రాజకీయ నైతిక విలువలకు మారుపేరు - పాపన్న

- January 05, 2025 , by Maagulf
రాజకీయ నైతిక విలువలకు మారుపేరు - పాపన్న

బెజవాడ పాపిరెడ్డి.. వెనకటి తరం రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు ఇది. తెలుగునాట నిష్కళంక రాజకీయాలకు చిరునామాగా, మచ్చలేని ప్రజా నేతగా గుర్తింపు పొందారు. విలువలే ప్రాణంగా రాజకీయాలు నడిపారు. శాసనమండలి, శాసనసభ, రాజ్యసభ, లోక్ సభలకు ఎన్నికైన తెలుగు నాయకుల్లో ఆయన మొదటి వ్యక్తి. స్థితిమంతుల కుటుంబంలో జన్మించినా సామ్యవాద భావజాలమే శ్వాసగా ధ్యాసగా జీవించారు. కాంగ్రెసేతర రాజకీయాలు నడిపిన తెలుగు నాయకుల్లో పాపిరెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు. నేడు ప్రజా రైతు నాయకుడు బెజవాడ పాపిరెడ్డి గారి జయంతి.  

పాపన్నగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సుప్రసిద్దులైన బెజవాడ పాపిరెడ్డి గారు  1927, జనవరి 5న ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం గ్రామంలోని సంపన్న మరియు రాజకీయ కుటుంబానికి చెందిన బెజవాడ రామచంద్రారెడ్డి, బుజ్జమ్మ దంపతులకు జన్మించారు. మద్రాస్ పట్టణంలోని ప్రసిడెన్సీ కళాశాల నుంచి బీఎస్సి డిగ్రీని పూర్తి చేశారు.  

పాపిరెడ్డి తండ్రి గారైన బెజవాడ రామచంద్రారెడ్డి (బె.రా.రె) ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. జస్టిస్ పార్టీ నేతగా 1930-37 వరకు మద్రాస్  రాష్ట్ర శాసనమండలి అధ్యక్షునిగా పనిచేశారు. 1952 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘనవిజయాన్ని సాధించి, లోక్ సభలో విపక్ష పార్టీల తరపున ఉపనేతగా వ్యవహరించారు. రంగాతో కలిసి స్వతంత్ర పార్టీని స్థాపించారు. తన తండ్రి స్పూర్తితో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పాపిరెడ్డి విద్యార్ధి దశలోనే క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

కాంగ్రెస్ సోషలిస్టు  పార్టీ విద్యార్ధి విభాగమైన స్టూడెంట్ కాంగ్రెసులో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ 1942-47 వరకు రాష్ట్ర కమిటీలో సభ్యుడిగా కొనసాగారు. ఈ దశలోనే సోషలిస్టు భావజాలం పట్ల అనురక్తిని పెంచుకున్నారు. లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్, ఆచార్య నరేంద్ర దేవ, లోహియా వంటి సోషలిస్టు దిగ్గజాలను స్ఫూర్తిగా తీసుకోని సామ్యవాదమే తన వాదంగా మార్చుకున్నారు. 

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జయప్రకాష్ నారాయణ్, లోహియాలు స్థాపించిన సోషలిస్టు పార్టీలో చేరిన పాపిరెడ్డి గారు, నాటి  విజయనగరం జమీందారు పివిజి రాజు, మద్దూరి అన్నపూర్ణయ్య, బండారు రత్న సభాపతి, జొన్నలగడ్డ రామలింగయ్య, ఐనంపూడి చక్రధర్, నన్నపనేని వెంకట్రావు వంటి నేతలతో కలిసి సోషలిస్టు పార్టీలో పనిచేశారు. సోషలిస్టు పార్టీ స్థానే ప్రజా సోషలిస్టు పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత ఆ పార్టీ రాష్ట్ర కమిటీలో సైతం కొనసాగారు. ప్రజా సోషలిస్టు పార్టీలో చీలికలు ఏర్పడిన తర్వాత తన తండ్రి వ్యవస్థాపకుడిగా ఉన్న స్వతంత్ర పార్టీలో చేరారు. 

స్వతంత్ర పార్టీలో తండ్రి రామచంద్రారెడ్డి గారు ఆంధ్రశాఖ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించగా, జాగర్లమూడి చంద్రమౌళి, ఆచార్య ఎన్జీ రంగా, గౌతు లచ్చన్న, పాటూరి రాజగోపాల నాయుడు వంటి దిగ్గజ నేతలతో కలిసి పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. తండ్రి క్రియాశీలక రాజకీయాల నుంచి విరమించిన తర్వాత కూడా ఆయన కాంగ్రెసేతర రాష్ట్ర నాయకుడిగా ఎదిగారు. 1977- 82 వరకు జనతా, లోక్ దళ్ పార్టీల్లో రాష్ట్ర నాయకుడిగా ఉన్నారు.

1982లో ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు పాపిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983 నుంచి 1985 వరకు తెలుగుదేశం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తెదేపా ఎన్నికల గుర్తైన "సైకిల్" ను ప్రతిపాదించింది కూడా పాపిరెడ్డి గారే కావడం మరో విశేషం.1984 ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్ అండగా నిలిచిన అతికొద్ది మంది నాయకుల్లో పాపిరెడ్డి గారు ముఖ్యులు. ఎన్టీఆర్ సన్నిహితుడిగా తెదేపాలోనే చివరి శ్వాసవరకు కొనసాగారు.

తెలుగు నాట నాలుగు చట్టసభలకు ఎన్నికైన తోలి నేతగా పాపిరెడ్డి గారు చరిత్ర  సృష్టించారు.1958లో సోషలిస్టు, కమ్యూనిస్టుల మద్దతుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా 1962 వరకు పనిచేశారు. 1967లో అల్లూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర పార్టీ తరపున ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 1972లో స్వతంత్ర పార్టీ మద్దతుతోనే రాజ్యసభకు ఎన్నికైన ఆయన 1978 వరకు కొనసాగారు. 1983 ఎన్నికల్లో అల్లూరు నుంచి  తెదేపా తరపున రెండో సారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ గారి  అభ్యర్థన మేరకు 1984లో ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ కేంద్రమంత్రి పులి వెంకట రెడ్డిని ఓడించి చరిత్ర సృష్టించారు. 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ ఎన్టీఆర్ అభ్యర్థన మేరకు తన శిష్యుడైన మాజీ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి మీద పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి తర్వాత క్రియాశీలక రాజకీయాల నుంచి విరమించారు.

పాపిరెడ్డి గారిది విలక్షణమైన వ్యక్తిత్వం. రాజకీయాల్లో గెలుపోటములు పట్ల ఏనాడు ఆసక్తి కనబరచలేదు. గెలిస్తే సంతోషపడటం, ఓడితే డీలా పడటం ఆయనకు తెలీదు. రాజకీయాల్లో గెలుపోటముల పట్ల అంత నిర్వికారంగా ఉండటం ఆయనకే చెల్లింది. తామరాకుపై  నీటి బొట్టులా పదవుల కోసం ఆయన పాకులాడలేదు, ఆరాట పడి పైరవీలు చేయలేదు. అలా అని ఇస్తే వద్దనలేదు. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఆయన్ని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ (APIDC) ఛైర్మన్ గా నియమించారు. ఏ రాజకీయ  పదవైనా, ఆయనకు అలంకార ప్రాయం, దానితో వచ్చే సౌకర్యాలు పట్ల ఆసక్తి చూపేవారు కాదు.  

పాపిరెడ్డి గారికి దేశవ్యాప్తంగా ఉన్న ఎందరో దిగ్గజ రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, అశోక్ మహతా, ఆచార్య కృపలానీ, చౌధరీ చరణ్ సింగ్, బిజూ పట్నాయక్, చంద్రశేఖర్, మధు దండావతే, జార్జ్ ఫెర్నాండెస్ వంటి వారితో వ్యక్తిగత మైత్రి కలిగి ఉండేవారు. ముఖ్యంగా తన రాజకీయ గురువుగా భావించిన జయప్రకాష్ నారాయణ్ పట్ల చివరి వరకు ఆరాధన భావంతో ఉండేవారు. ఆయన చేపట్టిన సర్వోదయ ఉద్యమంలో పాల్గొన్నారు. తన పరిచయాలను రాజకీయ ఎదుగుదల కోసం లేదా, పదవుల పైరవీల కోసం దుర్వినియోగం చేయలేదు కాబట్టే ! ఆయన రాజకీయ జీవితంలో ఎవరికి తలవంచాల్సిన అవసరం రాలేదు. తాను దైవాంశ సంభూతుడిగా భావించుకునే ఎన్టీఆర్ వంటి వ్యక్తికి సైతం తలవంచని వ్యక్తిత్వం పాపిరెడ్డి గారి సొంతం.

పాపిరెడ్డి గారు రైతు పక్షపాతి.  ఆయన రైతుల సమస్యల పరిష్కారానికి చట్ట సభల ద్వారా రాజీలేని పోరాటాలు నడిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  వ్యవసాయ యూనివర్సిటీ సెనేట్ మెంబర్ గా సైతం పనిచేసిన ఆయన వ్యవసాయ విద్యలో రావాల్సిన సంస్కరణల గురించి పలు మార్లు ఆనాటి బ్రహ్మానంద రెడ్డి సర్కార్ దృష్టికి తీసుకెళ్లారు. కోవూరు సహకార చక్కర కర్మాగారం ఏర్పాటుకు తన వంతు కృషి చేశారు. రైతాంగ సమస్యలే ఆయన్ని మాజీ ప్రధాని చౌధరీ చరణ్ సింగ్, ఆచార్య ఎన్జీ రంగా వంటి రైతాంగ నాయకులకు దగ్గరయ్యేలా చేసింది. తెదేపా హయాంలో సోమశిల, కండలేరు జలాశయాల నిర్మాణం జరిగేలా చూశారు.  

సంగం ఆనకట్ట నుంచి కావలి ప్రాంతానికి సాగు, తాగు నీటిని తీసుకు వెళ్లే కావలి కాలువతో బెజవాడ పాపిరెడ్డి కుటంబానికి అవినాభావ సంబంధం ఉంది. 1937 మద్రాస్ అసెంబ్లీ ఎన్నికల్లో కావలి నుంచి పోటీచేసిన బెజవాడ పాపిరెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి కావలి కాలువ కారణంగా ఓటమి చెందారు. ఆయన ప్రత్యర్థి బెజవాడ గోపాలరెడ్డి కావలి కాలువను ఏర్పాటు చేయిస్తానని ప్రజలకు ఎన్నికల్లో వాగ్దానం చేసి విజయం సాధించారు. అయితే, గోపాలరెడ్డి హామీని పట్టించుకోకపోతే రామచంద్రారెడ్డి తనయుడు పాపిరెడ్డి గారు ఈ కాలువ కోసం శక్తివంచన లేకుండా కృషి చేశారు.

1983లో ఎన్టీఆర్ సీఎం కాగానే కావలి కాలువ నిర్మాణ ఆవశ్యకతను ఆయన దృష్టికి తెచ్చి త్వరతగతిన ప్రభుత్వ నిధులను మంజూరు చేయించి,  యుద్ధప్రాతిపదికన నిర్మింపజేయించారు. నిర్మాణం పూర్తైన తర్వాత ఆయనతోనే పాపిరెడ్డి ప్రారంభింపజేశారు. కావలి కాలువ కారణంగా ఈనాడు కావలి, అల్లూరు ప్రాంతాల్లో వేలాది మంది రైతన్నల జీవితాల్లో వెలుగులు నిండాయి. ప్రస్తుతం ఈ కాలువ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది. పాపిరెడ్డి గారి జ్ఞాపకంగా కావలి కాలువకు బెజవాడ పాపిరెడ్డి కాలువగా 2015లో తెదేపా ప్రభుత్వం నామకరణం చేసింది. పాపిరెడ్డి పేరు పెట్టడం పట్ల పార్టీలకతీతంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజలు ముఖ్యంగా కావలి, అల్లూరు ప్రాంత రైతాంగం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. తమ కోసం అహర్నిశలు శ్రమించిన మచ్చలేని మహా రైతు నాయకుడికి గుర్తింపు దక్కిందని సంబరాలు చేసుకున్నారు.

పాపిరెడ్డి గారు రాజకీయ అజాత శత్రువు. పార్టీలకతీతంగా అన్ని పార్టీల నాయకులతో సన్నిహిత సంబంధాలు నెరిపారు. ఆయనకు మన తన అనే భేధంగా లేకుండా అందరిని సమానంగా చూసేవారు. తనకు కావాల్సిన విషయాల్లో ప్రత్యర్థులు విభేదించినా తన ఓర్పు, నేర్పు భావపఠిమ సామర్థ్యంతో వారిని ఒప్పించడమే కాకుండా, ఇంకెప్పుడూ తనతో విభేదించే అవకాశాన్ని వారికి కల్పించేవారు కాదు. పార్టీలకు అతీతంగా ఆయనకు శిష్యగణం ఉంది. మాజీ మంత్రి, దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వెంకయ్య నాయుడు, గొట్టిపాటి కొండప నాయుడు వంటి పలువురు నేతలు ఆయనకు శిష్యులు. ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజానీకం ఆయన్ని "పాపన్న" అని ఏంతో ఆప్యాయంగా పిలుచుకునేవారు. అదే పేరుతోనే ఆయన ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ప్రసిద్ధి చెందారు.

పాపిరెడ్డి గారంటే గుర్తుకు వచ్చేది హాస్య ఛలోక్తులు. ఆయన మహామాటకారి, నోరు విప్పారంటే హాస్య రసం గంగా ప్రవాహం వలె ఉద్యమ తరంగిణిలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆయన స్నేహపాత్రుడు. తన హాస్య ఛలోక్తులతో నవ్వడం, నవ్వించడం చేసేవారు. అట్లని ఏనాడు నవ్వుల పాలు కాలేదు. అట్లాగే, తనని చూసి నలుగురు నవ్విపోయే అవకాశాన్ని ఇవ్వలేదు. ఇదే ఆయనలోని ప్రత్యేకత. ఎంత తీవ్రమైన రాజకీయ వివాదం వచ్చినా మనసును గిలిగింతలు పెట్టే చతురోక్తులతో కూడిన సమాధానాలు చెప్పి నవ్వించేవారు. తన మనసులోని భావాలను నిర్మొహమాటంగా చెప్పడానికి వెనుకాడేవారు కాదు. నిష్కర్షగా ఉండే ఆ భావాలు ఎంత పదునుగా ఉన్నప్పటికి, వాటికి తేనే పూత వంటి చతురోక్తి కలగలసి ఉండేది కాబట్టి ఆయన విమర్శలకు ఎవరు నొచ్చుకునే అవకాశం ఉండేది కాదు.  

పాపిరెడ్డి గారు భూస్వామ్య కుటుంబంలో జన్మించినా సామ్యవాద భావజాల సంపత్తిని తనలో ఇముడ్చుకున్నారు. భూస్వామ్య సంస్కృతి, సామ్యవాదం రెండు భిన్న ధృవాలు; ఇవి రైలు పట్టాల వలే ఎప్పటికి కలిసే అవకాశం లేదు. కానీ పాపిరెడ్డి గారు మాత్రం తన వ్యక్తిత్వంలో రెండిటిని సమ్మిళితం చేశారు. రాజకీయాల్లో నాలుగున్నర దశాబ్దాల పాటు ఉన్నా ఏనాడూ అవినీతికి పాల్పడలేదు, బంధుప్రీతిని దరిచేరనీయలేదు. అవినీతి రహితుడుగా, వివాద రహితుడుగా పేరు గడించారు  నేటి తరం నాయకులతో పోలిస్తే నిజాయతీకి నిలువెత్తు నిదర్శనంగా, నైతిక విలువలకు నిలువుటద్దంగా చివరి శ్వాస వరకు నిలిచారు. అనారోగ్యం కారణంగా  2002, జనవరి 7న తన 75వ ఏట కన్నుమూశారు. సోషలిస్ట్ నాయకుడిగా సామ్యవాద సిద్దాంత భావాలతో పాటుగా విలువలతో కూడిన రాజకీయాలు నడిపిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు.  


- డి.వి.అరవింద్ 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com