పురచ్చి తలైవర్-ఎం.జి.ఆర్

- January 19, 2025 , by Maagulf
పురచ్చి తలైవర్-ఎం.జి.ఆర్

ఎం.జి.ఆర్ .. ఈ మూడు పొడి అక్షరాలు ఒకప్పుడు తమిళ సినీ రాజకీయాలను శాసించాయి. భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక నటుడు ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఆయనతోనే మొదలైంది. వెండితెర మీద దశాబ్దాల పాటు తిరుగులేని హీరోగా కొనసాగిన ఆయన, తన గురువు అన్నాదురై ఆశయాలను, పేద ప్రజల సంక్షేమం కోసం రాజకీయాల్లో అడుగుపెట్టి వరసగా మూడు సార్లు తమిళనాడు సీఎం అయ్యారు. తెరపై ఆయన నటనకు ప్రేక్షకుల నుంచి ఎలా చప్పట్లు రాలాయో, అదే విధంగా రాజకీయాల్లో ఆయన చేపట్టిన సంస్కరణలకు ప్రజల ఆదరణ లభించింది. పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే రాజకీయం అని నమ్మిన మహానేత. నేడు తమిళ ప్రజల ఆరాధ్య నాయకుడు, భారతరత్న పూరచ్చి తలైవర్ ఎం.జి.ఆర్ జీవిత ప్రస్థానం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం..! .

ఎం.జి.ఆర్ పూర్తి పేరు మరుతూర్ గోపాలన్ రామచంద్రన్. 1917, జనవరి17న శ్రీలంకలోని కాండీ జిల్లా నావాల్పితియాలో మలయాళీ దంపతులైన గోపాలన్ మీనన్, మరుతూర్ సత్యభామ దంపతులకు జన్మించారు. రామచంద్రన్ తల్లిదండ్రులు శ్రీలంకలో తేయాకు, రబ్బర్ తోటల ఎస్టేట్స్‌లో మెజిస్ట్రేట్‌గా పని చేసేందుకు కేరళలోని పాలక్కాడ్ ప్రాంతం నుంచి లంకకు వలస వెళ్లారు. రామచంద్రన్ చిన్నతనంలోనే తండ్రి, సోదరి వెంట వెంటనే మరణించడంతో, వారి కుటుంబం భారతదేశానికి తిరిచి వచ్చి మొదట పాలక్కాడ్ చేరుకుంది. వీరి కుటుంబాన్ని ఆదుకునేందుకు తండ్రి వైపు బంధువులు ముఖం చాటేయడంతో అక్కడ నుంచి తమిళనాడు లోని తల్లి సోదరుడు ఉంటున్న కుంభకోణం చేరుకున్నారు. అక్కడా వారి కుటుంబానికి పెద్ద ఆదరణ లభించకపోయినా తల దాచుకోవడానికి నీడ లభించింది.  

దేశం కానీ దేశంలో ఊహ తెలియని సమయంలో తండ్రి, సోదరి మరణం, బంధువుల నిరాదరణ, ఏనాడు గడప దాటని తల్లి తమ పోషణ కోసం కూలీ పనులు చేయడం వంటివి చిన్నతనంలోనే ఆయన మనసును చివుక్కుమనేలా చేశాయి. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా తన కుమారులిద్దరూ బాగా చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేయాలని ఆయన తల్లిగారు కలలు కనేవారు. తల్లి ప్రోద్బలంతో సోదరుడితో కలిసి ప్రాథమిక విద్య వరకు చదువుకున్నారు. అయితే,ఎం.జి.ఆర్ చిన్నతనంలోనే నాటకాలపై ఆసక్తి పెంచుకొని చదువుకు స్వస్తి పలికారు. అదే సమయంలో కుటుంబ పోషణ కోసం మధురై బాయిస్ నాటకాల కంపెనీలో పని చేయడానికి పూనుకున్నారు.

బాయిస్ కంపెనీలో వెయిటర్‌గా జీవితాన్ని మొదలు పెట్టిన ఎం.జి.ఆర్, కొద్దీ బాలనటుడిగా నటిస్తూ తన ఆసక్తి, పట్టుదలతో కొద్దీ కాలానికే కథానాయక పాత్రలు వేసే స్థాయికి చేరుకున్నారు. తమిళ రంగస్థల ప్రముఖులైన కాళీ రత్నం మరియు  కె.పి.కేశవన్, మద్రాస్ కందసామి మొదలియార్‌లు ఎం.జి.ఆర్ నట జీవితానికి బలమైన పునాదులు వేశారు. వారి ప్రోత్సాహంతోనే సినీ రంగంలో అవకాశాలు వెతుక్కుంటూ మద్రాస్ నగరానికి చేరుకున్నారు. ఆరంభంలో అవకాశాల కోసం ఆనాడు మద్రాస్‌లోని సినీ స్టూడియోలు చుట్టూ తిరిగేవారు.

1936లో సతీ లీలావతి చిత్రంతో సినీ ఆరెంగేట్రం చేశారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో, హీరోగా నటిస్తూ వచ్చారు. 1950 ఆరంభంలో ఆయన సినీ కెరీర్ గ్రాఫ్ బాగా ఊపందుకుంది. ప్రముఖ కథా రచయిత కరుణానిధి (తర్వాత కాలంలో తమిళనాడు సీఎం) రాసిన 'మళైక్కల్లన్' చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్నారు. ఇంక అక్కడ నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. 1950 చివరి నాటికి తమిళ సినీరంగంలో టాప్ హీరోగా ఎదిగారు.

1960-77 వరకు తమిళ సినీ పరిశ్రమలో అత్యధిక హిట్ చిత్రాలన్నీ ఎం.జి.ఆర్‌వే కావడం విశేషం. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగు, కన్నడ భాషల్లో రీమేక్ అయ్యి అక్కడ కూడా సంచలన విజయాలు సాధించాయి. వెండితెరపై ఎం.జి.ఆర్‌ బడుగు, బలహీన వర్గాల ప్రతినిధిగా నటించి వారిని పీడించే సంపన్న భూస్వాముల గర్వాన్ని అణిచడం వంటి పాత్రల ద్వారా ఆయనకు "పురచ్చి తలైవర్" (విప్లవ నాయకుడు) బిరుదు అందుకున్నారు. ఆయన 1972లో నటించిన "రిక్షాకరన్", 1973లో వచ్చిన "ఉలగం సూత్రమ్ వలీబన్" చిత్రాలు మెగా బ్లక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. 1977 తర్వాత ఎం.జి.ఆర్‌ సినీ పరిశ్రమ నుంచి విరమణ తీసుకున్నారు. కెరీర్ తొలినాళ్ళలో తప్ప తర్వాత ఏనాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించలేదు. కెరీర్ చివరి వరకు హీరోగానే నటిస్తూ వచ్చారు.      

ఎం.జి.ఆర్‌ సినీ జీవితంలో పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. వాటిలో ఉత్తమ నటుడిగా 2 ఫిలిం‌ఫెర్, 2  తమిళనాడు రాష్ట్ర అవార్డులను అందుకున్నారు. 1971లో రిక్షాకరన్ చిత్రానికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న తోలి తమిళ నటుడిగా చరిత్ర సృష్టించారు. ఇవే కాకుండా ఆయన పలు సినిమాలకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఆయన నటనను అవార్డులతో కొలవలేము. నటనతో అశేషమైన ప్రజాభిమానాన్ని పొందిన ఘనత ఆయన సొంతం.  

సినీపరిశ్రమలో హీరోగా ఎం.జి.ఆర్‌ నిలదొక్కుకుంటున్న దశలో స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుగా ఉండేవారు. ఇదే సమయంలో ద్రవిడ ఉద్యమ నాయకుడు, ప్రముఖ రచయిత అన్నాదురై పరిచయం ఆయన్ని ద్రవిడ ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యేలా చేసింది. అన్నాదురై ద్వారానే ఆయన మరో శిష్యుడైన ముత్తువేల్ కరుణానిధితో సన్నిహిత పరిచయాలు ఏర్పడ్డాయి. 1953లో అన్నాదురై స్థాపించిన ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీలో చేరారు. అప్పటి నుండి తన సినిమాల్లో తమిళవాదాన్ని, ద్రవిడ ఉద్యమ భావజాలాన్ని ప్రోత్సహిస్తూ వచ్చారు.

1962లో మద్రాస్ శాసనమండలికి ఎం.జి.ఆర్‌ ఎన్నికయ్యారు. అన్నా సిద్ధాంతాలకు తన సినిమా గ్లామర్ యాడ్ చేయడం ద్వారా డిఎంకెకు తమిళనాడు రాష్ట్ర  వ్యాప్తంగా ఆదరణ లభించడం ప్రారంభించింది. 1967 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన సినిమాలను పక్కన పెట్టి మరి డిఎంకె తరపున ప్రచారం చేసి, ఆ ఎన్నికల్లో తాను సైతం మద్రాస్ నగరంలోని సెయింట్ థామస్ మౌంట్ అసెంబ్లీ నుంచి 50వ ఏట ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 1969లో సీఎం అన్నాదురై మరణం తర్వాత కరుణానిధికి మద్దతుగా ఆయన సీఎం చేపట్టేందుకు నిలిచారు. 1969-72 వరకు డిఎంకె కోశాధికారిగా పనిచేశారు. 1971లో అదే నియోజకవర్గం నుంచి రెండోసారి మద్రాస్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

1971లో రెండో సారి కరుణానిధి సీఎం అయ్యాక వారిద్దరి మధ్య రాజకీయంగా విభేదాలు రావడంతో ఎం.జి.ఆర్‌‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆయనతో పాటు పలువురు సీనియర్ నాయకులను సైతం బహిష్కరించారు. 1972లో వీరందరూ కలిసి ఎం.జి.ఆర్‌‌ నాయకత్వంలో అన్నా డిఎంకె పార్టీని స్థాపించారు. 1972లో తన శాసనసభ సభ్యత్వానికి ఎం.జి.ఆర్‌‌ రాజీనామా చేసి అన్నా డిఎంకె తరపున అదే నియోజకవర్గం నుంచి మూడో సారి ఎన్నికయ్యారు. 1972-77 వరకు తన సినిమాల ద్వారా అన్నా డిఎంకె పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అన్నాదురై శిష్యుడు, తమిళనాడు మాజీ ఆపద్ధర్మ సీఎం నెడుంజెళియన్ వంటి సీనియర్ రాజకీయ వ్యూహకర్త సైతం పార్టీ విస్తరణలో సహాయపడ్డారు.

1977లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె పార్టీని ఓడించి, ఎం.జి.ఆర్‌‌ నేతృత్వంలోని అన్నా డిఎంకె పార్టీ మొదటిసారి తమిళనాడులో  అధికారంలోకి వచ్చింది. అయితే, 1980లో డిఎంకె ప్రోద్బలంతో కేంద్రంలో ఉన్న ఇందిరా సర్కార్ ఎం.జి.ఆర్‌‌ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించింది. తమ వెండితెర ఆరాధ్య దైవానికి రాజకీయంగా జరిగిన అన్యాయం పట్ల రగిలిపోయిన తమిళనాడు ప్రజలు ఆ ఎన్నికల్లో అన్నా డిఎంకె పార్టీకి పట్టం కట్టి ఎం.జి.ఆర్‌‌‌ను రెండోసారి సీఎం పీఠం మీద కూర్చోబెట్టారు.

1984లో ఇందిరా మరణంతో దేశ రాజకీయ పరిస్థితులు మారడం, ఎం.జి.ఆర్‌‌ అనారోగ్యం తీవ్ర రూపం దాల్చడంతో పార్టీ నేతలు మరియు  కార్యకర్తల సలహా మేరకు ఏడాది ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లగా, ఆ ఎన్నికల్లో ఆయన పార్టీకి ప్రజలు మరోసారి బ్రహ్మరథం పట్టారు. 1984 ఎన్నికల విజయంతో వరసగా మూడోసారి తమిళనాడు సీఎంగా ఎం.జి.ఆర్‌‌ బాధ్యతలు చేపట్టారు. దక్షిణ భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక రాష్ట్రానికి వరసగా మూడు సార్లు సీఎం అయిన ఘనత ఇప్పటికి  ఎం.జి.ఆర్‌‌ పేరు మీదే ఉంది. ఆ రికార్డును చెరిపేందుకు కాకలుతీరిన రాజకీయ ఉద్దండులకు సైతం సాధ్యం కాకపోవడం విశేషం.

1977-87 వరకు తమిళనాడు సీఎంగా పనిచేసిన ఎం.జి.ఆర్‌‌ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారు. ద్రవిడ సిద్ధాంతాల కంటే పేదోడి కడుపు నింపడమే నిజమైన రాజకీయంగా నమ్మిన ఆయన కామరాజ్ నాడార్, అన్నాదురై బాటలో నడుస్తూ పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. చిన్నప్పుడు అన్నం కోసం అలమటించిన రోజులు ఆయన మదిలో ఉండడం చేత 2 రూపాయలకే కిలో బియ్యం, ప్రభుత్వ స్కూళ్ళు మరియు సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం ఏర్పాటు, ప్రజలకు ఉచితంగా బట్టల పంపిణి వంటి ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఎం.జి.ఆర్‌‌ పాలన మొత్తం నిరుపేద, బడుగు, బలహీన వర్గాల యొక్క  సంక్షేమం, అభ్యున్నతి లక్ష్యంగా సాగింది. ఈ క్రమంలో తనపై రాజకీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా లెక్కచేయలేదు. ప్రజలు ఆయన్ని అదే విధంగా నమ్ముతూ వచ్చారు.

ఎం.జి.ఆర్‌‌ సీఎంగా సాగినంత కాలం ముఖ్యమంత్రికి దక్కే ప్రభుత్వ రాచరిక మర్యాదలను స్వీకరించలేదు. సీఎం అధికార నివాసం నుండి కాకుండా తన సొంత నివాసంలోనే ఉండేవారు. ప్రభుత్వ హోదాలు పేరిట చేసే దుబారా ఖర్చుల పట్ల పూర్తి వ్యతిరేకంగా ఉంటూ వచ్చిన ఆయన తన మంత్రులు సైతం ఆడంబరాలకు పోయినా తీవ్ర నిరసన వ్యక్తం చేసేవారు. సీఎంగా ఎం.జి.ఆర్‌‌ ఒక్క రూపాయి మాత్రమే జీతంగా తీసుకునేవారు. పాలనలో ఆయనకు అనుభవలేమిని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న కొందరు వ్యక్తులకు ఉద్యోగ, రాజకీయ జీవితమే లేకుండా చేసిన సంఘటనల గురించి ఇప్పటికి తమిళ ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారు.  

ఎం.జి.ఆర్‌‌ తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో సైతం ప్రభావం చూపారు. మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్,  ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు ఆయన సీఎంగా ఉన్న సమయంలో దేశ ప్రధానులుగా ఉన్నారు. తమిళనాడు ప్రజల సంక్షేమమే తన రాజకీయ సిద్ధాంతంగా చేసుకున్న ఆయనకు కేంద్రం నుంచి సహాయ సహకారాలు లభించేవి. మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ హయాంలో జనతా ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇవ్వడం ద్వారా కేంద్రం నుంచి నిధులు రాబట్టారు. 1980-87 ఇందిరా, రాజీవ్ గాంధీల హయాంలో సైతం వారికి సన్నిహితంగా మెలుగుతూ ప్రభుత్వ పరిశ్రమల ఏర్పాటు మరియు అభివృద్ధి నిధులను రాబట్టారు. చెన్నై నగర ప్రజల  దాహార్తిని తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో తెలుగు గంగ ప్రాజెక్టును పూర్తి చేయించారు.

 ఎం.జి.ఆర్‌‌, ఎన్టీఆర్ బంధం గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. తమిళంలో ఎం.జి.ఆర్‌‌, తెలుగులో ఎన్టీఆర్ అశేషమైన ప్రజాదరణ పొందిన నటులు. రంగస్థల అనుభవం ఉన్న వీరివురూ 50వ దశకం చివర్లోనే క్రమశిక్షణ, కృషి, పట్టుదలతో తమ తమ భాషల్లో అగ్ర హీరోలుగా ఎదిగారు. ఎం.జి.ఆర్‌‌ తమిళంలో నటించిన సినిమాలను ఎన్టీఆర్ తెలుగులో రీమేక్ చేయగా, ఎన్టీఆర్ తెలుగులో నటించిన పలు చిత్రాలను  ఎం.జి.ఆర్‌‌ తమిళంలో రీమేక్ చేశారు. వ్యక్తిగతంగా సైతం వీరివురూ అత్యంత సన్నిహితంగా మెలుగుతూ ప్రాణ మిత్రులయ్యారు. ఎన్టీఆర్ కంటే తను వయస్సులో పెద్దైనప్పటికి బ్రదర్, బ్రదర్ అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. నటన పట్ల వీరిద్దరికి ఉన్న అంకిత భావం, దైవత్వం కారణంగానే భారత సినీ చరిత్రలో తిరుగులేని నట శిఖరాలుగా నిలిచిపోయారు.

ఎం.జి.ఆర్‌‌ రాజకీయాల్లో అడుగుపెట్టి సీఎంగా అయిన సమయంలో సినీ పరిశ్రమ నుంచి ఆయనకు అభినందనలు తెలిపిన మొట్ట మొదటి వ్యక్తి ఎన్టీఆర్. ఎం.జి.ఆర్‌‌ పాలనను దగ్గరగా గమనిస్తూ వచ్చిన ఎన్టీఆర్ తమిళనాడు ప్రజలకు ఆయన చేస్తున్న మంచిని పలు మార్లు బహిరంగంగానే కొనియాడారు. ఎం.జి.ఆర్‌‌ స్ఫూర్తితోనే ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీని స్థాపించిన 8 నెలల్లోనే సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఎన్టీఆర్ సీఎం అవ్వడం పట్ల ఎం.జి.ఆర్‌‌ మనస్ఫూర్తిగా హర్షించారు. 1984లో జరిగిన తమిళనాడు రాష్ట్ర  అసెంబ్లీ  ఎన్నికల్లో ఎం.జి.ఆర్‌‌ అస్వస్థతగా ఉన్న సమయంలో సీఎం హోదాలోనే ఎన్టీఆర్ ఆయన తరపున ఎన్నికల ప్రచారం సైతం నిర్వహించి తన మిత్రుడి విజయంలో భాగస్వామి అయ్యారు. అలాగే, ఆగస్టు సంక్షోభ సమయంలో పదవీచ్యుతుడైన ఎన్టీఆర్‌కు అండగా నిలిచిన ఎం.జి.ఆర్‌‌ తన పరపతితో ఇందిరా గాంధీ మీద ఒత్తిడి తీసుకొచ్చి తిరిగి ఎన్టీఆర్ సీఎం అవ్వడంలో తన వంతు సహాయపడ్డారు.

 ఎం.జి.ఆర్‌‌, ఎన్టీఆర్‌ల పాలన సైతం ఒకే రీతిలో సాగేది. ఇరువురూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారు. తమిళనాడులో ఉన్న సంక్షేమ పథకాలను పరిశీలించి వాటిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ అమలు చేశారు. చెన్నై దాహార్తిని తీర్చేందుకు 5 tmcల నీటిని ఇవ్వాలని ఎం.జి.ఆర్‌‌ తన మిత్రుడైన ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్టీఆర్‌ను కోరడమే తరువాయి ఆగమేఘాల మీద తెలుగుగంగ ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్టీఆర్ పచ్చజెండా ఊపారు. 1983, మే 23న ప్రధాని ఇందిరా సమక్షంలో ఎం.జి.ఆర్‌‌, ఎన్టీఆర్‌‌లు కలిసి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ రికార్డు స్థాయిలో 1985లోనే పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ వల్ల ఎం.జి.ఆర్‌‌, ఎన్టీఆర్‌‌లు చరిత్రలో నిలిచిపోయారు. సినీ, రాజకీయ రంగాల్లో వీరువురూ సాధించిన విజయాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. ఎం.జి.ఆర్‌‌ తుదిశ్వాస వరకు ఎన్టీఆర్‌తో ఘాడమైన మైత్రి కొనసాగింది.    

ఎన్టీఆర్ తర్వాత ఎం.జి.ఆర్‌‌ జీవితంలో సతీమణి జానకి గురించి చెప్పుకోవాలి! చిత్ర సీమలో హీరోగా ఎదుగుతున్న సమయంలో తన పక్కన నటించడానికి నాటి అగ్ర హీరోయిన్స్ సందేహిస్తున్న సమయంలో అప్పటికే గాయకురాలిగా, నటిగా అగ్రపథాన దూసుకెళ్తున్న జానకి ఆయన పక్కన నటించడానికి ఒప్పుకోవడం అప్పటి తమిళ సినీ పరిశ్రమలో ఒక సంచలనం. జానకి గారితో ఆయన నటించడం వల్ల ప్రొడ్యూసర్స్, దర్శకులు ఎం.జి.ఆర్‌‌ ను సినిమాల్లోకి తీసుకోవడం మొదలు పెట్టారు. అలా, తన సినీ కెరీర్ ఆరంభంలో జానకి చేసిన సహాయాన్ని ఆయన ఏనాడు మరువలేదు. జానకి పరిశ్రమలో విజయవంతమైన నటిగా కొనసాగుతున్న సమయంలోనే ఆమె మొదటి  భర్త అనుమానంతో చిత్ర హింసలకు గురి చేసిన సమయంలో ఆమెకు ఎం.జి.ఆర్‌‌ అండగా నిలిచారు. ఎం.జి.ఆర్‌‌ రెండో భార్య మరణం తర్వాత జానకిని పెళ్లి చేసుకున్నారు. వారి వైవాహిక బంధం చివరి వరకు సంతోషంగా కొనసాగింది. ఎం.జి.ఆర్‌‌ మరణం తర్వాత ఆమె నెల రోజుల పాటు సీఎంగా కొనసాగారు. ఎం.జి.ఆర్‌‌ స్మారకార్థం తమిళనాడు వ్యాప్తంగా విద్యాసంస్థలను నెలకొల్పి వాటి నిర్వహణ కోసం  తన ఆస్తులను మొత్తం విరాళంగా ఇచ్చేసారు.

ఎం.జి.ఆర్‌‌ జీవితంలో మరో ముఖ్యమైన పాత్ర నటి జయలలిత. కుటుంబ కష్టాల కారణంగా ఇష్టం లేకపోయినా తల్లి సంధ్య కోసం చిన్న వయస్సులోనే హీరోయిన్‌గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె అతికొద్ది కాలానికే ఎం.జి.ఆర్‌‌ సరసన కథానాయకిగా నటించడం మొదలు పెట్టారు. వీరిద్దరూ  28 చిత్రాల్లో నటించగా దాదాపు అన్ని చిత్రాలు విజయవంతం కావడం విశేషం. తమిళ సినిమా చరిత్రలో విజయవంతమైన జోడిగా వీరిద్దరికి పేరుంది. అదే సమయంలో జయలలితపై తనకు సర్వ హక్కులు ఉండేవని ఎం.జి.ఆర్‌‌ భావిస్తూ ఉండేవారు. తనతో తప్ప మిగిలిన ఏ హీరోతోనైనా ఆమె సన్నిహితంగా మెలిగిన వారిని తీవ్రంగా హెచ్చరించేవారు. ఎం.జి.ఆర్‌‌ వల్ల వ్యక్తిగత జీవితంలో జయలలిత చాలా ఇబ్బందులు పడింది. అలాగే, ఆమె మేధా శక్తికి కొన్ని సార్లు అబ్బురపడేవారు.

1972లో అన్నా డి.ఎం.కెను  నెలకొల్పిన సమయంలో జయలలిత సైతం ఉన్నారు. అయితే, జయకు రాజకీయంగా ప్రాధాన్యం దక్కింది మాత్రం 70వ దశకం చివరి నుంచే! 1982లో ఆమె ఎం.జి.ఆర్‌‌ సమక్షంలో అధికారికంగా పార్టీలో చేరారు. అదే ఏడాది ఆమెను పార్టీ ప్రచార కార్యదర్శిగా నియమించారు. ఆ తర్వాత ఢిల్లీలో తన ప్రతినిధిగా ఉండేందుకు 1984లో ఆమెను రాజ్యసభకు పంపించారు. తనకున్న  బహుముఖ భాషా పరిజ్ఞానం, రాజకీయ విషయ పరిజ్ఞానంతో అనతి కాలంలోనే నాటి దేశ ప్రధానులైన ఇందిరా, రాజీవ్ గాంధీలకు జయ దగ్గరయ్యారు. ఢిల్లీ రాజకీయాల్లో జయకు కోస్తున్న పేరు ప్రఖ్యాతలు కారణంగా ఎం.జి.ఆర్‌‌ అధికారిక రాజకీయ వారసురాలిగా మీడియా చేత గుర్తించబడ్డారు. ఆ తర్వాత  ఎం.జి.ఆర్‌‌ ఆకస్మిక మరణం, తర్వాత కాలంలో అన్నా డి.ఎం.కె పార్టీ బాధ్యతలు చేపట్టి ఐదు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగానే కాకుండా జాతీయ రాజకీయాల్లో సైతం ఒక వెలుగు వెలిగారు.

కరుణానిధి గురించి చెప్పకుండా ఎం.జి.ఆర్‌‌ జీవితం ముగియదు. ఇద్దరూ పేదరికపు బాల్యాన్ని గడిపి జీవితంలోకి పైకి రావాలనే కసితో కళను నమ్ముకొని మద్రాస్ చేరుకున్నారు. కరుణానిధి సినీ రచయితగా, ఎం.జి.ఆర్‌‌ సినీ నటుడిగా ఎదుగుతున్న సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. కరుణానిధి ద్వారానే అన్నాదురైకి ఎం.జి.ఆర్‌‌ దగ్గరయ్యారు. ఎం.జి.ఆర్‌‌ నటనకు కరుణ కలం తోడై తమిళ చిత్ర సీమలో సంచలనాలకు దారి తీసింది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ విజయవంతం కావడం విశేషం. ఇదే సమయంలో కరుణానిధి, అన్నాదురై కలిసి డి.ఎం.కెను స్థాపించడంతో సినిమాల కంటే రాజకీయాల మీద కరుణ దృష్టి సారించినా, స్నేహితుడి కోసం సినీ రచనలు చేసేవారు. కరుణ, అన్నాదురై ప్రోద్బలంతో ఎం.జి.ఆర్‌‌ డి.ఎం.కెలో చేరారు.

60వ దశకం నుంచి కరుణానిధి రాజకీయాల్లో క్రియాశీలకం కావడం, ఎం.జి.ఆర్‌‌ తమిళ నాట తిరుగులేని అగ్ర హీరోగా ఎదగడంతో డి.ఎం.కె  పార్టీకి బాగా లాభించింది. ఎం.జి.ఆర్‌‌ తన సినిమాల ద్వారా పార్టీ సిద్ధాంతాలకు ప్రచారం కల్పిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లే సమయంలోనే పార్టీ వ్యవహారాలను చక్కబెట్టే పనుల్లో కరుణానిధి నిమగ్నమై ఉండేవారు. 1967 ఎన్నికల్లో డి.ఎం.కె  అధికారంలోకి తీసుకురావడానికి వీరు ఇద్దరు బాగా కృషి చేశారు. పార్టీ రావడంతో అన్నాదురై సీఎం అయ్యారు. అన్నా మంత్రివర్గంలో కరుణానిధి మంత్రిగా చేరగా ఎం.జి.ఆర్‌‌ ఎమ్యెల్యేగానే ఉండిపోయారు. 1969లో అన్నాదురై మరణంతో సీఎం పీఠం కోసం నెడుంజెళియన్, కరుణానిధి మధ్య జరిగిన పోరులో సైతం కరుణ వైపే ఎం.జి.ఆర్‌‌ ఉన్నారు.

1969లో కరుణానిధి సీఎం అయిన తర్వాత నుంచి పార్టీలో ఎం.జి.ఆర్‌‌ ప్రాధాన్యత తగ్గిస్తూ రావడంతో పాటుగా, పార్టీలో ఎం.జి.ఆర్‌‌ మాట చెల్లుబాటు జరగకుండా చేయడంతో పాటుగా కోశాధికారిగా ఉన్న ఆయనకు  పార్టీ నిధులను వేరే దారుల్లో మళ్లించడం వంటి పలు వరస  అవమానాలు కరుణ, ఎం.జి.ఆర్‌‌ స్నేహ బంధానికి బీటలు వారెలా చేసింది. ఆ తర్వాత పార్టీలోని తన మద్దతుదారులతో కలిసి తనపై విమర్శలు చేసే వారిపై ఎం.జి.ఆర్‌‌ తిరగబడటంతో కరుణానిధి ఎటువంటి విచారణ జరపకుండానే ఆయన్ని, ఆయనకు మద్దతుగా నిలిచిన వారిని పార్టీ నుంచి బహిష్కరించడం, ఎం.జి.ఆర్‌‌ అన్నా డి.ఎం.కె పార్టీని స్థాపించి వరుసగా మూడు సార్లు సీఎం కావడం, కరుణ ప్రతిపక్షంలో కూర్చోవడం వరుసగా జరిగిపోయాయి. రాజకీయాల కారణంగా ఇద్దరు ప్రాణ మిత్రులు కాస్త బద్ద శత్రువులుగా మారడం బహుశా ఇది తమిళ రాజకీయాల్లో చెరిగిపోని అధ్యయంగా నిలిచిపోతుంది.

 ఎం.జి.ఆర్‌‌ మొదటి నుంచి సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండేవారు. చిత్ర సీమలో సూపర్ స్టార్‌గా ఎదుగుతున్న సమయంలోనే ఆయన అనేక గుప్త దానాలు చేశారు. ఇక తమిళనాడు రాష్ట్రంలో వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆయనే చిత్ర సీమ తరపున చందాలు వసూలు చేసి ప్రభుత్వాలకు అందజేసేవారు. 1962 ఇండియా చైనా యుద్ధం జరుగుతున్న సమయంలో యుద్ధ నిధికి ఆరోజుల్లోనే రూ.75 వేలు విరాళం ఇచ్చారు. తమిళ చిత్ర సీమలో అనేక మంది నిరుపేద, నూతన కళాకారులకు తన చిత్రాల్లో అవకాశాలు ఇచ్చేవారు. పలు దేవాలయాలకు భారీగా విరాళాలు ఇచ్చారు. ఆయన బ్రతికుండగానే తన యావదాస్తిలో 50 శాతం విద్యాసంస్థల స్థాపన మరియు అనాథ శరణాలయాలకు చెందాలని వీలునామా కూడా రాశారు.

తమిళ సినీ, రాజకీయ సీమలో ఐదు దశాబ్దాల పాటు మకుటం లేని మహారాజుగా, పేదల పాలిట పెన్నిధిగా నిలిచిన ఎం.జి.ఆర్‌‌ సీఎం బాధ్యతల్లో ఉండగానే అనారోగ్యం కారణంగా తన 70వ ఏట 1987, డిసెంబర్ 24న తుదిశ్వాస విడిచారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1988లో "భారతరత్న" పురస్కారంతో సత్కరించింది. అంతేకాకుండా, తమిళనాడు ప్రజల కోసం అహర్నిశలు శ్రమించిన స్మారకార్థం ఆ రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, విధులు, బస్ స్టాండ్లకు ఆయన పేర్లు పెట్టడంతో పాటుగా విగ్రహాలు సైతం ప్రతిష్టించారు. 2006లో పాత పార్లమెంట్ భవనంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించారు. 1990,2017లలో కేంద్రం ఆయన మీద ఇండియన్ పోస్టల్ స్టాంప్స్ విడుదల చేసింది. 2017లో ఆయన శత జయంతిని పురస్కరించుకొని 100 మరియు 5 రుపాయల నాణేలను కేంద్రం విడుదల చేసింది.        

ఎం.జి.ఆర్‌‌ వీలునామా ప్రకారం ఆయన సతీమణి జానకి పలు విద్యాసంస్థల స్థాపనకు విరాళాలు ఇవ్వడమే కాకుండా, ఆయన పేరిట పలు విద్యాసంస్థలను స్థాపించారు. తమ దంపతుల పేరిట సైతం పలు విద్యాసంస్థలను స్థాపించి అనేక మంది నిరుపేద చిన్నారులకు  ఉచితంగా విద్యను అందిస్తూ వచ్చారు. నేటికి ఆ విద్యాసంస్థల కార్యకలాపాలు దేదీప్యమానంగా సాగిపోతూనే ఉన్నాయి. ఆ పుణ్య దంపతుల ఆస్తుల మొత్తం ప్రజల సంక్షేమం కోసమే వినియోగించబడుతున్నాయి. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఎం.జి.ఆర్‌‌ తన  స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగి హీరోగా, ప్రజల మన్ననలు పొందిన అతి గొప్ప ప్రజా నాయకుడిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.      
       
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com