కవిరాజు - త్రిపురనేని

- January 15, 2025 , by Maagulf
కవిరాజు - త్రిపురనేని

తెలుగు సాహిత్యంలో హేతువాద భావజాలం వేమన నుంచి బలంగా ప్రారంభమైంది. వేమన మార్గంలో హేతువాదాన్ని బలంగా తీసుకెళ్ళిన వాళ్ళు త్రిపురనేని రామస్వామి చౌదరి, తాపీ ధర్మారావు, మహాకవి గుర్రం జాషువా, శ్రీశ్రీ, ఆరుద్ర. కవిత్వం కేవలం కవిత్వం కోసం కాకుండా సమాజహితం కోసం, మానవాభ్యుదయం కోసం, మానవతా స్ఫూర్తి కోసం, సమసమాజ నిర్మాణం కోసం రాసిన హేతువాదులు తెలుగు సాహిత్యంలో బలంగా వున్నారు. కులమతాల ఉచ్చుల్లో చిక్కకుపోయిన సమాజాన్ని సంస్కరణ వాదం వైపు నడపటంలో త్రిపురనేని రామస్వామి చౌదరి కీలకపాత్ర పోషించారు. తన పేరులోని కులనామాన్ని త్యజించి మానవవాద విస్తరణకు, విద్యావ్యాప్తికి, గొప్ప సంస్కరణ వాదానికి పునాదులు వేశారు. నేడు కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి. 

త్రిపురనేని రామస్వామి చౌదరి 15 జనవరి 1887న ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్‌లోని అవిభక్త కృష్ణా జిల్లాలోని గుడివాడ తాలూకా అంగలూరు గ్రామానికి చెందిన రైతు చలమయ్య, రామమాంబ దంపతులకు జన్మించారు. 11 ఏళ్ల వయసులో పున్నమ్మ అనే బాలికతో 1898లో ఆయన వివాహం జరిగింది. చాలా ఆలస్యంగా 23వ ఏట మెట్రిక్యులేషన్‌ పాసయ్యారు. ఆ తర్వాత రచనలు చేయటం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన రాణా ప్రతాప్ జీవితంపై ఆయన రచన అచ్చు దశలో ఉండగా, నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆ పుస్తకాన్ని నిషేధించింది. 1910లో తన స్వగ్రామమైన అంగలూరు బడిలో హరిజన బాలికకు అడ్మిషన్ చేయించిన కారణంగా, సొంతకులం వారి ఆగ్రహానికి గురి అయ్యారు. 

1911లో బందరు నోబెల్ కాలేజీలో ఇంటర్ చదివారు. అక్కడ అధ్యాపకుడిగా ఉన్న చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి శిష్యరికం చేసి తన గొప్ప ధారణా శక్తిని, సాహిత్యం మీద సాధికారతను సాధించి మొదట అష్టావధానం, తర్వాత శతావధానం చేశారు. తర్వాత అవధానాన్ని పక్కనబెట్టి.. లా చదువు కోసం 1913లో బొంబాయి వెళ్లినా.. 1914లో ఐర్లాండ్‌లోని డబ్లిన్‌ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ న్యాయశాస్త్రం చదివారు. దానితో పాటు ఆంగ్ల సాహిత్యాన్నీ చదివారు.  

ఐర్లాండ్‌లో ఉన్నప్పుడూ రామస్వామి పంచె కట్టుతోనే గడిపేవారు. ‘ఏ దేశంలో ఉంటే ఆ దుస్తులే వేసుకోవాలిగానీ ఇదేమిటని’ అక్కడి ఓ బ్రిటీష్‌ మహిళ హేళన చేయగా.. ‘మీరు మాదేశం వస్తే చీర కట్టుకుంటారా?’ అని జవాబిచ్చారట. డబ్లిన్‌ నుంచి ఇక్కడి కృష్ణా పత్రికకు వ్యాసాలు రాసేవారు. ఆయన ప్రసిద్ధ రచన ‘శంభూక వధ’ డబ్లిన్‌లో ఉండగా రాసిందే! డబ్లిన్‌ నుంచి 1917లో తిరిగొచ్చాక.. నాలుగేళ్లు మచిలీపట్నంలో లాయరుగా ప్రాక్టీసు చేసి, 1922లో తెనాలికి మారి లాయరుగా అక్కడే స్థిరపడ్డారు. అక్కడే సామాజిక దురాచారాలను, మతమౌఢ్యాన్ని నిరసిస్తూ సంస్కరణవాదాన్ని జనంలోకి తీసుకుపోయారు.  

రాజా రామ్మోహన్‌ రాయ్, కందుకూరి, గురజాడ ఆదర్శాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేవారు. దీనికి గొప్ప జనామోదం రావటంతో 1925లో జస్టిస్ పార్టీ తరపున తెనాలి మునిసిపాలిటీ ఛైర్మన్ అయ్యారు. వెంటనే పట్టణంలో జంతుబలిని నిషేధిస్తూ తీర్మానం చేయగా, సభ్యుల్లో వ్యతిరేకత వచ్చి వారంతా ఆయనను పదవి నుంచి దించేశారు. కానీ..మరుసటి ఎన్నికల్లో ఆయన తిరిగి ఛైర్మన్‌గా ఎన్నికై 1939 వరకు సేవలందించారు.

 సూతాశ్రమం అనిపేరు పెట్టుకున్న ఆయన ఇల్లు రాజకీయ, సాహిత్య చర్చలతో కళకళలాడుతూ ఉండేది. అదే సమయంలో 1930లో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా ‘వీరగంధము తెచ్చినారము వీరులెవరో తెల్పుడు’ అనే గీతాన్ని రాసి తెలుగువారిని స్వాతంత్ర్య పోరాటంవైపు నడిపించారు. స్వాతంత్య్రం వచ్చే వరకు సమరయోధుడిగా ఆయన బ్రిటీష్‌ పాలకులపైకి తన జీవితాంతం అక్షర తూటాలను సంధిస్తూ వచ్చారు. 

సంస్కృతంలోని పెళ్ళి మంత్రాలను తెలుగులోకి అనువదించి, సులువైన తెలుగులో ‘వివాహ విధి’ అనే పద్ధతికి రూపకల్పన చేశారు. బ్రాహ్మణులతో పనిలేకుండా ఈయనే.. అనేక పెళ్లిళ్లకు పౌరోహిత్యం వహించారు. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడాడు. ఎన్నో కులాంతర వివాహాలు జరిపించారు. ఆ రోజుల్లోనే ఆంధ్రమహాసభ ‘కవిరాజు’ బిరుదునిచ్చి గౌరవించింది. మూడుసార్లు ఆంధ్రా యూనివర్సిటీ సెనేట్ సభ్యులుగానూ త్రిపురనేని పనిచేశారు. 1941లో ప్రఖ్యాత మానవవాది ఎం.ఎన్‌.రాయ్ తెనాలిలోని వీరి సూతాశ్రమాన్ని సందర్శించారు. 

బ్రాహ్మణవాద భావజాలం మీద ఆయన గొప్ప తిరుగుబాటు చేశారు. రావణుడు గొప్ప పండితుడు. గొప్పరాజు. ఆయన్ని చంపడం అనే కథకి ఒక పెద్ద గ్రంథం ఎందుకు రాయాల్సివచ్చింది అని ఆయన ప్రశ్నించాడు. కోయ, చెంచు మొదలైన జాతులు చింత తోపుల్లోనూ, చెట్టు పుట్టలలోనూ, అడవుల్లో జీవిస్తూ రాత్రులు బలంగా వుంటారు. తమ బిడ్డలను కాపాడుకునే రక్షకులుగా వుంటారు. అందుకే వీళ్ళను రాక్షసులు అన్నారు అని చెప్పారు. మూలవాసులకు వ్యతిరేకమైన నామవాచకాలు పెట్టి వారిని అన్ పాపులర్ చేయడానికి చూసింది బ్రాహ్మణ సమాజం. 

రామాయణంలో శంబుక వధను త్రిపురనేని రామస్వామి చౌదరి గారు గట్టిగా ప్రశ్నించారు. ఒక శూద్రుడు చదువుతుంటే రాముడు తలనరకడం ఏమిటి అనేది ఆయన ప్రశ్న. ఆయన పురోహితుల దోపిడిని కూడా నిలదీశారు. కవిరాజు ‘శంబుకవధ’ పురాణ సాహిత్యం మీద తిరుగుబాటు జెండాను ఎగురవేసింది. అవతార పురుషుల అఘాయిత్యాలను, దాడులను, హింసలను కవిరాజు నిర్భయముగా ఎత్తి చూపాడు. శంబుకుని చంపడం ఒక మహాత్కార్యంగా ఆర్ష సాహిత్యం వర్ణిస్తే శంబూకుని వధను ఒక హింసాకాండగా కవిరాజు వర్ణించారు. 

శంబుక వధ పీఠికలో అనార్యుల జీవన విధానాలను గురించి చాలా వివరాలిచ్చారు. అప్పటికీ పురాణాంశాలను చారిత్రకాన్వయాలతో పరిశీలించిన వారిలో ఆయన ప్రసిద్ధుడు. శంబుక వధ మీద బ్రాహ్మణ వాదులు తీవ్రమైన దాడులు చేశారు. నిందాభూయిష్టమైన విమర్శతో బ్రాహ్మణులు కవిరాజును అవమానించాలని చూశారు. కాని ఆయన అనార్యుల గురించి యిచ్చిన వివరణ వాస్తవాంశా సముచ్ఛయంగా ఉంది. మరీ ముఖ్యంగా ద్రావిడులను గూర్చి ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. 

గొప్ప గొప్ప ఋషులుగా పేరు పొందిన వాళ్ళకు ఎందుకు గోత్రాలు లేవు అని ప్రశ్నించారు. పుట్టుకను బట్టి బ్రాహ్మణత్వమే కాదు అని వాదించారు. బ్రాహ్మణత్వమే ఒక అభూత కల్పన అని నిలదీశారు. అయితే అందరం బ్రాహ్మణులం కావాలి లేకుంటే అందరం శూద్రులు కావాలని వాదించారు. అంతేకాదు మొత్తం జంధ్య ధారణకు ఉపక్రమించారు. గోత్ర నామాలన్నీ రూపకల్పన చేసినవే అని వ్యాఖ్యానించారు. అక్షరం అభ్యసించడానికి ఆంక్షలు ఎందుకు అని ప్రశ్నించారు. మానవతా ప్రబోధం కోసం తమ కులాన్ని కూడా అవసరం అయితే వదులుకుంటామని కొత్త ధర్మాన్ని కూడా తీసుకొచ్చారు. బ్రాహ్మణేతర పండితులు పదును గలిగినవారు. అప్పటివరకు పురాణాలు చూసిన కోణానికి భిన్నంగా చూశారు.

1920లో త్రిపురనేని రామస్వామి గారి మొదటి భార్య పున్నమ్మ చనిపోగా, చంద్రమతిని వివాహమాడిన త్రిపురనేని, రెండేళ్లకు ఆమె కూడా మరణించటంతో అన్నపూర్ణమ్మను వివాహమాడారు. వీరి కుమారుడు గోపీచంద్ కూడా సుప్రసిద్ధ రచయితగా పేరుపొందారు. సూతపురాణం, శంభూకవధతో సహా అనేక సుప్రసిద్ధ రచనలు చేసిన కవిరాజు.. 1946 జనవరి 16న కన్నుమూశారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1987లో కవిరాజు శత జయంతి సందర్భంగా పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఏటా కవిరాజు పేరిట ఏటా ఒక పురస్కారాన్ని అందిస్తోంది. కేవలం 56 ఏళ్లు మాత్రమే జీవించిన కవిరాజు త్రిపురనేని.. హేతువాదిగా, మానవవాదిగా తెలుగు సమాజం మీద తనదైన ముద్రను వేసి వెళ్లిపోయారు.

- డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com