రైతు జన బాంధవుడు-గొట్టిపాటి
- January 25, 2025
గొట్టిపాటి కొండపనాయుడు...రాజకీయాల్లో విలువలకు మారుపేరుగా నిలిచిన నాయకుడు. రైతాంగ ప్రయోజనాలే ఆయన్ని క్రియాశీలక రాజకీయాల్లోకి నడిపించాయి.పార్టీలకతీతంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో రాజకీయ ఉద్దండులకు సాధ్యం కాని అశేషమైన ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలే లక్ష్యంగా తుదిశ్వాస వరకు పనిచేశారు.నేడు రైతు జన బాంధవుడు గొట్టిపాటి కొండపనాయుడు 23 వ వర్ధంతి.
గొట్టిపాటి కొండపనాయుడు 1937న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని అవిభక్త నెల్లూరు జిల్లా కావలి తాలూకా చింతలపాలెం గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. మహాత్మా గాంధీ, ఆచార్య ఎన్.జి.రంగా గార్ల స్పూర్తితో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన రైతు నాయకుడిగా ఎదిగారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1956లో గట్టుపల్లి చింతలపాలెం గ్రామ పంచాయితీకి తొలిసారి సర్పంచిగా ఎన్నికయ్యారు.
అదే పంచాయితీకి 1959,1964,1970లలో సైతం వరుసగా ఎన్నికయ్యారు. 1959-64 మధ్యలో రెండు సార్లు చినక్రాక సమితికి, 1964-72 వరకు వింజమూరు సమితికి రెండు సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. 1956-59 మధ్య కాలంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సమితి సభ్యుడిగా కొనసాగారు. వింజమూరు సమితి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 1964-70 వరకు నెల్లూరు జిల్లా పరిషత్తు ఉపాధ్యక్షునిగా పనిచేశారు.1966-76 వరకు కావలి భూ తనఖా బ్యాంకు అధ్యక్షుడిగ, 1976-77 మధ్యలో కావలి సూపర్ బజార్ చైర్మన్‌గా పనిచేశారు.
సర్పంచిగా, సమితి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. మాజీ మంత్రులైన ఎసి సుబ్బారెడ్డి, నల్లమోతు చెంచు రామానాయుడు, ఆనం సంజీవ రెడ్డిలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. నాటి ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మెట్ట సీమ నుంచి గంగవరపు తిరుపతి నాయుడు తర్వాత అత్యంత బలమైన నాయకుడిగా గొట్టిపాటి ఎదిగారు. జిల్లా రాజకీయ పెద్దల సహకారంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
1967 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కావలి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నించినా టిక్కెట్ దక్కకపోవడంతో వెనక్కి తగ్గని ఆయన తనకు అనుకూలుడైన గొట్టిపాటి సుబ్బానాయుడుకు టిక్కెట్ ఇప్పించి గెలుపంచుకున్నారు. 1972లో సైతం జిల్లా కాంగ్రెస్ పెద్దలు మొండిచేయి చూపడంతో కావలి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సంచలన విజయం సాధించారు. కావలి రాజకీయ చరిత్రలో ఆయన ముందు, తర్వాత కానీ ఎవరు స్వతంత్ర అభ్యర్థిగా గెలవకపోవడం గమనార్హం. 1972-78 వరకు కావలి ఎమ్యెల్యేగా కొనసాగిన ఆయన అసెంబ్లీలో రైతు సమస్యలపై గళం విప్పేవారు.
1978 ఎన్నికల్లో తన సన్నిహితుల సూచనల మేరకు జనతా పార్టీలో చేరారు. నాటి జిల్లా జనతాపార్టీ అధ్యక్షుడైన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (తెదేపా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి) ఆయన్ని కావలి నుంచి పోటీ చేయమని కోరడంతో జనతా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి తన మిత్రుడైన కాంగ్రెస్ అభ్యర్థి కలికి యానాది రెడ్డి చేతిలో స్వల్పమైన ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే, ఆయన సహకారంతో ఉదయగిరి నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకయ్య నాయుడు విజయం సాధించారు. వెంకయ్య భావి రాజకీయ జీవితానికి బాటలు పరిచిన వ్యక్తుల్లో కొండపనాయుడు ముఖ్యులు.
జనతాపార్టీలో ఓటమి తర్వాత రాజకీయాల నుంచి విరమణ పొందాలనుకున్నా! ఆయన అనుచరులు, అభిమానులు ఒత్తిడి మేరకు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. 1982లో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించిన తర్వాత ఆ పార్టీలోకి రమ్మని మాజీ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ సమక్షంలో ఆయన చేరారు. 1983 ఎన్నికల్లో కావలి టిక్కెట్ వస్తుందని ఆయన అభిమానులు భావిస్తున్న తరుణంలో వేరే అభ్యర్థిగా వచ్చినప్పటికి పార్టీ అభ్యర్థి గెలుపుకు సహకరించారు.
1985,1989,1994లలో సైతం జిల్లా తెదేపా నాయకుల సహాయ నిరాకరణ వల్ల ఆయన టిక్కెట్ దక్కించుకొ లేకపోయారు. 1994 ఎన్నికల్లో సైతం టిక్కెట్ రాకపోవడంతో రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి 20,000 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.1999లో జిల్లా నాయకుల అభ్యర్థన మేరకు పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసి గెలిపించారు. సుమారు 18 ఏళ్ళ పాటు తెదేపాలో కొనసాగిన ఆయనకు ఉన్న సామర్థ్యానికి తగ్గ పదవులు ఇవ్వడంలో తెదేపా పూర్తిగా వైఫల్యం చెందిందనేది కావలి ప్రజలు మరియు ఆయన అభిమానుల అభిప్రాయం. ఆయన బ్రతికున్నంత కాలం కావలి, ఉదయగిరి రాజకీయాల్లో చక్రం తిప్పుతూనే వచ్చారు.
నెల్లూరు మెట్ట సీమ రాజకీయాల్లో ఆత్మకూరు రాజకీయ బీష్ముడైన గంగవరపు తిరపతి నాయుడు, రైతు నాయకుడు మాదాల తిమ్మయ్య నాయుడు, మాజీ ఎమ్యెల్యేలైన కంచర్ల శ్రీహరి నాయుడు, జి.సి.కొండయ్య, ధనేకుల నరసింహం,పెళ్లకూరు రామచంద్రారెడ్డి, నువ్వుల వెంకటరత్నం నాయుడు, మాజీ మంత్రులు కలికి యానాది రెడ్డి, మాదాల జానకీ రామ్‌లు గొట్టిపాటి కొండపనాయుడు గారికి సమకాలీకులు. వీరందరితో కలిసి ఆయన మెట్ట సీమ రైతాంగం కోసం పనిచేశారు.
కావలి, ఉదయగిరి ప్రాంత మెట్ట రైతుల సమస్యల పరిష్కారానికి కొండపనాయుడు తుదిశ్వాస వరకు కృషి చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి స్వర్గీయ నల్లమోతు చెంచు రామానాయుడు గారి సహకారంతో ఆ ప్రాంత సాగు, త్రాగు నీటి వనరుల అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల కల్పనకు విశేషంగా కృషి చేశారు. ఈ ప్రాంత రైతాంగం యొక్క నీటి ఇక్కట్లను తీర్చేందుకు సోమశిల ఉత్తర కాలువ సాధన కోసం అనేక పోరాటాలు చేసి సాధించారు. ఈరోజు ఉత్తర కాలువ క్రింద కావలి, ఉదయగిరి, కందుకూరు(పాక్షికం) నియోజకవర్గాల్లో ఉన్న వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతున్నాయి.
గొట్టిపాటి గొప్ప రచయిత కూడా! ఆయన "మనం-మనదేశం", "ఆంధ్రప్రదేశ్ దర్శిని", "దేశ దర్శిని", "నెల్లూరు దర్శిని", "నవ్యాంధ్ర" వంటి పలు రచనలు కూడా చేశారు.ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయం సభ్యుడిగా ఉన్న సమయంలో తమ ప్రాంతంలోని పలు గ్రామాల్లో గ్రామ స్థాయి గ్రంథాలయాలను ఏర్పాటు చేయించారు. రాష్ట్ర గ్రంథాలయ ఉద్యమంలో సైతం భాగస్వామి అయ్యారు.
సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నప్పటికి తనని నమ్ముకున్న అభిమానులను మాత్రం కంటికి రెప్పలా చూసుకునేవారు. ఆయనకు రాజకీయంగా పెద్ద పెద్ద పదవులు లేకున్నా ఏళ్ళ తరబడి ఆయన్న కనిపెట్టుకొని ఉండేవారు తప్ప ఏనాడూ గొట్టిపాటిని వీడి వెళ్ళిన దాఖలాలు లేవు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాష్ట్ర నాయకులకు సైతం సొంతం కాని అశేషమైన జనబలం ఆయనకు ఉండేది. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆయన్ని ఎంతో గౌరవించేవారు.
గొట్టిపాటి తుది వరకు నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. ఎటువంటి హంగు, ఆర్భాటాలు లేకుండా ఎడ్లబండ్లపై, సైకిల్రిక్షాలపై, అనుచరుల ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ కావలి నియోజకవర్గ ప్రజలతో మమేకం అయ్యేవారు. సమితి అధ్యక్షుడిగా సమయంలో తన సొంత నిధులతో పలు గ్రామాల్లో వైద్యశాల, వసతిగృహాలు, రోడ్ల అభివృద్ధి, పశువైద్యశాలలను ఏర్పాటు చేశారు.
రాజకీయ పయనంలో సొంత ఆస్తులు కరగతీసుకున్నారే తప్ప సంపాదించిందేమీ లేదు. తన వారసులను రాజకీయాలకు దూరంగా ఉంచడం ద్వారా గొట్టిపాటి స్వార్థ రాజకీయాలకు దూరంగా నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలిచారు. నిష్కళంక ప్రజా నాయకుడిగా రైతాంగ సంక్షేమమే తన జీవిత లక్ష్యంగా బ్రతికిన గొట్టిపాటి కొండపనాయుడు 2002,జనవరి 25న న్యుమోనియా కారణంగా తన 75వ ఏట తుదిశ్వాస విడిచారు. సోమశిల ఉత్తర కాలువ కోసం ఆయన చేసిన కృషి గుర్తిస్తూ గొట్టిపాటి కొండపనాయుడు ఉత్తర కాలువగా ప్రభుత్వం నామకరణం చేసింది.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!







