జాతీయ పర్యాటక దినోత్సవం...!!

- January 25, 2025 , by Maagulf
జాతీయ పర్యాటక దినోత్సవం...!!

భిన్న సంస్కృతులు, భౌగోళిక పరిస్థితులు, వాతావరణం సమాహారమైన మన భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాలను చూడటం, వెళ్లే ముందే చరిత్ర చదవడం, స్థానిక ఆహారం ఆస్వాదించడం, ఆహార్యం ధరించడం ఆయా ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన వస్తువులు ఒకటో, రెండో కొని వాటితో మన ఇల్లును ఎంతో  కళాత్మకంగా తీర్చిదిద్దుకోవడంలోని సంతోషం, మనసు కలతపడిన వేళ ప్రయాణాల పదనిసల ప్రమోదాలను మనోనేత్రం ముందు ఆవిష్కరించుకుంటూ తెప్పరిల్లడంలోని ఆనందం ముందు భౌతిక సంపదలు దిగదుడుపే. స్వానుభవమైతే తప్పా, అర్థంగాని ఆహ్లాదాలు విహార యాత్రలు.ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ పర్యాటక దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ రోజున పర్యాటక ప్రదేశాల  విశిష్టత  గురించి వాటి అభివృద్ధి గురించి తెలియజేయడం జాతీయ పర్యాటక దినోత్సవ ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో పర్యాటకం గురించిన ప్రత్యేక కథనం..

భారతదేశంలో మొదటిసారిగా జాతీయ పర్యాటక దినోత్సవాన్ని 1948లో జరుపుకున్నారు. భారతదేశంలో ఆర్థిక వృద్ధిని పెంచడానికి దోహదపడే రంగాల్లో ఒకటైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ రోజున దేశంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలను వాటి సాంస్కృతిక ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి దేశంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దేశంలో టూరిజం ప్రచారం, అభివృద్ధిని పర్యాటక మంత్రిత్వ శాఖ చూసుకుంటుంది. దేశ ఆర్థికాభివృద్ధికి టూరిజం కీలకం కాబట్టి, కేంద్ర, రాష్ట్ర, ప్రజా స్థాయిలలో పర్యాటకాన్ని మెరుగుపరచడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుంది.

మన దేశంలో ఎన్ని రకాలుగా సందర్శనలు చేయవచ్చో, అందులో ముఖ్యంగా   ఏయే ప్రదేశాలు చూడవచ్చో మనం  పరిశీలిస్తే, పర్యాటకం సాధారణంగా ఈ నవ ప్రయోజనాల్లో ఏదో ఒక అవసరం కోసం జరగొచ్చు. 1.ఆహ్లాదం, 2.పర్యావరణం, 3.చారిత్రకం, 4.కళాత్మకం, 5. సంస్కృతికం, 6.సాహసం, 7.ఆరోగ్యం, 8.ఆధ్యాత్మికం, 9.విద్య & వైజ్ఞానికం వంటి ఈ నవ నవీన మార్గాల్లో ఎవరైనా తమ ప్రయాణాలను నిర్ణయించుకోవచ్చు. భిన్న సంస్కృతుల సమాహారమైన భారత ఉపఖండాన్ని దర్శిస్తే, దాదాపు ప్రపంచమంతా పర్యటించిన భావన కలుగుతుందనడంలో  నిస్సందేహం లేదు. మన భారతదేశంలో ఉన్న అనేక వైవిధ్యభరితమైన పురాతన కట్టడాలు, జలపాతాలు, సముద్ర తీరాలు, కీకారణ్యాలు, మ్యూజియంలు, విద్యుత్‌ ప్రాజెక్టులు, ఎడారులు, అభయారణ్యాలు అన్నీ వింతలే!

 వివిధ చారిత్రక ప్రదేశాలను సందర్శించడం,  విహార యాత్రలు చేయడం వల్ల విజ్ఞానం,వినోదంతో పాటుగా లోక జ్ఞానం పెరుగుతుంది.  పర్యాటక యాత్రల వలన జాతీయ సమైక్యత మరియు వ్యక్తిత్వ వికాసం కలుగుతుంది. చారిత్రక ప్రదేశాల కట్టడాలు ఆనాటి నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం సందర్శకులను ఆలోచింపచేస్తుంది. ఆ కాలంలో నిర్మించిన దేవాలయలన్నీ కూడా ఎత్తయిన శిఖరాలపై నిర్మించడం జరిగింది. వీటి నిర్మాణం అంత తేలికైన విషయం కాదు.  ఎందుకంటే ఆ రోజుల్లో భారీ బరువులను ఎత్తే యంత్రాలు లేకున్నా నేటికీ చెక్కుచెదరకుండా నిర్మించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.  

ప్రపంచ పర్యాటకులను 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలతో సుందర భారతావని ఏడాది పొడుగునా ఆకర్షిస్తుంది. అంతేగాక, ఆదాయంలోనూ ప్రపంచపటంలో ”గ్లోబల్‌ హబ్‌” గానూ కీర్తింపబడుతోంది. వరల్డ్ ట్రావెల్‌ అండ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌ (TTDI) సూచిక ప్రకారం అంతర్జాతీయంగా ఉన్న 119 దేశాల్లో మన దేశం 39వ స్థానంలో ఉంది.

దేశంలో పర్యాటకాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అటు జాతీయ స్థాయిలోనూ, ఇటు రాష్ట్రాల స్థాయిలోనూ రాష్ట్ర ప్రభుత్వాలు  ఆకర్షణీయమైన వివిధ స్కీమ్‌లను, కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.‘స్వదేశీ దర్శనం స్కీమ్‌’ పేరిట 2024లో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ దేశంలోని 52 ప్రాంతాలలో రూ. 1400 కోట్లను ఖర్చు పెట్టింది. ‘సాధీ’ అంటూ హోటల్‌ వ్యాపారస్థులతో భాగస్వామ్యం కట్టింది. ‘దేఖో అపనాదేశ్‌’ అంటూ 71 లైట్‌హౌస్‌లను అభివృద్ధి చేసింది. ఐదు లక్షల మంది విదేశీయులకు ‘గోల్డెన్‌ వీసా’ ఇచ్చింది.

భారతీయ రైల్వేలు సైతం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ పేరిట అనేక సందర్భాలలో పర్యాటకుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయి. ఉదా : భారత్‌ గౌరవ్‌ పేరిట ప్రత్యేక సందర్భాలలో, ఆయా ప్రాంతాల్లో 600-700 సీట్ల పరిమితితో ఆహారం, వసతి, స్థానిక పర్యటనకు ప్రయాణ సౌకర్యాలన్నీ కలిపి ఒక ప్యాకేజీగా అందిస్తున్నాయి. ప్రయాణీకుడు ఒక్కసారి టిక్కెట్‌ వెల చెల్లిస్తే చాలు, అంతా భారత్‌ గౌరవ్‌ బృందం చూసుకుంటుంది. ఇందులో ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఉండటం కూడా విశేషం. బుద్ధిస్ట్‌ సర్య్సూట్‌ కూడా ఇదే కోవలోకి వస్తాయి.

ఎయిర్‌ ప్యాకేజీ, ల్యాండ్‌ ప్యాకేజీ, రైల్‌ టూర్‌ ప్యాకేజీలు, ఎలా ఎప్పుడు కావాలంటే అప్పుడు.. అంటే సెలవులు, ప్రత్యేక సంబరాలు, పర్యాటకుల బడ్జెట్‌కు అనుగుణంగా ఉంటాయి. సర్క్యులర్‌ ట్రైన్‌ టికెట్‌ విధానంలో ప్రయాణీకులు నిర్దేశిత మార్గంలో ఒకేసారి టికెట్‌ కొనుక్కొని, ఆయా ప్రాంతాలలో స్వంత ఖర్చుతో వసతి, భోజనం, ప్రాంతీయ రవాణా, ఎన్ని రోజులుండాలో తనే నిర్దేశించుకుని ఒక్కసారిగా రిజర్వేషన్‌ చేసుకుని, ప్రయాణాలు చేయవచ్చు. ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ప్రయాణం ఆరంభించిన ప్రాంతం నుండే సవ్యదిశలో కొనసాగి, మరలా ఒక వృత్తంలో తిరిగి రావడం వలన సర్క్యులర్‌ ప్రయాణంగా భావిస్తారు.

యూత్‌ హాస్టల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా :

ఇవి ప్రధానంగా వసతి కలగజేయడంతో పాటుగా జాతీయ, రాష్ట్ర స్థాయి, వారాంతం కార్యక్రమాల రూపకల్పన చేసి.. తమ సభ్యులను క్షేమంగా ఆయా ప్రాంతాలను దగ్గరుండి  సందర్శనం చేయిస్తారు. అయితే సభ్యత్వం తప్పనిసరి. సంవత్సరానికి ఒకసారి / జీవితకాల సభ్యత్వం ఎలా తీసుకోవడం అన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.


వెల్‌నెస్‌ టూరిజం :

ఆరోగ్యమే మహాభాగ్యం అక్షరాలా నిజమేగాక, ఆరోగ్యవంతులైన మానవులే ఎంతైనా పర్యటన చేయగలరు. కొండలు ఎక్కాలంటే గుండె ఆరోగ్యంగా ఉండాలి. అడవుల్లో నడవాలంటే శరీరం తేలికగా ఉండాలి. సముద్ర తీరాన విహరించాలంటే ఊపిరితిత్తులు బలంగా ఉండాలి. అమరనాథ్‌లాంటి ప్రాంతాల ప్రయాణాలు చేయాలంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలి. మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా? ఇవి వ్యక్తిగత జీవన విధానంపై ఆధారపడి ఉంటుంది.

రోజులు పెరిగితే పెద్దవాళ్లవుతారు. అదే రీతిగా మానవ శరీరంలో అవయవాల పని కూడా క్రమంగా పెరుగుతూ, ఆయుర్దాయం తరిగే దిశగా పనిచేస్తాయి. వయస్సు పెరుగుతుందని అనుకుంటాము.. కానీ ఆయుష్షు తరుగుతుందని అనుకోము. అందుకే ఆరోగ్యాన్ని మరింత మెరుగు పరచుకుని, ఆ దిశగా ప్రయత్నాలు చేయడం యాత్రీకులకు మరీ మంచిది. ఈ వెల్‌నెస్‌ టూరిజంలో యాత్రికులు తమ బడ్జెట్‌కు అనుగుణంగా ఆరోగ్యాభివృద్ధి సాధించుకోవడమేగాక మంచి ఆరోగ్యాన్నిచ్చే ఆహారం తీసుకోవడం; మానసిక ప్రశాంతతనిచ్చే వాతావరణంలో తమను తాము అంత:కరణం చేసుకోవచ్చు. సృజనకారులకైతే అభినవ స్వర్గమే.. మనస్సుకు రెక్కలు తొడిగి, తాము ఎంచుకున్న రంగంలో తమదైన శైలిలో కొన్ని మైలురాళ్లను ఏర్పరచుకోవచ్చు.

పర్యాటక శాఖకు 2024 దేశ బడ్జెట్‌లో రూ. 2,449.62 కోట్లు కేటాయింపులు జరిగినా, నిజానికి మరింత కేటాయింపులు జరగాలి. కారణం ఖర్చు పెట్టే రూపాయల కన్నా, ఆదాయం అధికంగా వచ్చే రంగమేగాక ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా లెక్కకు మిక్కిలి ఉన్న రంగమిది. ఉదాహరణకు..

1. వసతి:

వసతి సౌకర్యాల వలన, కేంద్ర-రాష్ట్ర, స్థానిక సంస్థలకు, హోటళ్లు గెస్ట్‌హౌస్‌లు, సత్రాలు, రిటైనింగ్‌ రూమ్‌లు, ఇళ్లల్లో ఆతిధ్యం ఇచ్చే హోమ్‌ స్టేల వలన నిరంతర ఆదాయం.

2. ఆహారం :

ప్రపంచంలో మానవజాతి ఉన్నంతకాలం కచ్చితమైన ఉపాధి లభించే అవకాశాలున్నది కేవలం ఆహార సంబంధిత రంగమే. పాశ్చాత్యమా? ప్రాంతీయమా? అన్న ఎంపిక ఉంటుంది. కానీ ప్రాణాలు నిలబెట్టే ఆహారం మనిషి ప్రాథమిక అవసరం. అందుకే స్థానిక ఆహారం, సాంప్రదాయ వంటల తయారీ వెరసి, వంట ఎక్కడ చేసినా, కాసుల పంట మాత్రం గ్యారంటీ.

3. రవాణా సౌకర్యాలు :

చదువుతో సంబంధం లేకుండా సాంకేతిక నైపుణ్యంతో రకరకాల రవాణా వాహనాలు నడుపుతూ స్థానికులు జీవనోపాధిని కల్పించుకునే అవకాశాలు పుష్కలం. (ప్రభుత్వ వ్యవస్థలు ఎన్ని ఉన్నా సమాంతరంగా ఆదాయ వనరులు సమకూర్చుకునే అవకాశమున్న రంగం.)


4. చరిత్ర :

పుస్తకాలలో, అక్షర మాధ్యమాల ద్వారా చరిత్ర తెలుసుకోవడం నాణేనికి ఒక కోణం కాగా, వెళ్లిన ప్రాంతంలో సమయం వృధా గాకుండా, ఏది ఎక్కడ ఉందో, ఆ ప్రాంత విశిష్టతను వివరించే గైడ్స్‌ వలన ప్రయాణం మరింత ఫలవంతమవుతుంది.

5. కళాత్మక ఖండాలు :

స్థానిక వనరులు, సాంకేతిక నైపుణ్యం కలగలసి, ప్రతి ప్రాంతంలోనూ రకరకాల వస్తువులు ఉత్పత్తవుతాయి. ఇవి కాటేజీలు లేదా కుటీర పరిశ్రమలుగా వర్ధిల్లుతాయి. సొసైటీల ద్వారా వృత్తిదారులను సంఘటితం చేస్తాయి. తమ కష్టానికి తగిన ప్రతిఫలం పొందే రీతిగా ఉండటమేగాక కొనుగోలుదారులకు, తాము ఉంచబడిన ప్రాంతానికి నిండుదనమిస్తాయి.

 ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి పర్యాటకులు మన దేశంలోని టూరిస్ట్ ప్లేస్లను  సందర్శిస్తున్నారు. జాతీయ ఆదాయం పెరగటానికి దోహదం చేస్తున్న టూరిజం, పర్యాటక ప్రదేశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలకు కూడా ఉంది. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com