జాతీయ విపత్తు ప్రతిస్పందనా దినోత్సవం
- January 19, 2025
విపత్తు అనేది ఆకస్మిక, విపత్కర సంఘటన. ఇది మానవాళి, సమాజంపై తీవ్రంగా ప్రభావం చూపి మానవ, భౌతిక ఆర్థిక, పర్యావరణ నష్టాలను కలిగిస్తుంది. ప్రకృతి వరదలు, భూకంపాలు, సునామీ, తుఫానులు, అగ్నిపర్వత విస్ఫోటనం మొదలైన వాటి వల్ల విపత్తు సంభవిస్తుంది. దీనికి అదనంగా తరచుగా మానవ ప్రభావిత విపత్తులయిన సాంకేతిక, పారిశ్రామిక ప్రమాదాలు, ఉగ్రవాదం వంటి కారకాల వల్ల సంభవిస్తుంది. విపత్తులను నియంత్రించడానికి, విపత్తు ప్రమాదాన్ని తగ్గించుటకే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనే ప్రత్యేక దళం ఏర్పాటైంది. అలా ఏర్పడిన ఈ సంస్థ 2006 జనవరి 19వ తేదీన ఆమోదం పొందింది. ఈ సంవత్సరం జనవరి 19న జరుపుకునే ‘జాతీయ విపత్తు ప్రతిస్పందనా దినోత్సవం’ సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.
సహజంగా గానీ.. మానవ తప్పిదాల వల్లకానీ.. ఎదురయ్యే విపత్తులకు ప్రతిస్పందించి సహాయ సహకారాలు అందించటం ఈ దళం పని. ఎన్‌డిఆర్‌ఎఫ్ ఏర్పాటుకు 2005లో రూపకల్పన చేసినప్పటికీ 2007లో అది ఆచరణలోకి వచ్చింది. ఎన్‌డిఆర్‌ఎఫ్ దళం అంకితభావంతో, నిబద్ధతతో వ్యవహరించడానికి.. నిరంతరం శక్తిమంతం చేసుకునే క్రమంలో ‘ఆపదా సేవా సదైవ సర్వత్ర’ అనే నినాదంతో పయనిస్తుంది. అంటే ‘విపత్తు జరిగిన ప్రతిచోటా నిరంతర సేవ’ అని అర్థం. విపత్తు నిర్వహణా సమయంలోని ప్రణాళికలు, వ్యూహాలు, మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు సమిష్టిగా బలోపేతం చేసుకుంటుంది.
2030 నాటికి, ప్రస్తుత వాతావరణ అంచనాలతో ప్రపంచం సంవత్సరానికి దాదాపు 560 విపత్తులను ఎదుర్కొంటుంది. 2030 నాటికి వాతావరణ మార్పు, విపత్తుల కారణంగా 37.6 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలో జీవిస్తారని అంచనా వేయబడింది. వీటి ప్రభావంతో 2030 నాటికి 100.7 మిలియన్ల మందిని పేదరికంలోకి నెట్టివేస్తుంది. ప్రకృతి వైపరీత్యాల ప్రభావాలు స్వల్పకాలికం. ప్రాణ, ఆస్తి నష్టం దీర్ఘకాలికంగా ఒక ప్రాంతం లేదా దేశం ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది. మౌలిక సదుపాయాలు, ఇంధన ఉత్పత్తి కేంద్రాలకు నష్టం జరిగి దేశ ఆర్థిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలకు దారితీస్తుంది.
ప్రకృతి వైపరీత్యాలతో ప్రపంచవ్యాప్తంగా సగటున సంవత్సరానికి 60,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా, గత దశాబ్దంలో 0.1% మరణాలకు విపత్తులు కారణమయ్యాయి. ఇది 0.01% నుండి 0.4% వరకు మారుతుంటుంది.చారిత్రాత్మకంగా, కరువు, వరదలు, భూకంపాలు అత్యంత ఘోరమైన విపత్తు సంఘటనలు. 2019లో తుఫానులు ప్రపంచవ్యాప్తంగా 59.3 బిలియన్ యుఎస్ డాలర్ల నష్టాన్ని కలిగించాయి. ఇక మానవ నిర్మిత విపత్తులు 7 బిలియన్ల నష్టాలకు కారణమయ్యాయి.
ఒక దేశం పరిపాలన నిర్మాణం ఆర్ధిక, సామాజిక అభివృద్ధికి, ప్రజా విధానాల అమలు సక్రమంగా ఉంటే స్థిరమైన జీవనోపాధి సాధిస్తూ విపత్తులకు గురికావడం కూడా తగ్గుతుంది. జవాబుదారీతనం, ప్రపంచ కార్యక్రమాలలొ పాల్గొనడం, సమర్థత, అంచనాలు, పారదర్శకత పరిపాలన అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి ప్రమాద విపత్తులు తగ్గిస్తాయి. యూఎన్ సభ్య దేశాలు 2015లో విపత్తు ప్రమాదాన్ని తగ్గించడానికి సెండాయ్ (జపాన్) ప్రణాళిక ప్రకారం ప్రజల ప్రాణాలు రక్షణతో మంచి విపత్తు పాలనను కొలవవచ్చు. విపత్తు ప్రభావిత సంఖ్యను తగ్గించి, ఆర్థిక నష్టాలను తగ్గించవచ్చు.
తీవ్రమైన విపత్తు సంభవించినప్పుడు రాష్ట్ర పరిధిలో తగినన్ని నిధులు లేకపోతే, కేంద్రం నుంచి సంబంధిత నిధి అనుబంధంగా ఉంటుంది. ఇది భారత ప్రభుత్వ ‘పబ్లిక్ అకౌంట్స్’లో వడ్డీలేని రిజర్వ్ ఫండ్స్ కింద ఉంటుంది. దీని వినియోగానికి పార్లమెంటు ఆమోదించాల్సిన అవసరం లేదు. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం సెక్షన్ 48 (1) ప్రకారం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధిని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉండే ప్రాథమిక నిధి. ఆయా భౌగోళిక పరిస్థితులను.. అవసరాన్ని బట్టి కేంద్రం రాష్ట్రాలకు కేటాయిస్తుంది. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు నిమిత్తం సంవత్సరంలో రెండు దఫాలుగా నిధిని విడుదల చేసి, తక్షణ సహాయ కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగిస్తారు.
విపత్తు ప్రతిస్పందనా కార్యకలాపాలు ఐదు దశల్లో జరుగుతాయి. అవి.. నివారణ.. సహజంగానో.. సాంకేతికంగానో.. లేదా మానవ చర్యల వల్ల సంభవించే ప్రమాదాలను నివారించడంలాంటి వాటిపై దృష్టి పెట్టడం.తీవ్రతను తగ్గించడం.. విపత్తుల సమయంలో ప్రాణనష్టం, ఆస్తి నష్టాలను తగ్గించే ప్రయత్నం చేసి ఉపశమనాన్ని కలిగించడం. సంసిద్ధత.. ఏ సమయంలోనైనా కార్యకలాపాలలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండటం. వెంటనే యాక్షన్‌లో పాల్గొనటం. రికవరీ.. భయాందోళనల నుంచి, ఇబ్బందుల నుంచి బాధితులను ప్రాధమికంగా సర్దుబాటు చేయటం.
ఆయా పరిస్థితుల నివారణ మన ఆధీనంలో ఉండదు కాబట్టి, ఆర్గనైజేషన్ నిర్వహణలో పై చివరి నాలుగు దశలను మూలస్తంభాలుగా భావిస్తుంది. ఈ దశలకు అనుబంధంగా కమ్యూనికేషన్, కోఆర్డినేషన్, కోఆపరేషన్, కొలాబరేషన్ అనే నాలుగు సూత్రాలుంటాయి.
కమ్యూనికేషన్: నిర్దిష్ట సమాచారాన్ని సేకరించి, ఒకరికొకరు అందించుకోవడం కమ్యూనికేషన్ వల్లనే సాధ్యమవుతుంది.
కోఆర్డినేషన్: కోఆర్డినేషన్ అనేది దళానికి గుండెలాంటిది అని చెప్పవచ్చు. దళంలో అందరి మధ్య సమన్వయ ప్రయత్నాలు ప్రభావవంతంగా ఉండటానికి, ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి, విపత్తులకు ప్రతిస్పందించడానికి కీలకం ఈ సమన్వయమే.
కోఆపరేషన్: విపత్తుల బారిన పడిన వారికి అన్ని వైపుల నుంచి సహాయ సహకారాలు సమంగా అందాలంటే అందరి భాగస్వామ్యం ఏకతాటిపై నడవాలి. ఏ ఒక్క సంస్థనో పూర్తి బాధ్యత వహించలేదు. పరస్పర సహకారం లేకపోతే సాధ్యం కాదు.
కొలాబరేషన్: అందరూ ఉమ్మడిగా వారివారి లక్ష్యాల దిశగా నడవడానికి, వాలంటీర్లకు, భాగస్వామ్య సంస్థలకు శక్తినిచ్చేది ఈ కొలాబరేషనే. అందరి మధ్య ఈ సహాయ సహకారాలుంటే వ్యూహాత్మకమైన, నిర్మాణాత్మకమైన చర్యలతో లక్ష్యం నెరవేరుతుంది.
మొట్టమొదట విపత్తుకు గురైన బాధితులకు మూడు అత్యవసర చర్యలు చేయవలసి ఉంటుంది. అవే చెక్.. కాల్.. కేర్.చెక్ అంటే.. సంఘటనా స్థలాన్ని, బాధితుడిని తనిఖీ చేయటం.. కాల్.. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ నంబర్‌కు కాల్ చేసి సమాచారాన్ని అందించటం. కేర్.. మెడికేషన్ అందే లోపల బాధితులను సంరక్షించడం. ఈ మూడు పనులు వాలంటరీ దళాలు ప్రాథమికంగా నిర్వహిస్తాయి.
తరువాతి దశలో మెడికల్ సర్వీసు నిర్వహణ ఎబిసి నిర్వహిస్తుంది. అంటే.. ఎ- ఎయిర్ వే, బి- బ్రీతింగ్, సి- సర్క్యులేషన్. బాధితుని గాలి తగిలే ప్రాంతంలో ఉంచటం. శ్వాస పీల్చుకునే విధానం సహజ స్థితిలో ఉన్నదీ లేనిదీ గమనించి చికిత్స అందించటం. రక్తప్రసరణ సరిగా ఉండేలా చూడటం. ఈ మూడు పరిస్థితులను ప్రామాణికంగా తీసుకుంటారు.వినూత్న టెక్నాలజీ.. సేవాభావ నిరతితో పనిచేసే నెట్‌వర్క్ ఉన్న దళం గురించి వింటుంటే ఒక ధైర్యం నెలకొంటుంది ప్రతి ఒక్కరిలో. ఆ ధైర్యానికి ప్రతీకగా ఎల్లవేళలా ఎన్‌డిఆర్‌ఎఫ్ నిలవాలని ఆశిద్దాం.
ఎన్‌డిఆర్‌ఎఫ్ రాజ్యాంగబద్ధంగా ఆవిర్భవించింది. 2006లో ఎనిమిది బెటాలియన్‌లతో ఏర్పడి.. ప్రస్తుతం 15 బెటాలియన్లతో ఉంది. ఒక్కో బెటాలియన్‌లో 1149 మంది సిబ్బంది ఉంటారు. ఎన్‌డిఆర్‌ఎఫ్‌లో బిఎస్‌ఎఫ్, సిఐఎస్‌ఎఫ్, సిఆర్‌పిఎఫ్, ఐటిబిపి, ఎస్‌ఎస్‌బి, అస్సాం రైఫిల్స్ నుండి 15 బెటాలియన్లు ఉన్నాయి. ప్రతి బెటాలియన్‌లో ఇంజనీర్లు, టెక్నీషియన్లు, ఎలక్ట్రీషియన్లు, డాగ్ స్క్వాడ్‌లు, పారామెడిక్స్‌తో సహా 45 మంది సిబ్బందితో కూడిన 18 స్వీయ-నియంత్రణ స్పెషలిస్ట్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌లు ఉన్నాయి. 15 బెటాలియన్లు సహజమైన, మానవ నిర్మిత విపత్తులకు ప్రతిస్పందించడానికి శిక్షణ పొంది ఉన్నాయి.
మొదట సిబ్బందిని సాధారణ శాంతిభద్రతలకూ కేటాయించేవారు. అక్టోబరు 25, 2007న ప్రధానమంత్రి ఛైర్మన్‌గా ఉన్న ఎన్‌డిఎమ్‌ఏ (నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ) తో జరిపిన సమావేశంలో, ప్రత్యేక దళంగా నియమించారు. ఆ తర్వాత దళ అధిపతిని డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. పోలీసు వ్యవస్థలోని ఐపిఎస్ అధికారులను డిప్యుటేషన్‌పై డిజిగా నియమిస్తారు. దళం డిజి త్రీ స్టార్ ఆఫీసర్. దీనికే పరిమితం కాక రసాయన, జీవ, రేడియోలాజికల్, న్యూక్లియర్ (సిబిఆర్‌ఎన్) కేంద్రాలలో జరిగే విపత్తుల వేళ ఏం చేయాలో అనే వాటిలో కూడా ఈ దళం శిక్షణ పొందింది. దేశంలో తరచు విపత్తులు ఏర్పడే 16 ప్రదేశాలలో దళం అప్రమత్తంగా ఉంటుంది.
-డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!
- 14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!
- యూఏఈలో తొలి లైసెన్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ పోర్టల్..!!
- ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..







