రాజనాల జయంతిని పురస్కరించుకొని ఆయన జీవిత ప్రస్థానం గురించి తెలుసుకుందాం.  

రాజనాల పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు నాయుడు.1928,జనవరి 3 తేదిన నెల్లూరు జిల్లా కావలిలో జన్మించిన రాజనాలను అందరు రాజనాల కల్లయ్య అని కూడా పిలిచేవారు. SSLC పరీక్షలో ఉత్తీర్ణుడై ఇంటర్మీడియట్ చదివి రెవెన్యూ శాఖలో గుమాస్తాగా ఉద్యోగం సంపాదించారు. ఉద్యోగం చేస్తూ చదువు మీద వున్న శ్రద్ధతో డిపార్టుమెంటల్ పరీక్షలు వ్రాసి ఇనస్పెక్టర్ గా పదోన్నతి పై ముత్తుకూరులో ఉద్యోగం చేస్తూవచ్చారు. విద్యార్ధి దశలోనే నటన మీద ఆసక్తి ఏర్పడటంతో రంగస్థల ప్రవేశం స్కూల్లో ఉన్నప్పుడే జరిగింది. 

నాటకాల పట్ల ఉన్న ఆసక్తి కారణంగానే రాజనాల నెల్లూరులో ‘నేషనల్ ఆర్ట్ థియేటర్’ పేరుతో ఒక నాటక సమాజాన్ని స్థాపించి, ఆ సమాజం తరఫున నెల్లూరు పురమందిరం(నెల్లూరు టౌన్ హాల్)లో నాటక ప్రదర్శనలు ఇస్తూ వుండేవారు. నటనతో పాటుగా మల్ల విద్యలో సైతం ప్రావీణ్యం ఉన్న రాజనాల "మిస్టర్ ఇండియా"గా కూడా పేరు తెచ్చుకున్నారు. ఉద్యోగంలో అవినీతికి, అశ్రీతపక్ష వాదానికి రాజీపడలేక తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.  

ఉద్యోగంలో ఉన్న సమయంలోనే ఆయన సినిమా ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టారు. హెచ్ ఎం రెడ్డి నిర్మాతగా వచ్చిన 'ప్రతిజ్ఞ' సినిమాలో ఏ పాత్రా దొరక్కపోవడంతో ఆఖరికి విలన్‌గా చేశారు. అయితే అదే సినిమా సూపర్ హిట్టై తనకు మరిన్ని అవకాశాలు కల్పిస్తుందని ఆయన ఊహించలేదు. ఆయన తొలి సంపాదన 200 రూపాయలు. తొలుత సాంఘిక చిత్రాల్లో నటించినా.. ఆ తర్వాత పౌరాణిక పాత్రలు కూడా లెక్కలేనన్ని రాజనాలను వరించాయి. కంసుడిగా, జరాసంధుడిగా కూడా ఆయన ఆయా పాత్రల్లో జనాలను మెప్పించారు. శ్రీకృష్ణ పాండవీయంలో శిశుపాలుడిగా, అల్లూరి సీతారామరాజు చిత్రంలో బ్రిటీష్ మేజర్ గుడాల్‌గా కూడా రాజనాల చాలా సహజంగా నటించారు.  

తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు రాజనాల. అలాగే రెండు హిందీ సినిమాలతో పాటు ‘మాయా ద మాగ్నిఫిషియెంట్‌’ అనే ఆంగ్ల చిత్రంలో ఇండియన్‌ నావీ ఛీఫ్‌గా నటించారు. ఏ భాషలో నటించినా తన డైలాగులు తనే చెప్పుకొనే వారు రాజనాల. మరొకరితో డబ్బింగ్‌ చెప్పించడానికి అంగీకరించేవారు కాదు.

తెలుగు సినిమాల్లో విలన్‌ పాత్రలకు ఓ ప్రత్యేకత తెచ్చిన ఘనత రాజనాలదే. మంచి శరీర సౌష్టవంతో కథానాయకులకు దీటుగా కనిపిస్తూ.. ప్రతినాయక పాత్రలలో క్రూరత్వాన్ని అద్భుతంగా పండించేవారు రాజనాల. దుష్ట పాత్రలలో రాజనాల నవ్వే నవ్వు చాలా ప్రసిద్ధి. వెండితెరపై కంసుడు, జరాసంధుడు, మాయాల ఫకీరు, భూకామందు, దొంగల నాయకుడు అనగానే ఆయా పాత్రలలో రాజనాలనే గుర్తు చేసుకుంటారు ప్రేక్షకులు. అంతుకుమందు విలన్‌ పాత్రలు పోషించిన నటులు కొందరు ఉన్నా వారెవరూ తమదైన ముద్ర చూపించలేకపోయారు. రాజనాల రాకతో విలనీకి రాచఠీవి వచ్చింది. అంతేకాదు ఒకానొక సమయంలో హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న ఖ్యాతి ఆయనది. 

ఎన్.టి.ఆర్ కు ‘వద్దంటే డబ్బు’ చిత్రంలో నటించినప్పటినుంచి రాజనాల అంటే విపరీతమైన అభిమానం. ఎన్.టి.ఆర్ రాజనాలను ‘మామాజీ’ అంటూ పిలిచేవారు. రామారావు సొంత సినిమాలలో రాజనాలకు తప్పకుండా వేషం వుండేది. కుటుంబంతో సహా రాజనాలను తన ఇంటికి పిలిచి విందు ఇచ్చేవారు ఎన్.టి.ఆర్. ‘జయసింహ’ సినిమా శతదినోత్సవం విజయవాడలో జరిగినప్పుడు, ఎన్.టి.ఆర్ రాజనాలను తన సొంతవూరు నిమ్మకూరుకు తీసుకొనివెళ్లి అతిథి మర్యాదలు కూడా చేశారు.

రాజనాల జీవితమంతా మద్రాసులోని టీ నగర్‌తో ముడిపడి ఉండేదని చెప్పాలి. ఆంధ్ర నుంచి ప్రతి రోజూ ఎవరో ఒకరు వారింటికి వస్తుండేవారు. రోజూ కనీసం పాతిక మంది అన్నా వాళ్ల ఇంట్లో భోజనం చేస్తుండేవారు. అందుకే ఆయన ఇంటిని ఆ రోజుల్లో ‘రాజనాల సత్రం’ అని చమత్కారంగా అంటుండేవారు. ఆయన మొదటి భార్య శోభ సాక్షాత్తు అన్నపూర్ణమ్మే. వచ్చిన వారికి లేదనకుండా వండి వడ్డించేవారు.  

ఇక రాజనాల షూటింగ్‌లో ఉంటే పదిమందికి సరిపడేలా రకరకాల వంటకాలతో క్యారియర్‌ను స్పాట్‌కు పంపించేవారు శోభ. రాజనాలకు చెన్నెలో ఐదు భవంతులు ఉండేవి. ఖరీదైన ఐదు కార్లు ఉండేవి. కావలిలో 32 ఎకరాల స్థలం కూడా ఉండేది. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఖ్యాతి మిగిలింది తప్ప ఆస్తులు అన్నీ కరిగిపోయాయి. 

దాదాపు నాలుగు దశాబ్దాలకుపైగా 400 పై చిలుకు చిత్రాల్లో నటించిన రాజనాల పౌరాణిక, జానపద, సాంఘిక ఇలా.. ఏ తరహా సినిమాయైనా తనదైన గాంభీర్య నటనతో ఆయా పాత్రలకు ఆయన వన్నె తెచ్చారు. వెండితెరపై రారాజుగా రాణించిన రాజనాల వ్యక్తిగత జీవితం మాత్రం అత్యంత విషాదకరం, అత్యంత వైభవంగా బతికిన రాజనాల చివరి దశలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. 1979లో భార్య మరణించడంతో ఆయన వైభవం తగ్గుతూ వచ్చింది. 1984లో ఆయన కుమారుడు కులవర్ధన్‌ మూర్ఛవ్యాధితో మృతి చెందగా, మరో కుమారుడు కాళీచరణ్‌ బొంబాయి వెళ్లి అదృశ్యమయ్యారు. 

1991లో మద్రాసులో ఉన్నవన్నీ అమ్మేసి మిత్రులు, శ్రేయోభిలాషుల సహాయంతో హైదరాబాద్‌ చేరుకున్నారు. 1995లో ‘తెలుగువీర లేవరా’ సినిమా షూటింగులో ఉండగా కాలికి దెబ్బ తగిలింది. అది ఇన్‌ ఫెక్షన్‌ కావడంతో 1995 డిసెంబరులో కాలు తీసేశారు. అభిమానుల సహాయంతో చివరి రోజుల్లో జ్యోతిష్యం, అష్టసాముద్రికం చెప్పుకుని జీవించారు. రాజనాల 1998 మే 21న హైదరాబాద్‌లో మృతి చెందారు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com