రాజకీయ విలువల వైతాళికుడు-జైపాల్ రెడ్డి
- January 16, 2025
భారత రాజకీయాల్లో అధ్యయనం, అవగాహన, వాక్పటిమల మేళవింపుగా రాణించిన అరుదైన రాజకీయవేత్త జైపాల్ రెడ్డి. గాంధేయవాద పరంపరకు, సోషలిస్ట్ భావజాలానికి ఆయన దాదాపు చివరి ప్రతినిధి. సాహిత్యాన్ని, తత్వశాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేసి ఆ పునాదుల మీద రాజకీయవాదాన్ని నిర్మించుకున్న రాజకీయ నాయకుడు ఆయన. ఆరిస్టాటిల్ నుంచి మార్క్స్ దాకా ఆయన దేని గురించైనా అనర్గళంగా మాట్లాడేవారు. తాను కట్టుబడిన సిద్దాంతం కోసం ఏనాడూ వెనకడగు వేయలేదు. ఆనాడు ఇందిరాను ఎదిరించినా, ఆ తర్వాత సోనియాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పించినా అంతా జైపాల్ రాజకీయ చాతుర్యమే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అయన పోషించిన పాత్ర అసమానమైనది. రాజకీయ జీవితంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా జాతీయవాదిగానే చివరి శ్వాస వరకు కొనసాగారు. నేడు రాజకీయ విలువల వైతాళికుడు జైపాల్ రెడ్డి గారి జయంతి.
జైపాల్ రెడ్డి పూర్తి పేరు సూదిని జైపాల్ రెడ్డి. 1942, జనవరి 16న నాటి నైజాం రాష్ట్రంలో భాగమైన మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల్ గ్రామంలో సంపన్న రైతాంగ కుటుంబానికి చెందిన సూదిని దుర్గారెడ్డి, యశోదమ్మ దంపతులకు జన్మించారు. 18 నెలల వయసులో ఉండగానే పోలియో కారణంగా వైకల్యానికి గురయ్యారు. కానీ, అది ఆయన రాజకీయ జీవన ఆరోహణకు ఎన్నడూ అవరోధం కాలేకపోయింది. ఇప్పటి నల్గొండ జిల్లా దేవరకొండలో ప్రాథమిక విద్యాభ్యాసం సాగించిన ఆయన అనంతరం భాగ్యనగరానికి చేరుకొని అక్కడే ఇంటర్ చదివారు. నిజాం కళాశాలలో బిఏ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ ఇంగ్లీష్ అండ్ జర్నలిజంను పూర్తి చేశారు.
జైపాల్ రెడ్డి విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేవారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో యువజన కాంగ్రెస్ విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. యూనివర్సిటీలో ఆయనకు ప్రత్యర్థిగా ప్రముఖ పాత్రికేయులు, విశాలాంధ్ర మాజీ సంపాదకులు చక్రవర్తుల రాఘవాచారి గారు వామపక్ష విద్యార్ధి సంఘానికి నేతృత్వం వహించారు. రాజకీయాల్లో వీరు ప్రత్యర్థులుగా ఉన్నప్పటికి వ్యక్తిగతంగా మాత్రం పరస్పర గౌరవ భావంతో మెలుగుతూ వచ్చారు.
యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న సమయంలో అప్పటి కాంగ్రెస్ దిగ్గజం దేవులపల్లి రామానుజరావు గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా ఉండేవారు. ఆయన జైపాల్ రెడ్డిని ఎంతో ప్రోత్సహించేవారు. ఆయన సిఫారస్సుతో 1969 ఉప ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ టిక్కెట్ మీద పోటీ చేసి విజయం సాధించారు. 1972లో సైతం అదే నియోజకవర్గం నుంచి రెండో సారి ఎన్నికై అసెంబ్లీలో కాంగ్రెస్ విప్‌గా పనిచేశారు. 1975లో ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఆమెకు వ్యతిరేకంగా గళమెత్తిన మొదటి తెలుగు నాయకుడు జైపాల్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం పతన దశకు చేరుకున్నదని జైపాల్ రెడ్డి బహిరంగంగా నిరసించారు. 1977లో జనతా పార్టీలో చేరిన ఆయన తర్వాత జరిగిన 1978,1983 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి జనతా పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు.1980లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇందిరాగాంధీ చేతిలో ఓటమిపాలయ్యారు. 1977-85 వరకు జనతా పార్టీ పక్ష నేతగా అసెంబ్లీలో తన సహచర నాయకుడు వెంకయ్య నాయుడుతో కలిసి కాంగ్రెస్, తెదేపా ప్రభుత్వాలపై రాజీలేని పోరాటం చేశారు. 1984లో ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్‌కు అండగా నిలిచిన ప్రతిపక్ష సభ్యుల్లో ఆయన ఒకరు.
1984 ఎన్నికల్లో జనతా పార్టీ తరపున మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 1985 నుంచి 1988 వరకు జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1988లో జనతాదళ్ ఏర్పాటులో భాగంగా జనతాపార్టీ, లోక్ దళ్ వంటి చీలిక పార్టీలన్ని కలవడంతో ఆయన ఆ పార్టీలో సభ్యుడయ్యారు. 1990-98 వరకు జనతాదళ్ తరపున రెండు పర్యాయాలు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన, జనతాదళ్ జాతీయ అధికార ప్రతినిధిగా సైతం పనిచేశారు. 1991-92 వరకు రాజ్యసభ విపక్ష నేతగా పనిచేశారు. యునైటెడ్ ఫ్రంట్ కామన్ మినిమం ప్రోగ్రామ్ ఆయనే రూపొందించారు.
1998లో జనతాదళ్ పార్టీలో చీలికలు ఏర్పడిన తరవాత జనతాదళ్(సెక్యులర్) పార్టీలో కొనసాగారు. 1998లో ఆ పార్టీ నుంచి రెండోసారి మహబూబ్ నగర్ ఎంపీగా ఎన్నికయ్యారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం కూడా అందుకున్నారు. 1999 ప్రారంభంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన, ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలో మిర్యాలగూడ లోక్‌సభ స్థానం నుంచి మూడో సారి ఎంపీగా ఎన్నికయ్యారు.1999 -2000 వరకు సభాహక్కుల ఉల్లంఘన కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. 2004లో మిర్యాలగూడ నుంచి నాలుగోసారి, 2009లో చేవెళ్ల నుంచి ఐదో సారి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు.
జైపాల్ రెడ్డి పలుమార్లు కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. 1997లో ఐకే గుజ్రాల్ నేతృత్వంలో ఏర్పడ్డ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ 1,2 ప్రభుత్వాల్లో సమాచార ప్రసార శాఖ, సాంస్కృతిక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ, పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా పనిచేశారు.
జైపాల్ రెడ్డికి పాలమూరు జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉంది. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన పాలమూరు అభివృద్ధికి ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా ఆయన కృషి చేశారు. పుట్టిన ఊరు మాడ్గుల తాగునీరు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కోయిల్ సాగర్ నుంచి మహబూబ్‌నగర్‌కు తాగునీరు రప్పించడంలో కీలక భూమిక పోషించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో విద్యుత్ సమస్య పరిష్కారం చెప్పుకోదగింది.
తెలంగాణ కోసం ఉద్యమకారులు చేపట్టిన ఆందోళనలు, ఉద్యమ నేతలు చేసిన పోరాటాలు ఒక ఎత్తయితే.. తెర వెనుక ఉండి తెలంగాణ కోసం పావులు కదిపిన ఘనత జైపాల్ రెడ్డిది. తెలంగాణ అంటే ఒంటికాలిపై లేచే సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ వంటి నేతలను ఒప్పించడానికి జైపాల్ అసమాన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించారని అంటుంటారు ఆయన సన్నిహితులు. ఓ దశలో ఆయన స్వపక్షంలో విపక్షంలా మారారు. ఈ క్రమంలో సొంత పార్టీ నేతలు శతృవుల్లా చూస్తున్నా పట్టించుకోలేదు. ఉక్కు మహిళగా పేరున్న సోనియాగాంధీని ఒప్పించగలిగారు. ట్రబుల్ షూటర్‌గా పేరున్న ప్రణబ్ ముఖర్జీని ఢీ కొట్టారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో ఆయన ప్రణబ్ ముఖర్జీ వంటి కీలక నేతలతో చాలా సందర్భాల్లో వాదులాటకు దిగారు.
తెలంగాణ ఉద్యమం చివరి అయిదేళ్ల కాలంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. తన సొంత రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను గ్రహించారు. ప్రజల కంటే పార్టీ గొప్పది కాదని గుర్తించారు. విద్యార్థుల ఆత్మహత్యలతో అట్టుడుకుతున్న పరిస్థితుల్లో తెలంగాణ సాధన ఒక్కటే ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చుతుందని భావించారు. క్రమంగా- తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు అధిష్ఠానానికి వివరించే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో జైపాల్ రెడ్డి.. తన తోటి లోక్‌సభ సభ్యుల సహకారాన్ని తీసుకున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఇవ్వాలి? దాని వల్ల పార్టీకి కలిగే ప్రయోజనాలేంటీ? అని కాంగ్రెస్ లెక్కలు వేసుకుందే గానీ.. ప్రజల మనోభావాలను గౌరవించలేదు. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పెద్దలను ఒప్పించడానికి జైపాల్ రెడ్డి అసామాన్య పోరాటాన్ని చూపారు. సొంత పార్టీలోనే విపక్షంలా మారారు. ప్రత్యేకించి- ప్రణబ్ ముఖర్జీని ఒప్పించడం జైపాల్ రెడ్డి చూపిన తెగువకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ఇన్ఛార్జిగా దిగ్విజయ్ సింగ్‌ను రప్పించడం వెనుక జైపాల్ రెడ్డి కృషి చాలా ఉంది. అప్పటికే- మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంలో కీలక పాత్ర పోషించారు దిగ్విజయ్ సింగ్. అలాంటి అనుభవం ఉన్న నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించడం వెనుక జైపాల్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన తరువాతే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఊపందుకున్న విషయం తెలిసిందే.
తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించాలంటూ స్వరాష్ట్ర కాంగ్రెస్ నేతల నుంచి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ.. జైపాల్ రెడ్డి అంగీకరించలేదు. దీనికి కారణం.. జాతీయ నేతగా ఆయనకు గుర్తింపు ఉండటమే. తెలంగాణ కోసం పార్టీలో అంతర్గతంగా జైపాల్ రెడ్డి సాగిస్తున్న పోరాటాన్ని దగ్గరుండి చూసిన నాయకులు.. ఉద్యమానికి సారథ్యం వహించాలని సూచించినప్పటికీ ఆయన అంగీకరించలేదు. ఈ ఉద్యమాన్ని అడ్డుగా పెట్టుకుని ప్రత్యర్థులు జాతీయ నేతగా ఉన్న తనను ప్రాంతీయ భావాలు ఉన్న నాయకుడిగా చిత్రీకరిస్తారనే ఆవేదన ఉండేదని సన్నిహితులు తెలిపారు. ఈ ఒక్క కారణంతోనే ఆయన తెలంగాణ ఉద్యమానికి పార్టీ తరఫున సారథ్యం వహించలేకపోయారని అన్నారు.
జైపాల్ రెడ్డి గారిని రాజకీయ తత్వవేత్త లేదంటే తాత్విక రాజకీయవేత్తగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు. పార్లమెంటులో ఆయన చేసిన ప్రసంగాలు గమనిస్తే, ఆయన ఏ అంశాన్నీ ఉపరితలంగా, ఆరోపణలే ప్రధానంగా చేసుకుని మాట్లాడరని తెలిసిపోతుంది. ప్రతి సమస్యకున్న తాత్విక పునాదులను అర్థం చేసుకుని లోతైన అవగాహనతో మాట్లాడడం ఆయన నైజం. అందుకే, ఆయన స్వరం వినిపిస్తే పార్లమెంటు నిశ్శబ్దంగా చెవులు రిక్కించేంది. లౌకిక స్ఫూర్తికి ఆయన నిఖార్సయిన నిదర్శనం.
జైపాల్ రెడ్డి మంచి వక్త. అపారమైన మేధస్సుతో పాటు అందరినీ ఆకట్టుకునే విశ్లేషణలు ఆయన సొంతం. తెలుగు, ఆంగ్ల భాషల్లో ఆయనుకున్న ప్రావీణ్యం అమోఘమైంది. వారి వ్యక్తిత్వం, ప్రజా సమస్యలను చూసే కోణం, మాట్లాడే విధానం ఆయనకు భారతదేశ రాజకీయాల్లో ఎందరో అభిమానులను, మిత్రులను సంపాదించి పెట్టింది. మనదేశ పార్లమెంటరీ రాజకీయాలపై జైపాల్ రెడ్డి చెరగని ముద్ర వేశారు. విలువలతో కూడిన రాజకీయాలను చేశారు. రాజకీయాల్లో నైతిక విలువల కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప నేతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన రచించిన "Ten Ideologies: The Great Asymmetry Between Agrarianism and Industrialism" సమకాలీన రాజకీయ భావజాలాలపై ఆయనకున్న పట్టును తెలుపుతుంది.
సుమారు 6 దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగిన జైపాల్ రెడ్డి గారు చిన్నతనంలోనే పోలియో బారిన పడ్డా, మొక్కవోని దీక్షతో, కృషి క్రమశిక్షణతో పనిచేసి దేశ రాజకీయాల్లో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. 2019,జూలై 28న అనారోగ్యం కారణంగా తన 77వ ఏట కన్నుమూశారు. సవాళ్ళకే సవాలుగా నిలిచిన వ్యక్తి జైపాల్ రెడ్డి. సవాళ్ళను సమర్థంగా ఎదుర్కొంటూ జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే దానికి ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితమే నిదర్శనం.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







