భారత గణతంత్ర దినోత్సవం..!
- January 26, 2025
రాజ్యాంగం అంటే కేవలం న్యాయవాదులు సమర్పించిన పత్రం కాదని, ఇది దేశ ప్రజల జీవితాలను నడిపే వాహనమని, దీని స్ఫూర్తి ఎప్పటికీ నిలిచి ఉంటుందని మన రాజ్యాంగాన్ని ఆమోదించినందుకు గుర్తుగా భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు.భారతదేశం ఏటా గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న జరుపుకుంటుంది. నేడు 76వ భారత గణతంత్ర (రిపబ్లిక్) దినోత్సవం. భారత గణతంత్ర దినోత్సవ విశిష్టతను తెలిపే ప్రత్యేక కథనం మీకోసం.
గణతంత్ర దినోత్సవ ప్రత్యేకత ఏంటని ఈ తరం వారిని అడిగితే వారికి ఈ రోజు ఒక పబ్లిక్ హాలిడే. కుటుంబంతో, స్నేహితులతో సరదాగా గడిపే ఒక సెలవు రోజు. అంతకు మించి వారికేమి తెలియదు. ఈ జాతీయ సెలవు రోజున ఎంత మంది స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుంటారంటే సమాధానం ఉండదు. దేశ స్వాతంత్రం మీద నేటి యువతకి ఎంత అవగాహన ఉంది? అని ప్రశ్నిస్తే 'నో ఆన్సర్!'
అసలు రిపబ్లిక్డేను జనవరి 26నే ఎందుకు జరుపుకోవాలి? అనే ఈ ప్రశ్నకు సరైన సమాధానం చాలా మందికి తెలియదు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించింది. అలాగే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ఏటా అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని భావిస్తారు. ఇందులో కాస్త నిజం లేకపోలేదు. కానీ, దీని వెనుక బలమైన కారణం ఉంది. అదేమిటో చూద్దాం.
వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26నే ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు వేచి ఉన్నారు. జలియన్ వాలాబాగ్ ఉదంతం తరువాత ఒక్కసారిగా కళ్లు తెరచిన భారత నేతలు లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు.
నెహ్రూ సారథ్యంలో రావీ నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల స్వాతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన 1949లో పూర్తయినా, మరో రెండు నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి దానిని అమల్లోకి తెచ్చారు.
ఇదే రోజున బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం -1935 రద్దయ్యింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటుచేశారు. దీనికి అధ్యక్షుడిగా బాబు రాజేంద్రప్రసాద్ గారిని ఎన్నికోగా, రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్గా డాక్టర్ అంబేద్కర్ను నియమించారు. 1949 నవంబర్ 26న దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల 11 నెలల, 18 రోజుల కాలం పట్టింది. రాజ్యాంగ రచనకు మొత్తం రూ.64 లక్షలు ఖర్చయ్యింది.
బ్రిటీష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తరువాత భారత పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్య్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి, రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇది జనవరి 26, 1950 నుంచి అమలులోకి వచ్చింది. ఆనాటి నుంచి ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది.
విదేశీ పాలన పూర్తిగా అంతరించి స్వదేశీయుల చేతిలోకి భారత దేశం వచ్చిన శుభ సందర్భంగా ప్రతి ఏటా రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహిస్తారు. ఈ పరేడ్లో అన్ని రాష్ట్రాలకు చెందిన శకటాలు పాల్గొంటాయి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి తదితరుల సమక్షంలో రాష్ట్రాలు సాధించిన అభివృద్ధిని తెలియజేసే శకటాలు ఈ పరేడ్లో పాల్గొంటాయి.
రిపబ్లిక్ డే రోజు నగరాలు మొదలుకొని గ్రామాల వరకు, పార్లమెంటు నుంచి పంచాయితీ కార్యాలయం వరకు ఊరూరా, వాడవాడలా గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరుగుతాయి.
ఈ దేశం నాకు ఏమీ ఇవ్వలేదని పరాయి దేశాలకు పారిపోవడం కాదు. ఈ దేశం కోసం మనమేం చేయగలమో చేసి చూపించాలి. అప్పుడే భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాకుండా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరుతుంది. ముఖ్యంగా దేశ యువత ఈ బృహత్తరమైన బాధ్యత స్వీకరించాలి. ఈ దేశమేగినా ఎందు కాలిడినా భరతమాత ముద్దు బిడ్డలమని మరువకూడదు. మన దేశం కోసం ఎలాంటి త్యాగమైన చేయడానికి సిద్ధంగా ఉండాలి. జననీ జన్మ భూమిశ్చ! స్వర్గాదపి గరీయసి! అన్నట్లు కన్నతల్లిని జన్మభూమిని ఎన్నటికీ మరువకూడదు.
ఏడాదికోసారి వేడుకలు జరుపుకొని మర్చిపోవడం కాదు గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటున్నాం? రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులు ఏంటి? బాధ్యతలు ఏంటి? అనే విషయాలు కూడా అందరూ తెలుసుకోవాలి. హక్కలు కోసం పోరాడడం మాత్రమే కాదు బాధ్యతలు కూడా విస్మరించకూడదు. జైహింద్!
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







