పరిపాలనా దక్షురాలు - వి.ఎస్.రమాదేవి
- January 15, 2025
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా.. భారతదేశంలో ఎన్నికల నిర్వహణ బాధ్యత మొత్తం చూసుకునే ఈ రాజ్యాంగ సంస్థకు ఇప్పటివరకు ఒక్క మహిళకు మాత్రమే చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా పనిచేసే అవకాశం దక్కింది. అటువంటి అత్యున్నతమైన రాజ్యాంగ పదవి చేపట్టిన ఏకైక మహిళగా గుర్తింపు సాధించిన వి.ఎస్.రమాదేవి గారు మన తెలుగు వారు కావడం విశేషం. దేశం మొత్తం గర్వించదగ్గ అతి గొప్ప అడ్మినిస్ట్రేటర్‌గా నిలిచిన రమాదేవి గారి జయంతి నేడు.
వి.ఎస్.రమాదేవి గారి పూర్తి పేరు వడ్లపట్ల శ్రీ రమాదేవి. 1934, జనవరి 15న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు తాలూకా చేబ్రోలు గ్రామంలో వడ్లపట్ల వెంకట సుబ్బయ్య, వెంకట రత్నమ్మ దంపతులకు జన్మించారు. ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన ఆమె, హైదరాబాద్ ఉస్మానియా కళాశాలలో ఎమ్.ఎ, ఎల్.ఎల్.ఎమ్ పూర్తి చేశారు. ప్రముఖ చలనచిత్రాల పంపిణీదారు ఉషా పిక్చర్స్ అధినేత వి.వి. బాలకృష్ణారావు గారు వీరి సోదరుడు.
రమాదేవి గారు1959లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్ ఎ ఇండియన్ లీగల్ సర్వీసులో నియుక్తులై వివిధ హోదాలలో పనిచేశారు. లెజిస్లేటివ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, లా కమిషన్ మెంబర్ కార్యదర్శిగా, లెజిస్లేటివ్ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. అలాగే, వీరు కస్టమ్స్ ఎక్సైజు అప్పీళ్ల ట్రిబ్యునల్ సభ్యులుగా పనిచేశారు.
భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరుగా 1993, నవంబర్ 26 నుండి 1993, డిసెంబర్ 11 వరకు పనిచేశారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా పనిచేసిన ఇద్దరిలో ఆమె ఒకరు. ఆమె కంటే ముందు ఆర్వీఎస్ పేరి శాస్త్రి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా పనిచేశారు. 16 రోజులు మాత్రమే ఆ పదవిలో ఉన్నప్పటికీ భారతదేశ ఎన్నికల విధానం, వ్యవస్థకు సంబంధించి ప్రజలకు సమగ్ర సమాచారం అందాలన్న ప్రయత్నం చేశారు.
రమాదేవి గారు 1993లో రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌గా నియమితులైన తర్వాత సభను సజావుగా నడపడంలో చైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ లకు బాగా సహకరించారు. 1997లో ఆమె పదవి విరమణ పొందారు. ఈ పదవి చేపట్టినవారిలో తొలి మహిళగానూ రమాదేవి గారికి గుర్తింపు లభించింది. 1997లో అప్పటి భారత రాష్ట్రపతి, ప్రధాని ఐ.కె.గుజ్రాల్ గార్ల సహకారంతో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులయ్యారు. 1997-99 వరకు హిమాచల్ గవర్నర్‌గా రమాదేవి గారు ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ నడుచుకున్నారు. అన్ని పార్టీల నేతలు సైతం ఆమెను ఎంతో గౌరవించే వారు.
1999లో కేంద్రంలో వాజపేయ్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, ఆమె అభ్యర్థన మేరకు హిమాచల్ ప్రదేశ్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి బదిలీ చేయడం జరిగింది. కర్ణాటక గవర్నర్‌గా 1999, డిసెంబర్ 2 నుండి 2002, ఆగస్టు 20 వరకు పనిచేశారు. ఎన్నికల కమిషనర్‌గా, రాజ్యసభ సెక్రెటరీ జనరల్, గవర్నర్ వంటి కీలకమైన పదవులను అధిరోహించిన తెలుగు మహిళగా ఆమె చరిత్రలో నిలిచిపోయారు.
గవర్నర్ పదవి విరమణ తర్వాత న్యాయపరమైన అంశాల్లో అవగాహన పెంచేందుకు నిర్వహించిన సెమినార్లకు, వర్క్ షాపుకు, శిక్షణ తరగతులకు హాజరై న్యాయ వ్యవస్థతో ఉన్న తన అనుభవాలను పంచుకునేవారు. సమకాలీన రాజకీయ, న్యాయ వ్యవస్థల్లో వస్తున్న మార్పులను క్షుణ్ణంగా నిత్యం అధ్యయనం చేసేవారు. చైనా అకాడమీ ఆఫ్ సోషల్ సైన్స్స్ లోని లా కాలేజీ నుంచి ఇండియాలో పర్యటిస్తున్నప్పుడు వారికి ఇండియాలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, మానవ హక్కుల అమలులో అనుసరిస్తున్న విధానాల పట్ల అవగాహన కలిగించేందుకు మూడు వారాల పాటు దేశంలోని పలు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లతో సమావేశాలు ఏర్పాటు చేయించారు.
రమాదేవి గారు గొప్ప పరిపాలనా దక్షురాలిగానే కాకుండా, గొప్ప రచయిత కూడా. సుదీర్ఘ కాలం తెలుగు పత్రికలలో ఆమె అనేక కథలు, ధారావాహికలు రాశారు. తెలుగులో విపులాచపృథ్వీ, అనంతం, దేవుడికి ఉత్తరం, లేడీస్ కంపార్ట్మెంట్, తల్లీబిడ్డలు, మజిలీ వంటి పుస్తకాలు రాశారు. ఆమె ఎలక్షన్ కమిషన్, డీలిమిటేషన్ కమిషన్లకు న్యాయ సలహాదారుగా పనిచేసిన ఎస్కే మేందీరత్తాతో కలిసి ‘హౌ ఇండియా వోట్స్ - ఎలక్షన్ లాస్, ప్రాక్టీస్, ప్రొసీజర్స్’ పేరిట ఆంగ్లంలో పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకంలో రాష్ట్రాల శాసనసభలు, పార్లమెంటు, ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికలు ఎలా జరుగుతాయనేది క్షుణ్ణంగా వివరించారు. రమాదేవి గారి రచనలు సరళమైన భాషా శైలిలో ఉంటాయని, వందలాది వచన రచనలతో ఆమె సాహితీరంగంలో తానేమిటో ఎప్పటికప్పుడు నిరూపించుకున్నారని సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు.
పరిపాలనా రంగంలో రమాదేవి గారు చేసిన సేవలకు గానూ శ్రీకృష్ణదేవరాయ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలు డాక్టరేట్లతో ఆమెను సత్కరించాయి. ఇవే కాకుండా దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ హీ యూనివర్సిటీ సైతం ఆమెను తమ పీస్ ప్రైజ్ ను బహుకరించారు. అడ్మినిస్ట్రేషన్, సాహిత్య రంగంలో విశేషమైన కృషి చేసిన రమాదేవి గారు 2013, ఏప్రిల్ 17 న తన 79వ ఏట అనారోగ్యంతో బెంగుళూరులోని తన మనవరాలి ఇంట్లో మరణించారు.
- డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









