జాతీయ నది దినోత్సవం..!

- February 02, 2025 , by Maagulf
జాతీయ నది దినోత్సవం..!

నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘పొటమాలజీ’ అని అంటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నదుల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏటా భారత దేశంలో ఫిబ్రవరి 2న ఘనంగా జాతీయ నది దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఒక నదికి ఏ ప్రాంతాల నీరు నుంచి వచ్చి చేరుతుందో ఆ ప్రాంతాల మొత్తం వైశాల్యాన్ని ఆ నది పరివాహక ప్రాంతంగా పేర్కొంటారు. పరివాహక  ప్రాంతం ఆధారంగా నదులను మూడు రకాలుగా విభజించారు. అవి..

ప్రధాన నదులు:
20,000 చ.కి.మీ. లేదా అంతకంటే ఎక్కువ పరివాహక ప్రాంతాన్ని కలిగిన నదులను ప్రధాన నదులుగా పేర్కొంటారు. ఇవి భారతదేశంలో 14 ఉన్నాయి. అవి..గంగా, సింధూ, బ్రహ్మపుత్ర, నర్మదా, తపతి, సబర్మతి, మహీ, సువర్ణరేఖ, బ్రహ్మణి, మహానది, గోదావరి, కృష్ణా, కావేరీ, పెన్నా. భారతదేశంలోని మొత్తం నదుల ద్వారా ప్రవహించే నీటిలో 85 శాతం నీరు వీటి ద్వారానే ప్రవహిస్తుంది.  

మధ్య తరహా నదులు:
2000 - 20,000 చ.కి.మీ మధ్య పరివాహక ప్రాంతాన్ని కలిగిన నదులను మధ్య తరహా నదులుగా పేర్కొంటారు. ఇవి 44 ఉన్నాయి. వీటి ద్వారా 7 శాతం నీరు ప్రవహిస్తుంది.

చిన్న తరహా నదులు:
2000 చ.కి.మీ.కంటే తక్కువ పరివాహక ప్రాంతాన్ని కలిగిన నదులను చిన్న తరహా నదులుగా పేర్కొంటారు. ఇవి సుమారు 187 పైగా  ఉన్నట్లుగా భారత ప్రభుత్వం గుర్తించింది. వీటి ద్వారా 8 శాతం నీరు ప్రవహిస్తుంది. ప్రధానంగా భారతదేశంలోని నదులను వాటి పుట్టుక ఆధారంగా రెండు ప్రధాన వ్యవస్థలుగా విభజించారు.

హిమాలయ నదీ వ్యవస్థ:
హిమాలయాల్లో పుట్టి భారతదేశం గుండా ప్రయాణించేవి. హిమాలయ నదులను రెండుగా విభజించారు. అవి..

పూర్వపర్తి నదులు:
హిమాలయాలు ఏర్పడక ముందు నుంచి ఆ ప్రాంతంలో ప్రవహించే నదులను ‘పూర్వపర్తి నదులు’ అంటారు. అవి..సింధూ, సట్లెజ్‌, బ్రహ్మపుత్ర, అలకనంద, గండక్‌, కోసి మొదలైనవి.  

అంతర్వర్తిత నదులు:
హిమాలయాలు ఏర్పడిన తరువాత అక్కడ పుట్టి ప్రవహించే నదులను ’అంతర్వర్తిత’ నదులు అంటారు. ఉదాహరణ: గంగ, యమున, జీలం, చీనాబ్‌, రావి, బియాస్‌, గగ్రా, రామ్‌ గంగ మొదలైనవి

హిమాలయ నదుల లక్షణాలు:
ఇవి జీవనదులు. వీటిలో 365 రోజులు నీరు ప్రవహిస్తుంది. వేసవిలో మంచు కరిగి నీరు ప్రవహిస్తుంది. వర్షాకాలంలో వర్షాల వలన నీరు ప్రవహిస్తుంది. పర్వతాలపై నుంచి ప్రవహించడం వలన వీటి వేగం అధికంగా ఉంటుంది. వీటివలన అకస్మాత్తుగా వరదలు సంభవిస్తాయి. ఇవి వెడల్పు తక్కువగా ఉండి, లోతు ఎక్కువగా ఉండే ‘వి’ ఆకారపు లోయను ఏర్పాటు చేస్తాయి.

ద్వీపకల్ప నదీ వ్యవస్థ:
ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతంలో పుట్టి ప్రవహించే నదులను ద్వీపకల్ప నదులుగా పేర్కొంటారు. ఇవి అజీవ నదులు. వర్షాధారిత లేదా రుతుపవన ఆధారంగా ప్రవహిస్తుంటాయి. ఇవి పీఠభూములు, మైదాన ప్రాంతాల మీద ప్రవహించడం వలన వీటి వేగం తక్కువగా ఉంటుంది. ఇవి అత్యంత వెడల్పైన, లోతు తక్కువగా ఉన్న లోయలను ఏర్పాటు చేస్తాయి.

సింధూ నదీ వ్యవస్థ:
దీనిని ఆంగ్లంలో ఇండస్‌ అని, లాటిన్‌లో సింథస్‌ అని, పర్షియన్‌లో సింథోమ్‌ అని గ్రీకు భాషలో సింథోస్‌ అని, టిబెట్‌ భాషలో సింగి కంభట్‌ అని సంస్కృతంలో సింధూ అని పిలుస్తారు. సింధూ నది జన్మస్థానం గుర్తాంగ్‌ చు. ఇది టిబెట్‌లోని కైలాస పర్వతాలలోని ‘మానస సరోవరం’ సరస్సుకు పశ్చిమాన జన్మిస్తుంది. టిబెట్‌, ఇండియా, పాకిస్థాన్‌ దేశాల్లో ప్రవహిస్తుంది.

- డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com