గుజరాత్ విశ్వవిద్యాలయం 73వ స్నాతకోత్సవంలో పాల్గొన్నవెంకయ్య నాయుడు
- January 24, 2025
అహ్మదాబాద్: యువతరం ఉన్నత లక్ష్యాలు ఏర్పరుచుకోవాలని, వారి భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం అంకిత భావంతో కష్టపడి పనిచేయాలని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు.
శుక్రవారం వెంకయ్య నాయుడు గుజరాత్ విశ్వవిద్యాలయంలో జరిగిన 73వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
"కష్టపడి పని చేస్తే విజయం దానంతట అదే వరిస్తుంది.మార్పునకు చోదక శక్తి యువతే. వారి భుజాలపైనే భారతదేశ భవిష్యత్తు నిర్మితమవుతుంది.అదే సమయంలో దేశ భవిష్యత్తు తో యువత భవిష్యత్తు ముడిపడి ఉంది.మంచి భవిష్యత్తును నిర్మించుకున్న తర్వాత, తమను ఇంతటి వారిని చేసిన సమాజానికి తిరిగి ఇవ్వటం అలవాటు చేసుకోవాలి." అని చెప్పారు
"విజ్ఞానమే అసలైన సంపద.మీ భవిష్యత్తు మీరు సంపాదించుకునే విజ్ఞాన సంపదపైనే నిర్మితమవుతుంది.దేశ నిర్మాణంలో విద్య పాత్ర చాలా కీలకం." అని చెప్పారు.
" దేశ జనాభాలో 50 శాతం 30 ఏళ్ల లోపు వారే. 35 ఏళ్ల లోపు వారు 65 శాతానికి పైగా ఉన్నారు. ఇది మన బలం.ఎక్కువ మంది మానవ వనరులతో ప్రపంచానికి మన దేశం ప్రతిభావంతుల కర్మాగారం కాబోతోంది.యువతరం ప్రతిభను, వారి శక్తిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోగలిగితే భారత్ త్వరలోనే మరింత శక్తిమంతమైన దేశంగా అవతరిస్తుంది. ఇందుకు కీలకమైన ప్రేరకం విద్య." అని శ్రీ వెంకయ్య నాయుడు చెప్పారు.
నాణ్యమైన విద్య అందరికీ సమానంగా అందాలని వెంకయ్య నాయుడు చెప్పారు. పేదలకు, గ్రామీణ ప్రజలకు నాణ్యమైన విద్యను వారు భరించగలిగే రుసుములకే అందించాలని స్పష్టం చేశారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ దార్శనికతకు అనుగుణంగా సామాజికంగా,ఆర్థికంగా అట్టడుగున ఉన్నవారికి కూడా విద్య, వైద్యం అందుబాటులో ఉండాలన్నారు.
వ్యక్తిత్వ వికాసంలో శారీరక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని శ్రీ వెంకయ్య నాయుడు చెప్పారు. రోజువారి జీవితంలో యోగ, వ్యాయామాలను భాగంగా చేసుకోవాలని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉండాలని విద్యార్థులకు సూచించారు. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు, మనసు ఆరోగ్యంగా ఉంటే శరీరము ఆరోగ్యంగా ఉంటాయని చెప్పారు. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ లను వదిలి భారతీయ సంప్రదాయ వంటకాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో గుజరాత్ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ నీరజ్ గుప్తా తదితరులు పాల్గొని ప్రసంగించారు.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







