ప్రింటింగ్ దిగ్గజం-ప్రగతి హనుమంతరావు

- January 16, 2025 , by Maagulf
ప్రింటింగ్ దిగ్గజం-ప్రగతి హనుమంతరావు

ప్రపంచంలోని కీలకమైన పరిశ్రమల్లో ప్రింటింగ్ ఇండస్ట్రీ ఒకటి.ఆదాయంపరంగా టాప్‌-5లో కొనసాగుతోంది. ఇందులో ఇండియా కూడా విశేషంగా రాణిస్తోంది.మన దేశంలో మొత్తం రెండున్నర లక్షల ప్రింటింగ్‌ కంపెనీలున్నాయి. వాటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రగతి ఆఫ్‌సెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తనదైన చెరిగిపోని ముద్ర వేసింది. అత్యుత్తమ నాణ్యతకు మారుపేరుగా నిలుస్తూ 6 దశాబ్దులుగా తిరుగులేని సేవలందిస్తోంది. ఆ సంస్థ వ్యవస్థాపకులు ప్రగతి హనుమంతరావు గారి జయంతి నేడు. 

ప్రగతి హనుమంతరావుగా సుపరిచితులైన పరుచూరి హనుమంతరావు 1921, జనవరి 16న ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్‌లోని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఘంటసాల తాలూకా చిట్టూర్పు గ్రామంలో దిగువ మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన నరసయ్య, శ్రీరామమ్మ దంపతులకు జన్మించారు. బందరు హిందూ ఉన్నత పాఠశాలలో మెట్రిక్‌ వరకు చదువుకున్న ఆయన మద్రాసు పచ్చయ్యప్ప కాలేజి నుంచి బి.ఏ పట్టా అందుకున్నారు. 

హనుమంతరావు చిన్నతనంలోనే తమ ప్రాంతానికి చెందిన వామపక్ష నేతలైన చండ్ర రాజేశ్వరరావు, ఆయన సోదరుడు రామలింగయ్య ప్రభావంతో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. నాటకాలు పట్ల ఉన్న మక్కువ ఆయన్ని ప్రజానాట్య మండలికి దగ్గర చేసింది. విద్యార్ధి దశలో వామపక్ష విద్యార్థి సమాఖ్యలో చురుకైన కార్యకర్తగా పనిచేశారు.ఇదే సమయంలో అరెస్ట్ అయ్యి కడలూరు జైల్లో వామపక్ష అగ్రనేతలైన ఎ.కె. గోపాలన్‌, మోటూరు హనుమంతరావు తదితర కమ్యూనిస్టు యోధులతో కలసి శిక్షను అనుభవించారు. 1947-48 వరకు సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు.   

ప్రజానాట్య మండలిలో ఉన్నప్పుడే రంగస్థల దిగ్గజం గరికపాటి రాజారావు, కోడూరి అచ్చయ్య వంటి దిగ్గజాలతో పనిచేశారు. మా భూమి నాటక రచయితలైన సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావుల పర్యవేక్షణలో ఉమ్మడి కృష్ణా జిల్లావ్యాప్తంగా ఆ నాటక ప్రదర్శనలో భాగమయ్యారు. ప్రజా నాట్య మండలి పెద్దల ప్రోద్బలంతో బొంబాయి వెళ్లి హిందీ, ఉర్దూ రంగస్థల దిగ్గజం బలరాజ్‌ సహానీ పర్యవేక్షణలో నటనలో తర్పీదు పొందారు.  

1948 నుంచి 1956 వరకు ఉమ్మడి కమ్యూనిస్టుపార్టీలో పార్టీ హోల్‌ టైమర్‌గా ఉంటూనే విశాలాంధ్ర దినపత్రిక మద్రాస్ విలేకరిగా కొంత కాలం పనిచేశారు. ఇదే సమయంలో హనుమంతరావు గారు 1952,1955 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ తరపున ప్రచారం చేసేందుకు కళాకారుడిగా మారారు. వామపక్ష పార్టీలో వస్తున్న మార్పులు చేర్పుల కారణంగా పార్టీ క్రియాశీలక కార్యకలాపాలకు దూరమయ్యారు. ఇదే సమయంలో మద్రాస్ సినీ పరిశ్రమలోకి ప్రవేశించి తాపీ చాణక్య, శ్రీశ్రీల ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. కాస్టింగ్ డైరెక్టర్‌, ప్రొడక్షన్ కంట్రోలర్‌ వంటి పలు బాధ్యతలు నిర్వహించారు. ముడిఫిల్ము కొరత సినిమా పరిశ్రమను సంక్షుభితం చేసిన దశలో ఆయన దృష్టి ముద్రణా రంగం వైపు మరలింది.

ప్రముఖ రచయిత ధనికొండ హనుమంతరావు గారి క్రాంతి ప్రింటింగ్ ప్రెస్‌లో కొంత కాలం పనిచేసిన హనుమంతరావు గారు 1962లో ప్రముఖ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి భాగస్వామ్యంతో "ప్రగతి ఆర్ట్ ప్రింటర్స్" స్థాపించి పాత యంత్రాలతో ప్రింటింగ్ పనులు మొదలు పెట్టారు. అయితే, కొద్దీ కాలానికే సీతాదేవి గారు తన భాగాన్ని ఆయనకి అమ్మేయడంతో ప్రగతి ప్రింటింగ్ ప్రెస్ అభివృద్ధికి బాటలు వేశారు. పుస్తకాలు అచ్చు వేయడం, వెడ్డింగ్ కార్డ్స్, సినిమా పోస్టర్స్ ఇలా అన్ని ఆర్డర్స్ తీసుకోని ఎక్కడా నాణ్యతా ప్రమాణాలతో రాజీ పడకుండా తగిన సమయానికి డెలివరీ చేసేవారు. ఆ తర్వాత రష్యాన్ సెకండ్‌ హాండ్‌ ఆఫ్‌సెట్‌ యంత్రం కొన్నారు. 

1970 చివర్లో ఆయన కుమారులు నరేంద్ర మహేంద్ర ప్రగతి సంస్థను సాంకేతికంగా అభివృద్ధి చేసి ప్రింటింగ్ రంగంలో తక్కువ ఖర్చుతోనే డిజైన్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. 1979లో వారు దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా ప్రగతిలోనే ఫోటో కంపోజింగు విధానాన్ని ప్రవేశపెట్టారు. అయిదు రంగుల ఆఫ్‌సెట్‌ ముద్రణా యంత్రం, కంప్యూటర్‌ కంట్రోల్స్‌తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ప్రగతిలోనే ప్రవేశించింది. 1996లో స్పాట్‌ యువి కోటింగ్స్‌ కూడా అలాగే ప్రథమ పర్యాయం ఇక్కడే మొదలైంది. ఇలా ప్రింటింగ్ రంగంలో వచ్చే ప్రతి సాంకేతిక ఆవిష్కారణ ఇండియాలో ప్రగతిలోనే కొలువుదీరుతుంది. 

12 వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన ప్రగతి సంస్థ ప్రస్థానం ఇవాళ 440 కోట్ల రూపాయల టర్నోవర్‌కి చేరుకోవటం గొప్ప విషయం. ప్రింటింగ్ రంగంలో ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను, విలువ కట్టలేని ప్రశంసలను పొందింది. 49 ఇంటర్నేషనల్‌ అవార్డులను, 69 నేషనల్‌ అవార్డులను సొంతం చేసుకుంది. తద్వారా వరల్డ్‌ ప్రింటింగ్‌ మ్యాప్‌లో ఇండియాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. హనుమంతరావు గారు సైతం 1992-93 గానూ భారత  జాతీయ ప్రింటింగ్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. 1997-98 మధ్య అఖిల భారత మాస్టర్ ప్రింటర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు.   

హనుమంతరావు గారు మొదటి నుంచి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1951 నాటి రాయలసీమ కరవు సమయంలో వ్యాధులు వ్యాపించగా పాతిక మందికి పైగా వైద్యులతో కలసి ప్రజలకు అమూల్యమైన సేవలందించారు. భాగ్యనగరంలోని సీఆర్‌.ఫౌండేషన్‌లో వృద్ధాశ్రమం, మహిళా సెంటర్‌, మెడికల్‌ సెంటర్‌ నిర్మాణంలో, వాటి అభివృద్ధికి నిర్వీరామంగా కృషి చేశారు. హైదరాబాద్ బాచుపల్లి కేంద్రంగా నడుస్తున్న విజ్ఞాన జ్యోతి విద్యాసంస్థల ఏర్పాటులో సైతం పాలుపంచుకున్నారు. 1996లో ప్రగతి పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు వైద్య సేవలను అందించేందుకు వీక్లి క్లినిక్స్ ప్రారంభించారు. ప్రగతి సంస్థనే తన చిరునామాగా మార్చుకున్న హనుమంతరావు అనారోగ్యంతో బాధపడుతూ 2015, మార్చి 2న కన్నుమూశారు. 

 --డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com