టాలీవుడ్ యువ నటుడు-నవదీప్

- January 26, 2025 , by Maagulf

సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు నవదీప్. జై  సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై, ఆ తర్వాత హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో హీరోగా నటించారు. అలాగే, హీరోగా కొనసాగుతున్న సమయంలోనే తన మనసుకు నచ్చిన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. ప్రస్తుతం పూర్తిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తమిళ, తెలుగు మరియు హిందీ భాషల్లో నటిస్తూనే వ్యాఖ్యాతగా రాణిస్తున్నాడు. నేడు యువ నటుడు నవదీప్ పుట్టినరోజు.

 పల్లపోలు నవదీప్ 1986,జనవరి 26న హైదరాబాద్ నగరంలో పల్లపోలు రామారావు, మాధవి దంపతులకు జన్మించారు. నవదీప్ తండ్రి తన స్వస్థలం ఉమ్మడి ప్రకాశం జిల్లా వేటపాలెం నుంచి హైదరాబాద్ నగరంలో వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. డిగ్రీ వరకు చదువుకున్న నవదీప్ చిన్నతనంలోనే సినిమాల మీద ఇష్టం పెంచుకున్నాడు. తల్లిదండ్రులు సైతం ప్రోత్సహించడంతో చిత్ర పరిశ్రమలో అవకాశాలు కోసం ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాడు.

2004లో ప్రముఖ దర్శకుడు తేజ కొత్త వాళ్ళను పెట్టి తీసుకున్న జై చిత్రంలో హీరోగా అవకాశం రావడంతో నవదీప్ కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. ఆరంభంలో కథల ఎంపికలో తడబడినా తర్వాత కాలంలో మంచి కథలను సెలెక్ట్ చేసుకొని గౌతమ్ ssc చిత్ర విజయంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. 2007లో సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ చిత్రం నవదీప్ కెరీర్‌కి  మంచి బూస్ట్ ఇచ్చింది.ఈ చిత్రంతోనే హీరోయిన్ కాజల్ సక్సెస్ బాట పట్టింది.

చందమామ తర్వాత చేసిన పలు చిత్రాలు వరస పరాజయం పాలవ్వడంతో తన రూట్ మార్చి ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించేందుకు ఒకే చెప్పడం మొదలు పెట్టాడు. హీరోగా కొనసాగుతున్న సమయంలోనే తమిళంలో పలు చిత్రాల్లో సెకండ్ హీరో, క్యారక్టర్ రోల్స్ చేసిన నవదీప్ 2009లో అల్లు అర్జున్ నటించిన ఆర్య 2 చిత్రం నుంచి ఇంపార్టెంట్ రోల్స్ చేయడం మొదలు పెట్టాడు. ఆర్య2 చిత్రంతోనే అల్లు అర్జున్‌తో మంచి స్నేహం ఏర్పడింది.

2013లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాద్‍షా చిత్రంలో నవదీప్ నటించిన విలన్ రోల్ బాగా పండింది. ఈ చిత్రం తర్వాత పలు తెలుగు  చిత్రాల్లో ప్రతి నాయక పాత్రల్లో అలరించారు. ఒక పక్క తెలుగులో నటిస్తూనే తమిళ, హిందీ చిత్రాల్లో సమాంతరంగా నవదీప్ నటిస్తూ ఉన్నాడు. హిట్లు, ఫ్లాప్స్ సంబంధంలో లేకుండా  ఇండస్ట్రీలో నటుడిగా మంచి పేరు దక్కించుకున్నాడు. ఒకవైపు సినిమాలతో బిజీగా గడుపుతూనే ఓటీటీ వెబ్ సిరీసుల్లో నటించడం మొదలు పెట్టాడు. నటుడిగా తనను నిరూపించుకునేందుకు వెబ్ సిరీసులు బాగా ఉపకరించాయి. వీటితో పాటు బిగ్ బాస్ తెలుగు 2017 సీజన్లో పాల్గొని ఆ సీజన్ టాప్ 4లో నిలిచాడు.

ఇండస్ట్రీలో నవదీప్‌కు చాలా మంది స్నేహితులు ఉన్నారు. వీరిలో అల్లు అర్జున్, రానా దగ్గుబాటిలు ముఖ్యులు.నవదీప్ యాంకర్‌గా 3వ సైమా అవార్డ్స్, మొదటి ఐఫా ఉత్సవం అవార్డ్స్ షోలు చేసాడు. ఆ షోలలో నవదీప్ యాంకరింగ్ హిట్ కావడంతో పలు షోస్ యాంకర్‌గా చేయమని అవకాశాలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం సినిమాలు, ఓటీటీ వెబ్ సిరీసుల్లో నటిస్తూనే యాకరింగ్ చేస్తూ బిజీగా ఉన్నాడు.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com