బ్యాంకులు ఎప్పటికప్పుడు తమ భద్రతా ఏర్పాట్లను సమీక్షించుకోవాలి: సీపీ సుధీర్ బాబు

- January 18, 2025 , by Maagulf
బ్యాంకులు ఎప్పటికప్పుడు తమ భద్రతా ఏర్పాట్లను సమీక్షించుకోవాలి: సీపీ సుధీర్ బాబు

హైదరాబాద్: రాయపర్తి, బీదర్ మరియు మంగళూరులో ఇటీవల జరిగిన బ్యాంక్ దోపిడీ సంఘటనల నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో ముందస్తు నేరనివారణ చర్యలలో భాగంగా బ్యాంకులకు తగిన విధంగా భద్రత కల్పించడానికి మరియు బ్యాంకుల పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడానికి బ్యాంకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు భద్రతాపరమైన ఏర్పాట్ల గురించి ఈరోజు నేరేడ్మెట్ లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో సిపి సుధీర్ బాబు రాచకొండ పరిధిలోని అన్ని రకాల బ్యాంకుల ప్రధాన అధికారులు మరియు ఇతర సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ...బ్యాంకింగ్ రంగం అనేది సొసైటీ మనుగడకు  మరియు పలు రకాల వ్యాపార వాణిజ్య కార్యకలాపాల గమనానికి మూలస్తంభం వంటిదని పేర్కొన్నారు. ప్రజలు తమ కష్టార్జితాన్ని ఎంతో నమ్మకంతో బ్యాంకులో దాచుకుంటారని మరియు వ్యాపార వాణిజ్య కార్యకలాపాల ద్వారా తమ ఎదుగుదల కోసం బ్యాంకులపైనే ఆధారపడతారని తెలిపారు.అటువంటి బ్యాంకులకు తమ వంతు బాధ్యతగా తగిన రక్షణ కల్పించడానికి పోలీసుశాఖ చేస్తున్న దైనందిన పెట్రోలింగ్ గస్తీ విధులలో భాగంగా బ్యాంకుల పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడం జరుగుతోందని పేర్కొన్నారు. 

అయితే రాయపర్తి, బీదర్ మరియు మంగళూరులో ఇటీవల జరిగిన బ్యాంక్ దోపిడీ సంఘటనలు బ్యాంకుల భద్రత యొక్క బలహీనతలను బయటపెట్టాయని, పోలీసు శాఖ ఎన్ని భద్రతాపరమైన చర్యలు చేపడుతున్నప్పటికీ, తమవంతుగా గస్తీ విధులు నిర్వహిస్తున్నప్పటికీ బ్యాంకులు పాటిస్తున్న పాతకాలపు లోపభూయిష్టమైన భద్రతాపరమైన ఏర్పాట్లు మరియు అజాగ్రత్త చర్యల మూలంగా కొన్ని బ్యాంకు దోపిడీల వంటి నేరాలు పునరావృతం అవుతున్నాయని కమిషనర్ తెలిపారు. ఇటీవలి ఘటనల నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని 489 బ్యాంకులను తమ అధికారులు సందర్శించి భద్రతా చర్యలను సమీక్షించినట్టు పేర్కొన్నారు. నాణ్యత లేని బ్యాంకు భవనాలు, బలహీనమైన భద్రతా ఏర్పాట్లు మరియు లాకింగ్ వ్యవస్థ, సెక్యూరిటీ గార్డులు అప్రమత్తంగా లేకపోవడం లేదా అసలు నియమించుకోకపోవడం, పాత కాలం నాటి అలారం వ్యవస్థ, సీసీటీవీలు లేకపోవడం, డేటా ఫుటేజ్ సింగిల్ బ్యాకప్ మాత్రమే ఉండడం వంటి లోపాలు కలిగిన  బ్యాంకులను గుర్తించి, తీసుకోవలసిన చర్యలను కమిషనర్ బ్యాంకుల ప్రతినిధుల దృష్టికి తెచ్చారు. 

 ఈ సందర్భంగా కమిషనర్ బ్యాంకుల ప్రతినిధులకు భద్రతా పరమైన మౌలిక సదుపాయాల గురించి పలు విలువైన సూచనలు చేశారు.బ్యాంకు ప్రాంగణంలో అవసరమైన అన్నిచోట్ల సీసీటీవీ కెమెరాలను అమర్చుకోవాలని, దొంగతనాల వంటి నేరాల నివారణకు సీసీటీవీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడటమే కాక బ్యాంకు దోపిడీల వంటి తీవ్రమైన నేరాల పరిశోధనలో సీసీటీవీ ఫుటేజ్ అతి ముఖ్యమైన సాక్ష్యంగా నిలుస్తుందని పేర్కొన్నారు. బ్యాంకు ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్లు, క్యాష్ కౌంటర్లు మరియు స్ట్రాంగ్ రూమ్‌లతో సహా అన్ని ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేసేలా 24/7 పనిచేసే సీసీటీవీ కెమెరాలు అమర్చాలని, ఫుటేజ్ క్లౌడ్ నిల్వ (ప్రత్యామ్నాయ నిల్వ) ఉండేలా చూసుకోవాలని మరియు బ్యాటరీతో పనిచేసే స్టోరేజ్‌ కలిగిన రహస్య కెమెరాలను అమర్చాలని సూచించారు. తెలంగాణ ప్రజా భద్రతా చట్టంలో నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ట్రెజరీ యొక్క సాంకేతిక భద్రత RBI సూచించిన కనీస ప్రమాణాల కంటే తక్కువగా ఉండకూడదని పేర్కొన్నారు. అక్రమ చొరబాట్లు నిరోధించడానికి కిటికీలకు గ్రిల్స్ ఉండాలని, వాహన దాడులను నిరోధించడానికి కంచెలు, గేట్లు, బొల్లార్డ్‌లు మరియు వాహన బారికేడ్‌ల వంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనధికారిక యాక్సెస్ నిరోధించడానికి ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, నూతన భద్రతాపరమైన పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. తమ బ్యాంకులను సైబర్ నేరగాళ్ళ నుంచి రక్షించుకోవడానికి తమ సాఫ్ట్వేర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలని అంతేకాకుండా  సూచించారు. ఏటీఎంలలో డబ్బు నింపే వాహనాలకు రక్షణగా నిర్దేశిత నియమాలకు అనుగుణంగా శిక్షితులైన సిబ్బందిని కాపలాగా పంపాలని ప్రత్యేకంగా సూచించారు.

బ్యాంకుల భద్రత కోసం పోలీసు వారి సూచనలను తప్పనిసరిగా పాటించాలని, అవాంచిత సంఘటనలు తమ దృష్టికి రాగానే తక్షణమే పోలీసు వారికి సమాచారం అందించాలని బ్యాంకుల ప్రతినిధులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో డిసిపి యాదాద్రి రాజేష్ చంద్ర, డిసిపి ఎల్బీనగర్ ప్రవీణ్ కుమార్, డిసిపి మల్కాజ్గిరి పద్మజ, డిసిపి క్రైమ్ అరవింద్ బాబు, డిసిపి మహేశ్వరం సునీత రెడ్డి, డీసీపీ ఎస్ఓటి 1 రమణా రెడ్డి, డిసిపి ఎస్ఓటి 2 మురళీధర్, ఏసీపీ ఐటీ సెల్ నరేందర్ గౌడ్, ఏసీపీ సీసీఆర్బి రమేష్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com