బహుజన రాజకీయ యశస్విని - మాయావతి
- January 15, 2025
మాయావతి.. భారతదేశ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. అవమానాలనే తన రాజకీయ ఎదుగుదలకు సోపానాలుగా మార్చుకున్న నాయకురాలు. వివక్షతో ఆమెను దరిచేరనీయని రాజకీయ నాయకులను సైతం తన కాళ్ళ దగ్గరకు తెప్పించుకున్నారు. భారతీయ సమాజంలో కుల నిర్మూలనకు వ్యతిరేకంగా బహుజన వాదాన్ని క్షేత్రస్థాయిలో పటిష్ట పరచిన ఘనత మాయావతి సొంతం. రాజ్యధికారంతోనే దళితుల అభ్యన్నతి అని నమ్మిన తన గురువు కాన్షిరాం ఆశయాన్ని నెరవేర్చి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు పర్యాయాలు పాలించారు. నేడు బహుజన రాజకీయ యశస్విని కుమారి మాయావతి జన్మదినం. ఈ సందర్భంగా ఆమె రాజకీయ ప్రస్థానం మీద ప్రత్యేక కథనం ...
మాయావతి పూర్తి పేరు కుమారి మాయావతి ప్రభు దాస్. 1956, జనవరి 15న ఢిల్లీలో జన్మించారు. ప్రభు దాస్, రామ్ రాఠీలు ఆమె తల్లిదండ్రులు. ఆమె బాల్యం, విద్యాభ్యాసం మొత్తం ఢిల్లీలోనే సాగింది. ఢిల్లీలోని కాళింది కళాశాలలో డిగ్రీ, ఘజియాబాద్‌లోని VMLG కళాశాలలో బిఈడి, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.బి పూర్తి చేశారు. ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యంతో సివిల్స్ కు సైతం ప్రిపేర్ అయ్యారు.
మాయావతి విద్యార్ధి దశ నుండే దళిత అభ్యున్నతి, సమాజంలో వివక్షకు గురవుతున్న దళిత సమాజాన్ని పైకి తీసుకురావాలని తపించేవారు. అందులో భాగంగానే విద్యార్ధి రాజకీయాల్లో సైతం క్రియాశీలకంగా పనిచేశారు. 1977లో జనతా పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దిల్లీ కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో దళిత సమాజాన్ని అవమానిస్తూ మాట్లాడిన నాటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజ్ నారాయణ్ ను అందరి ముందు కడిగిపారేశారు. ఆ ఒక్క ఉదంతంతో ఆమెకు ఢిల్లీ ప్రెస్ వర్గాల్లో గుర్తింపు లభించింది.
మాయావతి గురించి విన్న నాటి అఖిల భారత బడుగు, బలహీన మరియు మైనారిటీ వర్గాల ఉద్యోగుల సంఘం (BAMCEF) అధ్యక్షుడైన, దళిత నాయకుడు కాన్షిరాంతో ఆమెతో పరిచయం పెంచుకున్నారు. ఆమెలోని రాజకీయ చైతన్యం, దళిత సమాజం యొక్క సమస్యల పట్ల లోతైన అవగాహన వంటి విషయాలు ఆయన్ని ఆకర్షించాయి. రాజ్యాధికారం సాధనతోనే ద్వారానే బడుగు, బలహీన వర్గాల పట్ల వివక్ష తొలిగించవచ్చని ఆమెను ఒప్పించారు. కాన్షిరాం ప్రభావంతో సివిల్స్ ప్రిపరేషన్ ను పక్కన పెట్టి కాన్షిరాం రాజకీయ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు.
1984లో మాయావతి, కాన్షిరాం మరియు ఆయన ముఖ్యఅనుచరులైన సోనె లాల్ పటేల్, ఓం ప్రకాష్ రాజ్‌భర్, సంజయ్ నిషాద్ వంటి వారితో కలిసి బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించారు. తమ పార్టీ కార్యాకలాపాలకు వేదికగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం, దేశ రాజకీయాలను మలుపు తిప్పే రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంచుకున్నారు. మాయావతి మొదటిసారి బీఎస్పీ తరపున 1985లో బిజ్నోర్ నుంచి లోక్‌సభ ఉప ఎన్నికల్లో జగ్జీవన్ రాం కుమార్తె మీరా కుమార్ చేతిలో ఓడిపోయారు. కానీ, 1989లో ఆమె బిజ్నోర్ నుంచే గెలిచి మొదటిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఎంపీగా ఢిల్లీ రాజకీయాలను చక్కగా అవగాహన చేసుకున్నారు.
1991లో అదే నియోజకవర్గం నుంచి ఓటమి పాలైన తర్వాత పార్టీ బాధ్యతలకే పరిమితం అయ్యారు. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత కారణంగా కళ్యణ్ సింగ్ నేతృత్వంలోని యూపీ భాజపా సర్కార్ కూలడంతో 1993 ప్రారంభంలోనే జరిగిన ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు దిల్లీలోని అశోకా హోటల్‌లో కాన్షీరాం,
సమాజ్ వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. ఎన్నికల్లో ఎస్పీకి 109, బీఎస్పీకి 67 స్థానాలు లభించాయి. ఇద్దరూ కలిసి ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ అది పొత్తు ఎక్కువ రోజులు నడవలేదు. రెండు పార్టీల మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. ఇదే సమయంలో మాయావతి 1994లో రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు.
1995లో బీఎస్పీ ములాయం సింగ్ యాదవ్‌తో పొత్తు తెంచుకుని బీజేపీ అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సమయంలోనే స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఆమె సూట్‌పై సుమారు 200 మంది ములాయం మద్దతుదారులు దాడి చేశారు. గెస్ట్ హౌస్ ప్రధాన ద్వారం విరగ్గొట్టి లోపలికి వెళ్లారు. మాయావతి మద్దతుదారులను తీవ్రంగా కొట్టారు. మాయావతిని అనరాని మాటలు అన్నారు. మాయావతి తన గదిలో రాత్రి 1 గంట వరకూ అలాగే ఉండిపోయారు. వాళ్లు ఆ గదికి కరెంటు, నీళ్లు కూడా కట్ చేసేశారు. మాయావతి ఆ అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేకపోయారు. 1995 జూన్ 2న భాజపా మద్దతుతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర తోలి దళిత మహిళా సీఎంగా మాయావతి మొదటి సారి బాధ్యతలు చేపట్టారు.
1995 జూన్ 2 నుండి 1995 అక్టోబర్ 18 వరకు అంటే 137 రోజుల పాటు సీఎంగా సాగిన మాయావతి యూపీలోని నగరాలు, జిల్లాలు, యూనివర్సిటీల పేర్లు మార్చడం మొదలుపెట్టారు. ఆగ్రా విశ్వవిద్యాలయం పేరును భీంరావ్ అంబేడ్కర్, కాన్పూర్ పట్టణంలోని యూనివర్సిటీ పేరును ఛత్రపతి సాహూ మహరాజ్ విశ్వవిద్యాలయంగా మార్చారు. లక్నోలో అంబేద్కర్ పార్క్,పరివర్తన్ పార్క్ ఏర్పాటు చేసి అందులో ప్రముఖ దళిత మహా నేతల విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరుకున్నారు. అయితే, ఇవి రుచించని భాజపా రాష్ట్ర నేతలు తమ పార్టీ పెద్దలైన వాజపేయ్, అద్వానీల మీద ఒత్తిడి తెచ్చి మాయావతి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించారు. దీనితో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన మొదలైంది. 1996 లోక్‌సభ ఎన్నికల్లో మాయావతి అక్బర్‌పూర్, హరోలి లోక్ సభ స్థానాల నుంచి ఎన్నికైన ఆమె హరోలి వైపు మొగ్గు చూపారు.
1997లో జరిగిన యూపీ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థానాలు రాకపోవడంతో కమలనాథులు మళ్ళీ మాయావతి బీఎస్పీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రెండో సారి సీఎంగా మాయావతి 184 రోజులు పాలించిన తర్వాత భాజపా సీనియర్ నేత, మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ బీఎస్పీ ఎమ్యెల్యేలను తన వైపు తిప్పుకొని సీఎం పీఠం ఎక్కారు. భాజపా చేతిలో మాయావతికి జరిగిన రెండో అతిపెద్ద అవమానం. 1998లో అక్బర్‌పూర్ నుంచి మూడోసారి లోక్‌సభకు ఎన్నికై 1999లో వాజపేయ్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సంవత్సరంలోనే కూలిపోవడంలో ప్రత్యక్ష పాత్ర జయలలితాదే అయినా పరోక్షంగా మాత్రం మాయావతిది. ఈ విధంగా తనకు రెండు సార్లు సీఎం పీఠాన్ని దూరం చేసిన కమలనాథుల మీద పగ సాధించారు.
1999లో అక్బర్‌పూర్ నుంచి వరసగా మూడో సారి గెలిచి నాలుగోసారి లోక్ సభ ఎంపీగా ఎన్నికయ్యారు. 2001లో కాన్షిరాం తన రాజకీయ వారసురాలిగా మాయావతిని అధికారికంగా ప్రకటించారు. 2002 ఎన్నికల్లో ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా రాకపోవడంతో పాత అవమానాలను మర్చిపోయి తిరిగి భాజపాతో కలిసి మూడోసారి యూపీ సీఎంగా ఎన్నికయ్యారు. 2002-03 వరకు సీఎంగా ఉన్న ఆమె మరోసారి రాష్ట్రంలోని అతిపెద్ద అగ్రవర్ణ సామాజిక వర్గాలైన రాజ్ పూట్, బ్రాహ్మణలతో పాటు యాదవులతో పెట్టుకున్న వైరం కారణంగా దళితుల్లో ఆమె చరిష్మా పెరిగినా, తన సీఎం పీఠాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
2003లో కాన్షిరాం నుంచి బీఎస్పీ పార్టీ బాధ్యతలను చేపట్టిన మాయావతి, పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేయడానికి పూనుకున్నారు. 2004లో ఐదో సారి లోక్ సభకు ఎన్నికయ్యారు. అయితే, బీఎస్పీ పార్టీ యూపీలో బలహీనం కాకుండా ఉండేందుకు ఎంపీ పదవికి రాజీనామా చేసి యూపీ శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ, ముస్లిం, దళిత వర్గాల మద్దతుతో బీఎస్పీని అధికారంలోకి తెచ్చి నాలుగో సారి యూపీ సీఎం బాధ్యతలు చేపట్టారు. 2007-12 వరకు ఐదేళ్ల పాటు యూపీ సీఎంగా పనిచేసిన మాయావతి, 2012,2017,2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బిఎస్పీని గెలిపించలేకపోయారు. 2012-17 వరకు మాయావతి రాజ్యసభ ఎంపీగా కొనసాగారు.
మాయావతి యూపీ సీఎంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. సమర్థవంతమైన పాలను అందించడమే కాకుండా, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ స్ట్రిక్టుగా అమలు చేసిన సీఎంగా చరిత్రలో నిలిచిపోయారు. దళితులపై దాడులు చేసిన వారికి కఠినమైన శిక్షలను అమలు చేయడం ద్వారా దళిత సమాజానికి సంరక్షకురాలిగా మాయ నిలిచారు. దళితుల కోసం అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సైతం మాయాకే దక్కుతుంది. అగ్రవర్ణాల చేతిలో బలైపోయిన దళిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకున్నారు.
"భారత ప్రజాస్వామ్య చరిత్రలో అతిపెద్ద అద్భుతం మాయావతి" అని మాజీ ప్రధాని పి.వి వ్యాఖ్యానించారు. ఇందులో చాలా వాస్తవం ఉంది. అగ్రవర్ణ రాజకీయ నేతల కబంద హస్తాల నుంచి రాజ్యాధికారాన్ని అందుకొని తన పాలన ద్వారా యూపీ అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మాయావతి దేశ రాజకీయాల్లో అతిపెద్ద దళిత రాజకీయ నాయకురాలు. సమానత్వం, వివక్షరహిత సమాజం కోసం రాజకీయాల్లోకి వచ్చిన ఆమె వాటిని సాధించేందుకు తన ప్రయాణంలో ఎన్నో అవమానాలను, భౌతిక దాడులను, విమర్శలను ఎదుర్కొని అనుకున్నది చాలా మేరకు లక్ష్యాన్ని ఛేదించారు. అయితే, ఆమె పార్టీ నానాటికి దేశ రాజకీయాల్లో బలహీనం కావడం కూడా దళిత సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తుంది.
ఒక రాజకీయ నేత ఎన్నో ఎన్నికల్లో ఓడిపోయి ఉండచ్చు. అంతమాత్రాన ఆ వ్యక్తి చరిత్ర ముగిసిపోయిందని చెప్పడం చాలా ప్రమాదకరం. అలాంటి వారిలో చాలా మంది నేతలు, రాజకీయ పండితులు, ప్రజల అంచనాలను తలకిందులు చేస్తూ ఎవరూ ఊహించని స్థాయికి చేరడంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎప్పుడో సఫలం అయ్యారు. రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో తన పునర్వైభవాన్ని అందుకోవాలని మాయావతి మునుపెన్నడూ లేని విధంగా శ్రమిస్తున్నారు.
- డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి )
తాజా వార్తలు
- IPL-2026: సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









