మాస్ మహారాజా-రవితేజ
- January 26, 2025
తెలుగు సినిమాల్లో హీరో అంటే రాముడు మంచి బాలుడిలాగా ఉండాలి, ప్రజలకి మంచి చేయాలి, అందరి కోసం బ్రతకాలి… అప్పుడే అతను హీరో అనే మాట ఉండేది ఒకప్పుడు కానీ హీరో అంటే ఇవేమి అవసరం లేదు.హీరో మన పక్కింటి కుర్రాడిలా ఉంటాడు, మనం మాట్లాడుకున్నట్లే మాట్లాడుతాడు అని నిరూపించిన హీరో రవితేజ. నేడు మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు.ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణం మీద అందిస్తున్న ప్రత్యేక కథనం...
మాస్ మహారాజా రవితేజ పూర్తి పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు.1968,జనవరి 26న ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో భూపతిరాజు రాజగోపాల్ రాజు, రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించారు.రవితేజ తండ్రి ఉద్యోగ రీత్యా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలు మారాల్సి వచ్చింది. దీంతో తెలుగుతో పాటు హిందీ భాషలో కూడా రవితేజకు పట్టుంది. జైపూర్, ఢిల్లీ, ముంబయి, భోపాల్ తర్వాత వీరి కుటుంబం విజయవాడలో సెటిల్ అయ్యింది. నటనపై మక్కువతో 1988లో రవితేజ మద్రాసు వెళ్లాడు.
సినిమా అవకాశాల కోసం చెన్నై వెళ్లిన రవితేజ.. ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. అదే గదిలో టాలీవుడ్ ప్రముఖ దర్శకులు వైవీఎస్ చౌదరి, గుణశేఖర్ ఉండేవారు. 'కర్తవ్యం', 'చైతన్య', 'ఆజ్ కా గూండా రాజ్' ('గ్యాంగ్ లీడర్' హిందీ రీమేక్)లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు రవితేజ. ఒక పక్క నటిస్తూనే మరో పక్క సహాయ దర్శకుడిగా, బుల్లితెరకూ పని చేసేవాడు. సహాయ దర్శకుడిగా బాలీవుడ్, టాలీవుడ్లో ఎన్నో ప్రాజెక్టులకు వర్క్ చేశాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'నిన్నే పెళ్లాడతా' సినిమాకూ సహాయ దర్శకుడిగా చేస్తూనే.. ఓ పాత్రలో నటించాడు.
1997లో తొలిసారి ఓ లీడ్ క్యారెక్టర్ చేసే అవకాశం 'సింధూరం' సినిమా ద్వారా వచ్చింది. ఆ తర్వాత అనేక సైడ్ పాత్రల్లోనూ నటించాడు రవితేజ. 1999లో రవితేజ ప్రధాన పాత్రలో శ్రీను వైట్ల దర్శకత్వంలో 'నీ కోసం' సినిమా రూపుదిద్దుకొంది. ఆ తర్వాత 'సముద్రం', 'అన్నయ్య', 'బడ్జెట్ పద్మనాభం', 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి', 'తిరుమల తిరుపతి వెంకటేశ', 'సకుటుంబ సపరివారసమేతం', 'అమ్మాయి కోసం' వంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
దర్శకుడు పూరీ జగన్నాథ్ రవితేజ హీరోగా చేసిన 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్ర విజయంతో రవితేజ కమర్షియల్ హీరోగా అవతరించాడు. అప్పటి నుంచి రవితేజ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. 'ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు' విమర్శకులను మెప్పించింది. ఆ తర్వాత 'ఇడియట్' సినిమాతో రవితేజ బాక్సాఫీసును బద్దలు కొట్టాడు. వీటి తర్వాత 'ఖడ్గం', 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి', 'వెంకీ' సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.
రవితేజ హీరోగా దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో 2006లో విడుదలైన 'విక్రమార్కుడు'.. ఆయన నటించిన సినిమాల్లో కెల్లా ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇది నిలిచింది. ఆ తర్వాత అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో నటించిన 'ఖతర్నాక్' సినిమా మెప్పించలేకపోయింది. 2007లో 'దుబాయ్ శీను', 2008లో 'కృష్ణ' కామెడీ టచ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు.
ఆ తర్వాత వచ్చిన 'నేనింతే', 'కిక్', 'ఆంజనేయులు', 'శంభో శివ శంభో', 'డాన్ శీను' సినిమాలతో ఫర్వాలేదనిపించాడు రవితేజ. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా 2011లో విడుదలైన చిత్రం 'మిరపకాయ్'. ఇది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో పాటు 'దొంగల ముఠా', 'వీర', 'నిప్పు', 'దేవుడు చేసిన మనుషులు', 'సారొచ్చారు' సినిమాలు అంతగా మెప్పించలేకపోయాయి. ఆ వెంటనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'బలుపు' సినిమాతో మరోసారి సక్సెస్ ను అందుకున్నారు రవితేజ. అనంతరం 'పవర్', 'కిక్ 2', 'బెంగాల్ టైగర్' వంటి చిత్రాలతో అలరించాడు.
ఓ ఏడాది విరామం తర్వాత 'టచ్ చేసి చూడు', 'రాజా ది గ్రేట్', 'అమర్ అక్బర్ ఆంటోనీ', 'డిస్కోరాజా' సినిమాల్లో మెప్పించారు. కరోనా మొదటి వేవ్ తర్వాత 'క్రాక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మాస్ మహరాజ్ పవరేంటో నిరూపించాడు. ఆ తర్వాత త్రినాధారావు నక్కినతో తీసిన ధమాకా చిత్రంతో 100 కోట్ల షేర్ అందుకున్నాడు. తాను అన్నగా భావించే చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో ఆయన తమ్ముడిగా నటించి మరీ మురపించాడు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం 'మాస్ జాతర' సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు సామాన్య ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సునీల్ హీరోగా రాజమౌళి రూపొందించిన ‘మర్యాద రామన్న’లో సైకిల్ కు రవితేజతో డబ్బింగ్ చెప్పించడం మరో విశేషం. రవితేజలోని వాయిస్ ను రాజమౌళి పసికట్టినట్టే, ఆయనలో ఓ గాయకుడూ దాగున్నాడని సంగీత దర్శకుడు థమన్ పట్టేశారు. ‘బలుపు’ చిత్రంలో తొలిసారి రవితేజ నోట “కాజల్ చెల్లివా…కరీనాకు కజినివా…” పాటను పలికించారు. ఆ తరువాత థమన్ స్వరకల్పనలోనే తెరకెక్కిన ‘పవర్’లో “నోటంకి నోటంకి…” పాట పాడి పరవశింప చేశాడు. ఆపై “రమ్ పమ్ బమ్…” అంటూ ‘డిస్కో రాజా’లో అదే థమన్ బాణీల్లోనే గానం చేసి మురిపించారు. చాలా రోజుల తరువాత రవితేజకు హిట్ గా నిలిచన ‘రాజా ది గ్రేట్’లోనూ చిత్ర దర్శకుడు పట్టు పట్టి రవితేజతో పాట పాడించారు. సాయికార్తీక్ సంగీతంలో రూపొందిన “రాజా ది గ్రేట్…” టైటిల్ సాంగ్ కూడా జనాన్ని కట్టిపడేసింది. ఇలా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటూ సాగుతున్నాడు.
కొత్త దర్శకులను, యంగ్ టాలెంట్‌ను రవితేజ బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. శ్రీనువైట్ల, గోపీ చంద్ మలినేని, బోయపాటి శ్రీను, బాబీ కొల్లి మరియు అనీల్ రావిపూడి వంటి దర్శకులతో రవితేజ పనిచేసి విజయవంతమైన సినిమాలను అందించారు.'నీ కోసం', 'ఖడ్గం' సినిమాలకు నంది స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని అందుకున్నారు రవితేజ. 'నేనింతే' చిత్రంలోని పాత్రకు ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని దక్కించుకున్నారు.
డబ్బులు పెట్టి టికెట్స్ కొని థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేయకుండా ఎంటర్టైన్ చేయడం రవితేజకి మాత్రమే చెల్లింది. తన సినిమా హిట్ అయినా ఇంకో సినిమా చేస్తాడు, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా చేస్తాడు. సినిమాలు చేయడం తప్ప రవితేజకి ఇంకో పని తెలియదు. అంత పిచ్చి సినిమాల్లో ఉండడం, సినిమాలు చేయడం అంటే… ఇన్నేళ్ల కెరీర్ ఎలాంటి వివాదాలు లేకుండా, ఎలాంటి కాంట్రవర్సీల్లో ఇరుక్కోకుండా క్లీన్ కెరీర్ ని మైంటైన్ చేస్తున్న రవితేజని ఫ్యాన్స్ "మాస్ మహారాజా" అని ప్రేమగా పిలుస్తూ ఉంటారు.
ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుంటే నిలబడలేరు అనే మాటని లెక్క చేయకుండా… లేనట్టి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కూడా స్టార్ హీరో అవ్వొచ్చు అని నిరూపించాడు రవితేజ. ఈరోజు ఇండస్ట్రీ లోకి ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వస్తున్న ప్రతి ఒక్కరి ఇన్స్పిరేషన్ రవితేజ. ఒక హీరోలా కాకుండా కామన్ పబ్లిక్ ఎలా మాట్లాడుకుంటారో… సినిమాలో కూడా అలానే రవితేజ డైలాగ్స్ చెప్తాడు.
రాముడు మంచి బాలుడు అనే మాటని పూర్తిగా పక్కన పడేసి, హీరో అంటే ఇలానే ఉండాలి అనే లెక్కలు ఏమీ లేవని చూపించి హిట్స్ కొట్టాడు. తన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ తోనే మాస్ ని చూపించే రవితేజ లాంటి హీరో ఇంకొకరు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే లేడు. హీరో క్యారెక్టర్ ఇలానే ఉండాలి లాంటి లెక్కల్నే మార్చేసిన రవితేజ పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇదే ఎనర్జీతో మరెన్నో పుట్టినరోజులను సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం..
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







