చైనా లో వ్యాపిస్తున్న వైరస్ పై సీఎం రేవంత్ అలర్ట్

- January 05, 2025 , by Maagulf
చైనా లో వ్యాపిస్తున్న వైరస్ పై సీఎం రేవంత్ అలర్ట్

తెలంగాణ: కరోనా వైరస్‌తో ప్రపంచం ఇబ్బంది పడిన తర్వాత, ఇప్పుడు హెచ్‌ఎంపీవీ (HMPV) అనే కొత్త వైరస్ భయాన్ని పెంచుతోంది. చైనాలో వేగంగా వ్యాప్తి చెందిన ఈ వైరస్, జపాన్‌లో కూడా తన ప్రభావం చూపుతుంది. ప్రపంచ వ్యాప్తంగా దేశాలు ఈ వైరస్‌పై అప్రమత్తమవుతుండగా, తెలంగాణ ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్య సూచనలు జారీ చేసింది.

తెలంగాణ వైద్యారోగ్య శాఖ ఈ వైరస్‌పై ముందుగానే చైతన్యం కలిగించింది. ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్కులు ధరించాలని, జన సమూహాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో హెచ్‌ఎంపీవీ కేసులు నమోదుకాలేదని, అయినా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హెచ్‌ఎంపీవీ వైరస్ లక్షణాలు సాధారణ ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారులు, వృద్ధులు ఈ వైరస్ భారిన పడే ప్రమాదం ఎక్కువని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీసే అవకాశం ఉందని చెబుతున్నారు. లక్షణాలు కనిపించడానికి 3-6 రోజులు పడుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు, స్వల్ప లక్షణాలు ఉన్నా వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు. హెచ్‌ఎంపీవీ ప్రభావం ఎక్కువ కాకుండా నిరోధక చర్యలు తీసుకోవడంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. సీఎం రేవంత్ ప్రజలను భయపడకుండా ఉండాలని, కానీ అనవసర రిస్క్‌లు తీసుకోవద్దని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య సదుపాయాలను సిద్ధంగా ఉంచి, వైరస్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com