ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల హామీల వర్షం

- January 18, 2025 , by Maagulf
ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల హామీల వర్షం

న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తికావడంతో పార్టీల అభ్యర్థులు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్తూ ప్రచార పర్వంలో వేగం పెంచారు. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 981 మంది అభ్యర్థులు 1,521 నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల ఫిబ్రవరి 5న ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే, ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు మహిళా ఓటర్లను టార్గెట్ చేశాయి. ఈ క్రమంలో వారిని ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి.

ఢిల్లీలో మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలుసైతం అధికారమే లక్ష్యంగా వ్యూహాలను అమలు చేస్తున్నాయి.ఈ ఎన్నికల్లో విజయం సాధించాలంటే మహిళా ఓటర్ల పాత్ర కీలకమని మూడు ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఢిల్లీలో నమోదైన ఓటర్లలో 46శాతం అంటే సుమారు 71లక్షల మంది మహిళా ఓటర్లే ఉన్నారు. అయితే, ప్రస్తుతం ఎన్నికల సంఘం పేర్కొన్న వివరాల ప్రకారం.. సగానికిపైగా మహిళా ఓటర్లే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల బరిలో నిలిచిన మూడు ప్రధాన పార్టీలు మహిళా ఓటర్లే టార్గెట్ గా హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మహిళలకు నెలకు రూ.2,100 అందజేస్తామని ప్రకటించగా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మరో అడుగు ముందుకేసి రూ.2,500 ఇస్తామని ప్రకటించాయి. గర్భిణీలకు ఆర్థి సహాయం, ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఇలా అనేక హామీలను ఇచ్చాయి.

బీజేపీ మేనిఫెస్టో..

  • ఢిల్లీలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న బీజేపీ.. మహిళలు, పేద వర్గాల ప్రజలపై హామీ వర్షం కురిపించింది.
  • మహిళా సమృద్ధి యోజన కింద మహిళలకు నెలకు రూ. 2,500.
  • గర్భిణులకు రూ.21వేల ఆర్థిక సాయం, ఆరు పౌష్టికాహార కిట్లు. ప్రస్తుతం ఇస్తున్న మొదటి సంతానం సమయంలో రూ.5వేలు, రెండో సంతానం సమయంలో రూ.6వేలకు ఇవి అదనం.
  • పేద కుటుంబాలకు రూ.500 కే వంట గ్యాస్ సిలిండర్. హోలీ, దీపావళి పండుగుల సమయంలో ఒకటి ఉచితం.
  • అటల్ క్యాంటీన్ల ఏర్పాటు చేసి రూ.5కే భోజనం.
  • 60 నుంచి 70ఏళ్ల వయోధికులకు రూ.2,500. 70ఏళ్లు పైబడిన వారికి రూ.3వేలు.

ఆమ్ ఆద్మీ పార్టీ హామీలు..

  • ఆప్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రస్తుతం మహిళలకు నెలకు వెయ్యి సహాయం అందిస్తుండగా.. దానిని రూ.2,100 పెంచుతామని పేర్కొంది.
  • వృద్ధులందరికీ ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చింది.
  • దేవాలయాల్లో పూజారులకు నెలకు రూ.18వేలు.
  • దళిత వర్గాల విద్యార్థులకు అంబేద్కర్ స్కాలర్ షిప్ లు.
  • విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణాలు, అదనంగా విద్యార్థినీలందరికీ మెట్రో ఛార్జీలపై 50శాతం తగ్గింపు సౌకర్యం కల్పిస్తామని ఆప్ పేర్కొంది.
  • ప్రస్తుతం ఆప్ ప్రభుత్వం ఢిల్లీలో అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తుంది.

కాంగ్రెస్ హామీలు..

  • మహిళలకు ప్రతీనెలా రూ. 2,500.
  • రూ. 500లకే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్.
  • 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం.
  • ఉచిత రేషన్ కిట్లు ద్వారా బియ్యం, పంచదార, వంట నూనెలు, తదితర వస్తువులను అందిస్తామని కాంగ్రెస్ చెప్పింది.
  • యువ ఉడాన్ యోజన కింద ఏడాదిపాటు నిరుద్యోగ యువతకు ప్రతినెలా రూ.8,500.
  • ప్యారీ దీదీ యోజన కింద మహిళలకు ప్రతినెలా రూ.2,500ఆర్థిక సాయం.
  • జీవన్ రక్ష యోజన కింద రూ.25లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా.

ఉచితాలతో భారతదేశంలోని పలు రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ఢిల్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు ప్రజలపై.. ముఖ్యంగా మహిళలపై హామీ వర్షం కురిపిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com