వైద్య శిఖరం-డాక్టర్ కాకర్ల
- January 25, 2025
కాకర్ల సుబ్బారావు..తెలుగునాట తొలితరం వైద్యుల్లో ఆయన ప్రముఖుడు. సాధారణ ఆసుపత్రిగా ఉన్న ‘నిమ్స్’ను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కృషి మరువలేనిది. భారతదేశంలో రేడియాలజీ రంగం అభివృద్ధికి కృషి చేశారు. ఎందరో యువ వైద్యులను తన మార్గదర్శనంలో తీర్చిదిద్దిన వైద్య దిగ్గజం డాక్టర్ కాకర్ల. నేడు భారతీయ వైద్య శిఖరం పద్మశ్రీ డాక్టర్ కాకర్ల సుబ్బారావు జయంతి.ఈ సందర్భంగా ఆయన జీవన ప్రస్థానం మీద ప్రత్యేక కథనం...
డాక్టర్ కాకర్ల సుబ్బారావు 1925, జనవరి 25న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని అవిభక్త కృష్ణా జిల్లా మొవ్వ తాలూకా పెదముత్తేవిలోని సంపన్న రైతు కుటుంబానికి చెందిన కాకర్ల వెంకటరత్నం, మాణిక్యమ్మ దంపతులకు జన్మించారు. పెదముత్తేవి, చల్లపల్లిలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి మచిలీపట్నం హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్లో చేరారు. మంచి మార్కులతో ఇంటర్మీడియ్ట్ పూర్తి చేసిన తర్వాత ఇంజనీరింగ్ చదవాలన్న ఆకాంక్షతో చెన్నైలోని గిండి కాలేజీకి దరఖాస్తు చేశారు. అప్పుడే మెడిసిన్‌కూ దరఖాస్తు చేసిన ఆయనకు ఆంధ్రా మెడికల్ కాలేజీలో సీటొచ్చింది. మిత్రుడు పద్మనాభయ్య ఆర్థిక సాయంతో 1946లో వైద్యవిద్యలో చేరారు.
1951లో విశాఖ కింగ్‌జార్జి ఆస్పత్రిలో హౌస్ సర్జన్సీ పూర్తి చేసిన తర్వాత వైద్య రంగంలో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆకాంక్షతో అదే ఏడాది అమెరికా వెళ్లిన సుబ్బారావు అక్కడి బ్రాంక్స్ ఆస్పత్రిలో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ, న్యూయార్క్ వర్సిటీలో రేడియాలజీలో ఎంఎస్ పూర్తి చేశారు.ఎయిమ్స్‌లో అవకాశం కల్పిస్తానని నాటి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అమృత్‌కౌర్ హామీ ఇవ్వడంతో 1956లో స్వదేశానికి తిరిగొచ్చారు. కానీ, అప్పటి రాజకీయ పరిస్థితుల వల్ల ఆమె పదవి కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలో సుబ్బారావు హైదరాబాద్ వచ్చారు.
నిజాం ప్రభుత్వ మాజీ పాలనాధికారి మెహదీ నవాజ్‌జంగ్ సహకారంతో రూపాయి గౌరవ వేతనంతో ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రిలో రేడియాలజిస్టుగా చేరారు. అదే ఏడాది ఉస్మానియా మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపికయ్యారు. ఐదేళ్లలోనే ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. 1969 వరకు ఆచార్యుడిగా సేవలందించారు. 1969లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో జరిగిన ఘర్షణ కారణంగా మరుసటి ఏడాదే అమెరికా వెళ్లారు. అంతకు ముందే ఫెలో ఆఫ్ అమెరికన్ కాలేజీ ఆఫ్ రేడియాలజీ, ఫెలో ఆఫ్ రాయల్ కాలేజీ ఆఫ్ రేడియాలజీ పట్టాలు అందుకున్నారు.
తెలుగు నాట ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆస్పత్రి నిర్మించాలనే ఆశయంతో కాకర్ల సుబ్బారావును నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్వదేశానికి ఆహ్వానించారు. అలా అమెరికా నుంచి తిరిగొచ్చిన ఆయన 1985 డిసెంబరు 2న నిమ్స్ తొలి డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఎముకల దవాఖానగా పేరుబడ్డ నిజాం ఆస్పత్రిని కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దారు.
నిమ్స్‌కు అధునాతన వైద్య పరికరాలను సమకూర్చారు. ఆనాటి రాజకీయ పరిణామాల కారణంగా 1991లో డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అప్పుడు కొంతకాలం మెడ్విన్ ఆస్పత్రి చైర్మన్‌గా వ్యవహరించారు. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి పాలకమండలి చైర్మన్‌గానూ పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యసలహాదారుడిగా సేవలందించారు. 1997 మే 9న మళ్లీ నిమ్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కాకర్ల 2004 వరకూ కొనసాగారు.
కాకర్ల చల్లపల్లి హైస్కూల్లో చదువుతున్న సమయం లో గాంధీజీ అక్కడికి వచ్చారు. అదే స్ఫూర్తితో ఆయన ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు చండ్ర రాజేశ్వరరావు సాయంకాలం పాఠాలు చెప్పేవారు. తనలో కమ్యూనిస్టు భావజాలానికి చండ్ర పాఠాలే కారణమని కాకర్ల చెప్పేవారు. విశాఖలో చదువుతున్న సమయంలో సామ్యవాద భావజాలం పట్ల ఆకర్షితులై లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆయనకు ఇష్టమైన నాయకుడు.సుబ్బారావుకు సతీమణి లక్ష్మి, కుమార్తెలు సబిత, అమిత, కుమారుడు శుశ్రుత్ ఉన్నారు. అయన కుటుంబంలో 11 మంది మంది డాక్టర్లు ఉన్నారు.
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో కాకర్ల సుబ్బారావుకు ఆత్మీయ అనుబంధం ఉంది. హైదరాబాద్ డీఆర్డీవోలో కలాం పనిచేస్తున్న సమయంలో ఒకసారి నిమ్స్‌ను సందర్శించారు. అప్పటి నుంచి వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు. కలాం తలకు గాయమైనప్పుడు కాకర్ల చికిత్స అందించారు.
కాకర్ల వారి మార్గదర్శనంలో ఎందరో యువ వైద్యులు నేడు ఇండియా, అమెరికాల్లో ప్రముఖ డాక్టర్స్‌గా గుర్తింపు పొందారు. వారిలో క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, హార్ట్ స్పెషలిస్టులైన కిమ్స్ హాస్పిటల్స్ అధినేత బొల్లినేని భాస్కరరావు, స్టార్ హాస్పిటల్స్ అధినేత మన్నం గోపిచంద్, AIG హాస్పిటల్స్ అధినేత డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి వంటి ఎందరో ప్రముఖులు ఆయన శిష్యులే.
వైద్యరంగంలో ఆయన చేసిన సేవలకు గానూ 2000లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి 2003లో డాక్టర్ ఆఫ్ సైన్సెస్ పట్టా పొందారు. రేడియాలజిస్టు ఆఫ్ మిలీనియం అవార్డుతో పాటు తెలుగు ఆత్మగౌరవ పురస్కారం, ఉత్తమ వైద్యుడు, జాతిరత్న, పరమశ్రీ, రాజీవ్ రత్న, సన్ ఆఫ్ ఇండియా, కుముదిని నాయక్ గోల్డ్‌మెడల్‌ను డాక్టర్ కాకర్ల అందుకున్నారు.
అమెరికాలో శుశ్రుత్ సొసైటీ ఆఫ్ రేడియాలజీ సంస్థ ద్వారా ఎంతో మంది భారతీయ వైద్య విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. అమెరికన్ బోర్డు ఆఫ్ రేడియాలజీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సలహాదారుడిగా వ్యవహరించారు. మెడికల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ జనరల్‌కు గౌరవ ఎడిటర్‌గా వ్యవహరించారు.
రేడియాలజీలో తన అనుభవాన్ని భావితరాలకు అందించాలనే సంకల్పంతో 2007లో రేడియోలాజికల్ అండ్ ఇమేజింగ్ ఎడ్యూకేషనల్ సైన్సెస్(క్రెస్టు)ను నెలకొల్పారు. తన తుదిశ్వాస వరకు నిమ్స్, కిమ్స్ వైద్యకళాశాలలో వారానికి రెండు రోజుల పాటు పాఠాలు బోధించారు. గతంలో బసవతారకం కేన్సర్ ఆస్సత్రికి ట్రస్టీగానూ ఉన్నారు. తన తండ్రి స్ఫూర్తితో 1993లోనే షేక్‌పేట్ వద్ద ఇంటర్నేషనల్ స్కూల్‌ను ప్రారంభించారు.
విద్య, వైద్య రంగాల్లో విశిష్ట సేవలందించిన కాకర్ల సుబ్బారావు సాహితీ ప్రియులు కూడా. శ్రీశ్రీ, జాషువా, గోపీచంద్, దాశరథి రచనలతో పాటు సమకాలీన సాహిత్యం, ముఖ్యంగా తెలంగాణ కథలను ఇష్టంగా చదివేవారు. 1977లో అమెరికాలోని తెలుగు వారందని కలుపుకొని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా)ను స్థాపించారు. ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడిగానూ సేవలందించారు.
వైద్య రంగంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతూ " ప్రస్తుతం అంతా కమర్షియలైజ్ అయిపోయింది. పబ్లిక్ హెల్త్ సెక్టార్ మీద గవర్నమెంట్‌కు కూడా ప్రయార్టీ లేదు. టీచింగ్ హాస్పిటల్స్ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇండివిడ్యువల్‌గా చూస్తే పేషెంట్, డాక్టర్ రిలేషన్షిప్ ఏమాత్రం లేకుండా పోయింది.అందరికీ యూనివర్సల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇవ్వాలి. క్యాష్ లేకుండా హాస్పిటల్‌కు వెళ్లాలి. మరి ఇన్స్యూరెన్స్‌కు డబ్బెలా? అంటే ప్రతి ఒక్కరు జీతంలో ఐదు శాతం, పదిశాతం ఇన్స్యూరెన్స్‌కు కట్టాలి. పదివేలు జీతం ఉన్న వాడు ఐదొందలో, వేయి రూపాయలో కట్టాలి. బీదవాళ్లకి ప్రభుత్వం భరించాలి. అదే నా ఆశ. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ బలోపేతం చేయాలి" అని పలు సందర్భాల్లో కాకర్ల పేర్కొన్నారు.
వైద్యరంగంలో 7 దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో విశేషమైన సేవలను అందించిన డాక్టర్ కాకర్ల 2021, ఏప్రిల్ 16 తన 97వ ఏట అనారోగ్యం కారణంగా హైదరాబాద్ నగరంలో కన్నుమూశారు. తన జీవితాన్ని గురించి చెబుతూ "I pass through this life only once, let me do the maximum good to the largest number of people." ఈ వాక్యాన్ని పలికారు. వైద్య ప్రపంచంలో ఎన్నో ఉన్నత ప్రమాణాలకు కారణభూతులైన డాక్టర్ కాకర్ల ఎల్లప్పుడూ యువ వైద్యులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తూనే ఉంటారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







