జాతీయ ఓటర్ల దినోత్సవం..!!

- January 25, 2025 , by Maagulf
జాతీయ ఓటర్ల దినోత్సవం..!!

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం జాతీయ ఓటర్ల దినోత్సవం ఏటా జరుపుతోంది.నమోదు చేసుకున్న ఓటర్లందరూ పోలింగ్‌లో పాల్గొనేలా చేయడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం.మన దేశంలో ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నారు.ఈ నేపథ్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం గురించిన ప్రత్యేక కథనం..

దేశంలో యువతీ, యువకులు ఓటర్లుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించేందుకు 2011లో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రవేశపెట్టారు. చాలా మంది అర్హత గల యువత ఓటర్లుగా నమోదు చేసుకోవడం లేదని అప్పటి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ సమస్యను అధిగమించేందుకు చొరవ చూపింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం.. యువతను ఓటర్లుగా నమోదు చేయించడం, వారికి ఓటర్ గుర్తింపు కార్డులు(EPIC) మంజూరు చేయడంపై దృష్టి పెట్టింది.

ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అమలులోకి వచ్చిన రోజును ఒక ప్రత్యేక దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. దానికి జాతీయ ఓటర్ల దినోత్సవంగా నామకరణం చేసింది. జనవరి 25న ఈ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే 1950 జనవరి 25వ తేదీనే ఎన్నికల సంఘం ఏర్పాటైంది.

ఓటుకు ఎంత పవర్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పౌరుల ఓట్లు మాత్రమే స్థానిక, ప్రాంతీయ, జాతీయ స్థాయిలో ఎవరు అధికారాన్ని చేపట్టాలో నిర్ణయిస్తాయి. తద్వారా దేశం విధానాలు, దిశను నిర్దేశిస్తాయి. కాలానుగుణంగా దేశ జనాభా యొక్క అవసరాలు, ఆకాంక్షలు మారుతున్నందున, దేశ భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దడంలో యువత ఓటింగ్ మరింత ముఖ్యంగా మారింది. అందుకే యువతరం ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేలా, దేశ నిర్మాణంలో భాగస్వాములు అయ్యేలా ప్రోత్సహించాలి. అందుకు నేషనల్ ఓటర్స్ డే జరుపుకోవడం ఎంతో ముఖ్యం.

జాతీయ ఓటరు దినోత్సవం అనేది ఓటు ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి, ఎన్నికల్లో ఎక్కువ మంది వ్యక్తులను, ముఖ్యంగా కొత్తగా అర్హులైన ఓటర్లను పాల్గొనేలా ప్రోత్సహించడానికి జరుపుకునే రోజు. తమ నాయకులను ఎన్నుకోవడానికి, తమ దేశం ఎలా నడుస్తుందో చెప్పడానికి ఓటింగ్ ఒక ముఖ్యమైన మార్గం. ఇది ప్రజాస్వామ్య సమాజంలో స్వేచ్చ, స్వాతంత్ర భావనను సృష్టించడానికి కూడా సహాయపడుతుంది. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 2011 నుంచి నిర్వహించడం ద్వారా, తప్పకుండా ఓటు వేయాలనే భావనను ప్రజలలో కలిగించడం చాలా వరకు సాధ్యమైందని చెప్పొచ్చు.

ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన వివరాల ప్రకారం దేశంలో ఓటర్ల సంఖ్య పెరిగింది.గత ఏడాది జరిగిన లోక్‌ సభ ఎన్నికల సమయానికి 96.88 కోట్ల మంది ఓటర్లు ఉండేవారు.ఈ సంఖ్య ప్రస్తుతం 99.1 కోట్లకు పెరిగింది.18-29 సంవత్సరాల మధ్య వయస్కులు 21.7 కోట్ల మంది ఉన్నారు.స్త్రీ, పురుష నిష్పత్తి 2024లో 948 ఉండేది.ప్రస్తుతం ఇది 954కు పెరిగింది. ఈ నిష్పత్తి 2019లో 928 కాగా, 2024నాటికి 948కి పెరిగింది.లోక్‌సభ ఎన్నికల సమయానికి 48,044 మంది థర్డ్‌ జెండర్‌ వ్యక్తులు ఓటర్లుగా నమోదయ్యారు.మొత్తం ఓటర్లలో 47.15 కోట్ల మంది మహిళలు, 49.72 కోట్ల మంది పురుషులు ఉండేవారు.

18 ఏళ్లు నిండిన భారతీయులు ఎవరైనా ఎన్నికల సంఘంలో నమోదు చేసుకున్న తర్వాత ఎన్నికల ప్రక్రియలో పాల్గొనవచ్చు.సాధారణ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ద్వారా ఓటరు గుర్తింపు కార్డును పొందవచ్చు. పోలింగ్ బూత్ల వద్ద ప్రజలు తమ ఓటర్ ఐడీ కార్డులను చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.ఈ రోజున ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఉన్న 613 జిల్లాల్లోని 3,464 పైగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియపై పౌరులకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలను చేపడుతుంది.  

అలాగే మొదటిసారి ఓటర్‌గా నమోదు చేసుకునే వారికి సహాయం చేయడం, నూతన ఓటర్ గుర్తింపు కార్డులు అందించడం వంటి పనులు అధికారులు ఇవాళ చేస్తుంటారు. ఓటింగ్ ప్రాముఖ్యత తెలియజేసేలా బహిరంగ ర్యాలీలు, చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఓటింగ్ ప్రక్రియ, ఓటు ప్రభావం గురించి అవగాహన కల్పించే ప్రచారాలు చేస్తుంటారు.

--డి.వి.అరవింద్(మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com