వెండితెర నట భూషణుడు-సోగ్గాడు శోభన్ బాబు
- January 14, 2025
ఉప్పు శోభనా చలపతిరావు.. ఈ పేరు వింటే మీరు ముక్కునవేలేసుకోవచ్చు. ఎవరై ఉంటారా? అని సందేహించవచ్చు. కానీ.. అదే టాలీవుడ్ సోగ్గాడు శోభన్ బాబు గారి అసలు పేరు. పేరు సంగతి ఎలాగున్నా.. చిత్రసీమలోకి రాగానే 'శోభన్' ఒక నటుడిగా తెచ్చుకున్న పేరు, ప్రఖ్యాతులు అన్నీ ఇన్నీ కావు. తెలుగువారి అందాలనటుడు...అందమైన నటనకు కేరాఫ్ అడ్రస్...ఇలాంటి విశేషణాలు శోభన్ బాబుకు తప్ప మరే నటుడి గురించి వినబడలేదు. గ్లామర్ హీరోగా పాపులర్ అయినా...డీ గ్లామర్ రోల్స్ లోనూ మెప్పించారాయన. ఎక్కడ మొదలు పెట్టాలో...ఎక్కడ ఆపేయాలో తెల్సి ఆచరించడం చాలా గొప్ప వాళ్లకు మాత్రమే సాధ్యం. అది శోభన్ కు సాధ్యమైంది. నేడు నట భూషణ్ శోభన్ బాబు జయంతి. ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా తన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..!
శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. 1937 జనవరి 14 న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం తాలూకాలోని కుంటముక్కల గ్రామంలో అమ్మమ్మ గారింట ఉప్పు రామతులశమ్మ, సూర్యనారాయణరావు దంపతులకు జన్మించారు. వారి స్వస్థలం మాత్రం చిన్న నందిగామ గ్రామం. మైలవరంలో హైస్కూల్ విద్యను, విజయవాడ SRR & CVR కళాశాలలో ఇంటర్మీడియట్, గుంటూరు ఏసీ కళాశాలలో బీఎస్సి పూర్తి చేశారు.
శోభన్ బాబు మైలవరంలో చదువుకుంటున్న సమయంలోనే నటన పట్ల ఆసక్తి పెంచుకున్నారు. కాలేజీ రోజుల్లో నాటకాలు వేశారు. ‘పునర్జన్మ’ వంటి నాటకాలలో ప్రధానపాత్రలు పోషించి అనతికాలం లోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తిరువూరులో తొలిసారి ‘కీలుగుఱ్ఱం’ సినిమా చూసి సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. దేవదాసు, పాతాళభైరవి, మల్లీశ్వరి సినిమాలను బాగా అభిమానించేవారు. మల్లీశ్వరి సినిమాని ఇరవై సార్లకు పైగా చూశానని శోభన్ స్వయంగా చెప్పుకున్నారు. సినిమా రంగంలో రాణించాలన్న అభిలాషతో చెన్నపట్టణం చేరిన శోభన్ బాబు ఆరంభంలో పలు కష్టాలు, నష్టాలు చవిచూశారు.
భరణి, వీనస్, విక్రమ్, వాహిని, ఏవియం, గోల్డెన్ స్టూడియోల చుట్టూ తిరుగుతూ కనపడిన నిర్మాతను, దర్శకుణ్ణి కలిసి ఫోటోలు యిచ్చి సినిమాల్లో నటించే అవకాశాలు ఇమ్మని అడుగుతూ కాలం గడిపేవారు. ఇంటికి, కాలేజీకి దూరం ఎక్కువై తిరగటం కష్టమై పోవడంతో స్తూడియోలకు దగ్గరగా వుండే కోడంబాక్కం వద్దకు మకాం మార్చారు. శోభన్ కు సినిమాల్లో చేరడం మీద శ్రద్ధ వుందని తండ్రికి చూచాయగా తెలిసింది. అటువంటి అవకాశాలకోసమే ముమ్మరంగా ప్రయత్నించమని ప్రోత్సహించారు.
1959లో పొన్నలూరు బ్రదర్స్ సంస్థ శ్రీకృష్ణ మూవిటోన్ స్టూడియోలో ‘దైవబలం’ సినిమా నిర్మిస్తోంది. ఆ సంస్థ అధినేత వసంతకుమార్ రెడ్డిని శోభన్ కలిసి ఫోటోలు ఇచ్చారు. ఆయన పరీక్షగా చూసి “నీలో మంఛి నటుడున్నాడు. సినిమాలకు పనికొస్తావ్” అంటూ మేకప్ టెస్టు చేయించారు. అందులో గంధర్వ కుమారుడి వేషమిచ్చారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆ సినిమాలో మూడురోజుల షూటింగుతో చిన్న పాత్ర పోషించినందుకు శోభన్ కు రెండు వందల రూపాయల పారితోషికం లభించింది. డబ్బుకన్నా తన ఆరాధ్యదైవం ఎన్టీఆర్ తో కలిసి నటించడం శోభన్ కు ఎంతో సంతృప్తి నిచ్చింది. ఆ సినిమాతోనే ఉప్పు శోభనాచలపతిరావు ‘శోభన్ బాబు’ గా అవతార మెత్తారు.
‘దైవబలం’ సినిమా ఆశించినంత గొప్పగా ఆడలేదు. నిజానికి వసంతకుమార్ రెడ్డి శోభన్ ను హీరోగా పెట్టి కనకమేడల రచించిన ‘మహామాయ’ నవలను సినిమాగా తీద్దామనుకున్నారు. ‘దైవబలం’ ఫ్లాప్ కావడంతో ఆ సినిమా ప్రయత్నాలు మూలపడ్డాయి. 1960లో విశాఖపట్నానికి చెందిన నిర్మాత బి.ఆర్.నాయుడు సుఖీభవ ప్రొడక్షన్స్ పతాకంపై ‘భక్త శబరి’ చిత్రాన్ని నిర్మిస్తూ అందులో శబరి చెంత వుండే ‘కరుణ’ అనే మునికుమారుడి పాత్రను శోభన్ కు ఇచ్చారు. అందులో పండరీబాయి శబరిగా, హరనాథ్, రామకృష్ణలు రామలక్ష్మణులుగా ఎంపికయ్యారు. దర్శకుడు చిత్రపు నారాయణమూర్తి శోభన్ మీద ఒక పాటను కూడా చిత్రీకరించారు. సినిమా 15, జూలై 1960 న విడుదలైంది. సినిమా సుమారుగా ఆడినా, శోభన్ అంటే కొత్త నటుడని ప్రేక్షకలోకానికి తెలిసింది.
ఎన్టీఆర్ ‘సీతారామ కల్యాణం’(1961) చిత్రాన్ని నిర్మిస్తూ శోభన్ కి లక్ష్మణుడి పాత్ర ఇస్తూ “సినిమా రంగాన్ని ధ్యానంగా, తపస్సుగా స్వీకరించండి. సక్రమంగా, వినయంగా, సత్సీలతతో మెలగండి. మీరు తప్పకుండా పైకి వస్తారు” అంటూ తొలిరోజు షూటింగులో ఉద్బోధ చేశారు. ఆ సలహా శోభన్ మీద తీవ్రమైన ప్రభావం చూపింది. క్రమశిక్షణ అలవాటు చేసింది. శోభన్ ప్రవర్తన నచ్చిన ఎన్టీఆర్ తరవాత ‘భీష్మ’ సినిమాలో శోభన్ కు అర్జునుడు వేషం ఇప్పించారు. తరవాత కొన్ని ఆఫర్లు వచ్చినా షూటింగు మొదలై ఆగిపోయేవి. వాటిలో ‘పార్వతీ పరమేశ్వరులు’, ‘ఆణిముత్యం’, ’ఉల్లాసపయనం’ వంటి చిత్రాలున్నాయి. తరవాత నిర్మాత పండరీకాక్షయ్య ‘మహామంత్రి తిమ్మరుసు’ చిత్రంలో తిమ్మరుసు కొడుకు గోవిందరాయలు పాత్రను శోభన్ కు ఇచ్చారు.
ఎన్టీఆర్ శోభన్ కు ‘లవకుశ’ చిత్రంలో శత్రుఘ్నుడి పాత్రను ఇప్పించారు. అదే సమయంలో అన్నపూర్ణా సంస్థ వారు నిర్మిస్తున్న ‘చదువుకున్న అమ్మాయిలు’ (1963) చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు శోభన్ కు రెండవ హీరో గా పోలీసు అధికారి పాత్రను ఇచ్చి ప్రోత్సహించారు. అలా సావిత్రి ప్రక్కన తొలిసారి నటించే అవకాశం శోభన్ కు లభించింది. అలాగే ‘ఇరుగుపొరుగు’ చిత్రంలో అతిథి పాత్ర లభించింది. చిన్నచిన్న పాత్రలు పోషిస్తూ ఆర్ధికంగా శోభన్ కష్టాలు అనుభవించారు. ఆ పరిస్థితుల్లో కమలాకర కామేశ్వరరావు ‘నర్తనశాల’ (1963) చిత్రంలో అభిమన్యుడి పాత్రకు శోభన్ ను ఎంపిక చేశారు. ఈ మూడు సినిమాల ఆదరణతో ‘సుమంగళి’ (1965) సినిమాలో “ఏవేవో చిలిపితలపు లురుకుతున్నవి” అనే పాటలో జయంతితో నటించే అవకాశం దక్కింది.
దిగ్గజ నిర్మాతలు సుందర్ లాల్ నహతా-డూండీ (డూందేశ్వరరావు)లు భారీ బడ్జెట్ తో ‘వీరాభిమన్యు’ చిత్రాన్ని ప్రారంభిస్తూ అభిమన్యుని పాత్రకు హరనాథ్, రామకృష్ణ లను త్రోసిరాజని శోభన్ ని ఎంపికచేశారు. ఇందులో దర్శకుడు వి. మధుసూదనరావు ప్రమేయం, ఎన్టీఆర్ ప్రోద్బలం కూడా వుంది. హీరో పాత్ర కావడంతో పెద్దపెద్ద డైలాగులు శోభన్ తో చెప్పించారు దర్శకుడు. ఆగస్టు 12, 1965 న ‘వీరాభిమన్యు’ చిత్రం విడుదలై అఖండ విజయం సాధించింది. శోభన్ కు మంచి పేరొచ్చింది. కానీ పౌరాణిక చిత్రాలకు ఆదరణ తక్కువ కావడంతో నిర్మాతలు ఆ జోలికి పోవడం తగ్గించేశారు. పౌరాణిక చిత్ర హీరోగా ముద్రపడడంతో అవకాశాలు రావడం తగ్గాయి.
సుందర్ లాల్ నహతా-డూండీలు కృష్ణ హీరోగా ‘గూఢచారి 116’ (1966) చిత్రాన్ని నిర్మిస్తూ, అందులో ఐదు నిమిషాలు మాత్రమే వుండే గూఢచారి పాత్రను ఇచ్చారు. అదే సంస్థలో హీరోగా చేసిన శోభన్ ఒక సంవత్సరం గ్యాప్ లోనే చివరికి గెస్ట్ పాత్ర పోషించాల్సి రావడం లలాట లిఖితం అంటారు శోభన్. అప్పుడే శోభన్ బాబు మానసికంగా రాటు తేలారు. ఆటుపోట్లకు అలవాటు పడే వాతావరణాన్ని సృష్టించుకున్నారు. చిన్న సంస్థల్లో చిన్న పాత్రలు వెయ్యరాదని, పెద్ద బ్యానర్లలో గెస్టు పాత్ర పోషించినా మంచిదే అనే అభిప్రాయానికి వచ్చిన శోభన్ కొన్ని పాత్రలు తిరస్కరిస్తూ, సురేష్ సంస్థ రామానాయుడు నిర్మించిన ‘ప్రతిజ్ఞాపాలన’లో మాత్రం నారదుడి పాత్రను ఒప్పుకున్నారు.
ఎస్. భావనారాయణ నిర్మించిన ‘లోగుట్టు పెరుమాళ్ళకెరుక’ (1966) చిత్రంలో శోభన్ బాబుకు హీరోగా నటించే అవకాశం వచ్చింది. కె.ఎస్.అర్. దాస్ కు అది మొదటి చిత్రం. ఆ సినిమా హిట్ కాలేదు. హిట్టయ్యుంటే మాత్రం శోభన్ క్రైం చిత్రాలబారిన పడివుండేవారు. అందుకే “అంతా మనమంచికే” అనే సామెత పుట్టింది. అదే సంవత్సరం నటుడు పద్మనాభం ‘పొట్టిప్లీడరు’ చిత్రం నిర్మిస్తూ శోభన్ బాబుకు మంచి పాత్ర ఇచ్చారు. ఆ చిత్రం శతదినోత్సవం చేసుకుంది. తరవాత ‘భక్త పోతన’ లో శ్రీరాముడి వేషం, ‘శ్రీకృష్ణావతారం’లోను, నారదుడి వేషం లభించాయి. సుందరాల్ నహతా-డూండీ నిర్మించిన ‘సతీ అనసూయ’ చిత్రంలో నారదుడి పాత్ర పోషించమంటే మొహమాటం లేకుండా “హీరో కి ఇచ్చే పారితోషికం ఇస్తేనే చేస్తాను” అని భీష్మించి పంతం నెరవేర్చుకున్నారు.
జి. విశ్వనాథం దర్శకత్వంలో ‘సత్యమేజయం’, రిపబ్లిక్ ప్రొడక్షన్స్ సీతారామ్ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ‘రక్తసిందూరం’, కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో నిర్మించిన ‘కాంభోజరాజు కథ’ సినిమాల్లో హీరోగా నటించారు. ఆ చిత్రాలు గొప్పగా ఆడలేదు. అప్పుడే ఎన్టీఆర్ కబురుపెట్టి దాదామిరాసి దర్శకత్వంలో వాసూమీనన్ నిర్మిస్తున్న ‘పుణ్యవతి’ (1967) చిత్రంలో ఒక మంచి పాత్రకు సిఫార్సు చేశాననే చల్లని కబురు చెప్పారు. అందులో హీరో ఎన్టీఆర్ కు ఒక పాటే వుంటే శోభన్ కు మాత్రం “ఇంతేలే నిరుపేదల బ్రతుకులు”, “పెదవులపైన సంగీతం” అనే రెండుపాటలు పెట్టారు. ఎన్టీఆర్ ఉదార స్వభావానికి శోభన్ శిరస్సువంచి నమస్కరించారు. అందుకే చనిపోయేదాకా శోభన్ బాబు ఉదయం ఆఫీసులో అడుగు పెట్టగానే ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించనిదే ఏపనీ మొదలు పెట్టేవారు కాదు.
ఎన్టీఆర్ శోభన్ బాబు కి అలా సాయం చేస్తే అక్కినేని మరలా వారి సొంత సంస్థలో ‘పూలరంగడు’ చిత్రానికి సహాయ కథానాయకుడిగా వేషం లభించేలా చేశారు. కె. హేమాంబరధరరావు దర్శకత్వంలో నిర్మించిన ‘ఆడపడుచు’ చిత్రంలో ఎన్టీఆర్, శోభన్ బాబు చంద్రకళకు అన్నలుగా నటించారు. విశ్వనాథ్ దర్శకత్వంలో ‘లక్ష్మినివాసం’ చిత్రంలో రామ్మోహన్ తోబాటు శోభన్ నటించారు. ఈ రెండు చిత్రాలూ విజయవంతమయ్యాయి. బాపు దర్శకత్వంలో నిర్మించిన ‘బుద్ధిమంతుడు’ చిత్రంలో శ్రీకృష్ణుని పాత్ర పోషించినప్పుడు అందులో భక్తుని పాత్రలో వున్న అక్కినేని శోభన్ బాబు కాళ్ళకు దణ్ణం పెట్టే సన్నివేశముంది.శోభన్ ఆ సన్నివేశానికి ఒప్పుకోలేదు. అంతటి సీనియర్ టాప్ గ్రేడ్ హీరో తన కాళ్ళు పట్టుకోవడం అపచారమని భావించారు శోభన్. అక్కినేని, బాపు నచ్చజెప్పిన తరవాతగాని ఒప్పుకోలేదు. చిత్రీకరణ పూర్తయ్యాక అక్కినేనికి పాదాభివందనం చేసి క్షమాపణ కోరిన సున్నిత హృదయుడు శోభన్ బాబు.
1967లో 10 సినిమాల్లో, 1968లో 9 సినిమాల్లో శోభన్ నటించారు. ఇక 1969లో శోభన్ బాబు 12 సినిమాల్లో నటించారు. ముఖ్యంగా దర్శక నిర్మాత బి.ఎన్. రెడ్డి నిర్మించిన చివరి చిత్రం ‘బంగారు పంజరం’ లో నటించడం ఒక మధురానుభూతి అంటుండేవారు శోభన్ బాబు. “ఏ మల్లీశ్వరి సినిమాను ఇరవై సార్లకు పైగా చూశానో, ఆ మల్లీశ్వరిని అందించిన మహనీయుని వద్ద పనిచేయడం కన్నా వేరే అదృష్టమేముంటుంది” అని స్నేహితుల దగ్గర చెప్పుకుంటూ మురిసిపోయేవారు శోభన్. అయితే వాణిశ్రీ-శోభన్ జంటను ప్రేక్షకులు అప్పట్లో ఆదరించలేదు. కారణం ఆ పాత్రలు సావిత్రి-నాగేశ్వరరావు పోషించాల్సినవని భావించడమే. తరవాతి కాలంలో శోభన్ బాబు-వాణిశ్రీ జంట ఎంత హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకుందో చెప్పాల్సిన పనిలేదు.
జెమినీ వారు మలయాళంలో హిట్టయిన ‘తులాబారం’ చిత్రాన్ని తెలుగులో ‘మనుషులు మారాలి’ పేరుతో నిర్మిస్తూ శోభన్ బాబు ని హీరోగా తీసుకున్నారు. రజతోత్సవం చేసుకున్న ఆ చిత్రంలో శోభన్ కు మంచి పేరొచ్చింది. దాంతో శోభన్ కు స్టార్ వాల్యూ వచ్చింది. ఆ సినిమాకు కె.రాఘవేంద్రరావు, ఎ. కోదండరామిరెడ్డి సహాయ దర్శకులుగా వి. మధుసూదనరావు వద్ద పనిచేశారు. వారితో శోభన్ స్నేహాన్ని పెంచుకున్నారు. తదనంతర కాలంలో విజయవంతమైన దర్శకులుగా పేరు తెచ్చుకున్న వారిద్దరూ శోభన్ కు ఎన్ని అవకాశాలు ఇచ్చారో తెలిసిందే.
శోభన్ బాబుకి మరో బ్రేక్ ఇచ్చిన చిత్రం నవతా కృష్ణంరాజు నిర్మించిన ‘తాసిల్దారు గారి అమ్మాయి’. చిన్నప్పటినుండి ఎవరినైతే తన అభిమాన నటిగా ఆరాధించారో ఆ ‘జమున’ ఈ చిత్రంలో శోభన్ సరసన నటించింది. అందులో శోభన్ ది తండ్రిగా, కొడుకుగా ద్విపాత్రాభినయం. తరవాత వచ్చినవన్నీ ఛాలంజింగ్ పాత్రలే.నటుడు బాలయ్య నిర్మించిన ‘చెల్లెలి కాపురం’, బాపు నిర్మించిన ‘సంపూర్ణ రామాయణం’, ఉషశ్రీ చిన్నపరెడ్డి నిర్మించిన ‘మానవుడు దానవుడు’ చిత్రాలు వేటికవే సాటి. మానవుడు-దానవుడులో ఒక పాత్రలో నిస్వార్ధంగా సేవచేసే డాక్టరు, మరో పాత్రలో కరడుగట్టిన కిరాయి హంతకుడుగా ఈ రెండు పాత్రల్ని సమర్ధవంతంగా పోషించారు శోభన్. ఈ చిత్ర సంచలన విజయంతో శోభన్ పారితోషికం ఎనిమిది రెట్లు పెరిగింది. అలాంటి చిత్రాలే వరస విజయాలను తెచ్చిపెట్టిన ‘కాలం మారింది’, ‘జీవనతరంగాలు’, ‘శారద’, ‘పుట్టినిల్లు మెట్టినిల్లు’, ‘డాక్టరు బాబు’, ‘కన్నవారి కలలు’, ‘గంగ-మంగ’, ‘జీవితం’, ‘ఖైదీ బాబాయి’, ‘దేవాలయం’, ‘దేవత’, ‘కార్తిక దీపం’, ‘మల్లెపూవు’.. మరెన్నో. ఇక శోభన్ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
శోభన్ బాబు డైరక్టర్స్ హీరో. ఆయన కెరీర్ మొత్తంలో ప్రధానంగా నలుగురైదుగురు డైరక్టర్లు కనిపిస్తారు. వారిలో కె.ఎస్ ప్రకాశరావు, కె.విశ్వనాథ్, బాపు, వి.మధుసూధనరావు, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు. వీళ్లందరూ శోభన్ బాబు కెరీర్ లో టాప్ మూవీస్ అని చెప్పుకునే సినిమాలు తీశారు. తనలోని నటుడ్ని పూర్తి స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. కళాతపస్వి విశ్వనాథ్ కెరీర్ లో శోభన్ తోనే ఎక్కువ సినిమాలు చేశారు. ప్రైవేటు మాస్టారు చిత్రంతో ప్రారంభమైన వీరిద్దరి ప్రయాణం నిండు హృదయాలు, చిన్న నాటి స్నేహితులు, శారద, జీవనజ్యోతి, జీవిత నౌక, కాలాంతకులు, చెల్లెలి కాపురం ఇలా కొనసాగింది. శోభన్ బాబు గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు...డీ గ్లామర్ రోల్స్ నూ అద్భుతంగా చేసి మెప్పించగలడని నిరూపించిన చెల్లెలి కాపురం విశ్వనాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్నదే.
శోభన్ బాబుతో పూర్తి విభిన్నపాత్రలు చేయించిన దర్శకుడు బాపు. బుద్దిమంతుడులో కృష్ణుడుగా శోభన్ ను చూపించి ఆడియన్స్ తో శభాష్ అనిపించారు. రాముడుగా రామారావును తప్ప ఇంకొకరిని ఆడియన్స్ ఒప్పుకోరనుకుంటున్న సమయంలో సంపూర్ణ రామాయణం తీశారు. సాక్షాత్తు ఎన్.టి.ఆర్ సైతం రాముడుగా శోభన్ బాబు చక్కగా ఉన్నాడని కితాబు ఇవ్వడం విశేషం. శోభన్ బాబు తో ప్రత్యేక అనుబంధం ఉన్న మరో దర్శకుడు దాసరి నారాయణరావు. వీరి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం బలిపీఠం. చావుకు చేరువౌతున్న బ్రాహ్మణవితంతువును పెళ్ళి చేసుకుని ఆమె జీవితంలో వసంతాన్ని కురిపించి, అపార్ధాలకు గురయ్యే దళిత యువకుడి పాత్రలో శోభన్ బాబును తప్ప మరొకరిని ఊహించుకోవటం కష్టం. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మలి చిత్రం గోరింటాకు. తర్వాత స్వయంవరం వంటి మెమరబుల్ మూవీస్ మరెన్నో వచ్చాయ్..
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ఆయన తండ్రి కె.ఎస్. ప్రకాశరావు ఇద్దరూ శోభన్ కాంబినేషన్ లో సూపర్ హిట్స్ తీశారు. ఇదాలోకం, కోడెనాగు, తాసీల్దారుగారి అమ్మాయి లాంటి సక్సస్ ఫుల్ మూవీస్ కె.ఎస్ ప్రకాశరావు తీశారు. ఇక రాఘవేంద్రరావైతే తన మొదటి సినిమానే శోభన్ తో చేశారు. బాబుతో గ్లామర్ హీరో శోభన్ ను మరింత గ్లామరస్ గా చూపించి సత్తా చాటారు. ఆ తర్వాత రాజా, మోసగాడు, దేవత, ఇద్దరు దొంగలు, అశ్వమేథం సినిమాలు తీశారు. దేవతతో అద్భుతమైన విజయం సాధించారు.
అక్కినేని పర్మినెంట్ బ్యానర్ జగపతి పిక్చర్స్ లో కూడా శోభన్ బాబు సూపర్ హిట్స్ కొట్టారు. శోభన్ తో తప్ప మరొకరితో చిత్రాలు నిర్మించని నిర్మాత చటర్జీ. సమత ఆర్ట్స్ బ్యానర్ మీద వచ్చిన సినిమాలన్నిట్లోనూ శోభన్ బాబే హీరో. జూదగాడు, జేబుదొంగ, జీవిత రథం లాంటి సినిమాలు చేసిన చటర్జీనే..శోభన్ తో మల్లెపూవు లాంటి క్లాసిక్ మూవీ కూడా తీయడం విశేషం.
శోభన్ బాబుతో అన్ని రకాల పాత్రలూ చేసి మెప్పించిన హీరోయిన్ శారద. శోభన్, శారదలది హిట్ పెయిర్ అనేవారు. కాంచన, చంద్రకళ, లక్ష్మీ లాంటి ఆనాటి గ్లామర్ హీరోయిన్స్ కు పర్ఫెక్ట్ జోడీ అనిపించుకున్నారు. ఇక ఆయనతో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ జయసుధ. సోగ్గాడుతో మొదలైన ఈ జోడీ.. కోడి రామకృష్ణ తీసిన ఆస్తి మూరెడు, ఆశబారెడు వరకూ కంటిన్యూ అయ్యింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మల్లెపూవు, మండే గుండెలు, ఇల్లాలు లాంటి సూపర్ హిట్స్ చాలానే ఉన్నాయి. తను నటించిన రెండువందల పైచిలుకు చిత్రాలు శోభన్ బాబుని సోగ్గాడుగానే చూపించాయి.
శోభన్ బాబు వర్ధమాన నటునిగా సాగుతున్న రోజుల్లో ఎన్టీఆర్, ఆయన తమ్ముడు త్రివిక్రమరావు ఆయనను ఆర్థికంగానూ ఆదుకున్నారు. అలాగే యన్టీఆర్ సతీమణి బసవతారకం సైతం శోభన్ ను ఆదరించారు. అందువల్లే బసవతారకంను అమ్మగా భావించేవారు శోభన్. ఆమె మరణించిన సమయంలో ‘ఈనాడు’ దినపత్రికలో శోభన్ ఓ ఫుల్ పేజీ యాడ్ ఇచ్చి అందులో భక్తిపూర్వకంగా ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు శోభన్. ఏది ఏమైనా అందాలనటుడు అన్న పేరు సార్థకం చేసుకున్న ఎన్టీఆర్ కు తగ్గ తమ్మునిగా శోభన్ నిలిచారు.
శోభన్ బాబు అంటే హీరోగా ఆడియన్స్ మనసుల్లో ముద్రపడింది. ఆ ముద్రను చెరిపేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ ముసలి ముఖంతో వాళ్లకు కనిపించడానికి ఇష్టపడను అని చివరి రోజుల్లో తనను కలిసిన మిత్రులతో చెప్పేవారు శోభన్. శోభన్ బాబు అన్న మాట అక్షరాలా నిజం. ఆయన ఎంతగా ఆడియన్స్ హృదయాల్లో ముద్ర వేశారంటే.. విజయవాడ, రాజమండ్రి లాంటి సినిమా రాజధానుల్లో ఆయనకు కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేశారు అభిమానులు.
క్రమశిక్షణ కలిగిన జీవితానికి ప్రతీకగా నిలిచిన శోభన్ బాబు అరవయ్యోపడిలో పడగానే స్వచ్చందంగా నటజీవితానికి స్వస్తిచెప్పి అభిమానుల హృదయాల్లో హీరో ఇమేజితోనే తెరమరుగయ్యారు. మంచి ఆరోగ్యంతో వుండే శోభన్ తన జీవితకాలంలో ఆసుపత్రికి వెళ్ళడం కానీ, ఇంజక్షన్ తీసుకోవడం కానీ చేయలేదు. అయితే అకస్మాత్తుగా శోభన్ చెన్నై లోని తన ఇంటిలోనే 2008 మార్చి 20 న మెట్లు దిగుతూ జారిపడి అకాల మరణాన్ని పొందారు.
శోభన్ బాబు తెలుగు ప్రేక్షకులకు ఒక మధుర జ్ఞాపకం. ఎక్కడ మొదలు పెట్టాలో.. ఎక్కడ ముగింపు పలకాలో చాలా కొద్ది మందికే స్పష్టత ఉంటుంది.ఆ స్పష్టత ఉన్న అతి కొద్ది మందిలో శోభన్ ఒకరు.ఎంత పరుగుపెట్టేవాడికైనా, ఏదో ఒక చోట అలసట కలుగక మానదు. పరువు ఉన్నప్పుడు పరుగు ఆపాలనీ అంటారు. పరుగు ఆపడమూ ఓ కళే అని శోభన్ బాబు నటజీవితాన్ని చూసి తెలుసుకోవాలి. చివరి దాకా ‘అందాలనటుడు’ అన్న పదం శోభన్ బాబుకు ఓ అలంకారంగా ఉండేది. ఆ ఇమేజ్ ను కాపాడుకుంటూనే ఆయన సాగారు.
--డి.వి.అరవింద్ ( మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







