విలక్షణ దర్శకుడు-శేఖర్ కమ్ముల
- February 04, 2025
శేఖర్ కమ్ములను చూడగానే బాగా పరిచయం ఉన్న వ్యక్తి అనిపిస్తుంది. ఆయన కదలికలు చూస్తే కొండొకచో నవ్వులూ పూస్తాయి. ఇప్పటి దాకా శేఖర్ రూపొందించిన చిత్రాల సంఖ్య తక్కువే అయినా, ఆయన ఆకట్టున తీరు ఎక్కువే అనిపిస్తుంది. తాను రాసుకొనే కథల్లో సగటు ప్రేక్షకునికి ఏమి కావాలో స్పష్టంగా తెలిసి మరీ వాటిని సినిమాలో చొప్పిస్తారు. కాఫీ తాగని వారిచేత కూడా తన సినిమాల ద్వారా ‘మంచి కాఫీ తాగిన ఫీలింగ్’ కలిగిస్తూ ఉంటారు శేఖర్. నేడు విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల జన్మదినం. ఈ సందర్బంగా ఆయన సినీ ప్రయాణం మీద ప్రత్యేక కథనం...
శేఖర్ కమ్ముల 1972 ఫిబ్రవరి 4న ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. అయితే పెరిగింది, చదువు సంధ్యలు సూర్తి చేసుకున్నదంతా హైదరాబాద్ లోనే. అందువల్లే అతని మాటల్లో హైదరాబాద్ తెలుగు తకధిమితై అంటూ నాట్యం చేస్తూ ఉంటుంది. సికింద్రాబాద్‌లోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్లో 10వ తరగతి, సెయింట్ అల్ఫోన్సా కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ప్రముఖ చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT) నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలోని న్యూజెర్సీలో Rutgers University నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసి మూడేళ్ళ పాటు ఐటీ రంగంలో పనిచేశారు.
శేఖర్ కమ్ముల చిన్నతనం నుంచే సినిమాల మీద ఆసక్తి ఏర్పడింది. చదువును అశ్రద్ధ చేయకుండానే, సినిమాల్లో రాణించాలని కలలు కన్నారు శేఖర్. వాటి ఫలితంగానే ఒకవైపు ఉద్యోగం చేస్తూనే వాషింగ్టన్‌లోని హోవార్డ్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేశారు. 2000లో డాలర్ డ్రీమ్స్ చిత్రం రూపొందించి, అందరినీ తనవైపు తిప్పుకున్నారు శేఖర్. ఈ సినిమాతో ఉత్తమ తొలి చిత్ర దర్శకునిగా జాతీయ స్థాయిలో అవార్డు సంపాదించారు.దాంతో ఒక్కసారిగా సినీజనం శేఖర్ వైపు చూశారు.
2004లో చిరంజీవి సినిమా ‘శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్.’ విడుదల రోజునే తన ‘ఆనంద్’ చిత్రాన్ని విడుదల చేశారు శేఖర్. అప్పట్లో అందరూ శేఖర్ సాహసం చేస్తున్నాడని అన్నారు. కానీ, ఓ టాప్ స్టార్ మూవీ విడుదల రోజునే తమ చిన్న సినిమా విడుదలయితే, అగ్ర కథానాయకుని చిత్రానికి టిక్కెట్స్ దొరకని వారందరూ తమ సినిమాకు వస్తారు కదా అన్నది శేఖర్ లెక్క! అది తప్పలేదు. శేఖర్ చెప్పినట్టుగానే ‘ఆనంద్’ను చూసిన వారందరూ ‘ఓ మంచి కాఫీ లాంటి సినిమా’ అంటూ ఆదరించారు. ఆ తరువాత శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గోదావరి’ కొందరిని మాత్రమే ఆకట్టుకోగలిగింది. అయితే ఈ రెండు చిత్రాలతోనూ ఉత్తమ దర్శకునిగా నందిని సొంతం చేసుకున్నారు.
2007లో వచ్చిన ‘హ్యాపీ డేస్’ టైటిల్ కు తగ్గట్టుగానే ఎందరికో ఆనందమైన రోజులు చూపించింది. రానా హీరోగా నటించిన తొలి చిత్రం ‘లీడర్’ శేఖర్ దర్శకత్వంలోనే తెరకెక్కింది. “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక, ఫిదా, లవ్ స్టోరీ” చిత్రాలతో తనదైన మార్కు చూపిస్తూ ఆకట్టుకున్నారు.
నవతరం ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసే కథాంశాలతో శేఖర్ కమ్ముల చిత్రాలు ఉంటాయి. మన చుట్టూ, నిత్యం మనకు తారసపడే అంశాలతోనే శేఖర్ తన సినిమాలకు కథలు రూపొందిస్తూ ఉంటారు. అందుకే చూసేవారిని ఆయన కథలు ఇట్టే పట్టేస్తాయి. శేఖర్ సక్సెస్ రేటు బాగా ఉన్నా, ఆయన పరిగెత్తి పాలు తాగే రకం కాదు. నిలకడగా నిలబడి నీళ్ళు తాగినా అందులోనే సంతృప్తిని వెదుక్కుంటారు. అందుకే శేఖర్ ఒక సినిమాకు మరో సినిమాకు మధ్య గ్యాప్ బాగా ఉంటుంది. అయినా, తన ప్రతి చిత్రంతో జనాన్ని ఆకర్షిస్తూ ఉండడమే శేఖర్ స్పెషాలిటీ.
సినిమాకు ఓ గ్రామర్ కూర్చిన మహామహులు సైతం ‘హ్యూమానిటీ స్టాండ్స్ అబౌ ఆల్” అని పేర్కొన్నారు. శేఖర్ కమ్ముల ఆ సూత్రాన్ని తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ప్రేక్షకులను కట్టిపడేసే మానవీయ విలువలను తన కథల్లో చొప్పించడం శేఖర్ బాణీ. తొలి చిత్రం ‘డాలర్ డ్రీమ్స్’ మొదలు మొన్నటి ‘లవ్ స్టోరీ’ దాకా ఆయన సినిమాలను చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. విలువలకు ఏ నాడూ తిలోదకాలు ఇవ్వరు. శేఖర్ సినిమాలను చూస్తే విలువలే ఆయన అసలైన ఆస్తి అనిపిస్తుంది. ఇప్పటి దాకా అదే తీరున అలరించిన శేఖర్ మళ్ళీ ఏ సినిమాతో తమను పలకరిస్తాడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం అందరు దర్శకుల లక్ష్యం యువతను ఆకట్టుకోవడమే. శేఖర్ తెర మీద చెప్పే కథల్లో యువతను ఆకర్షించే అంశాలు బోలెడు ఉంటాయి. అలాగని అతను ఏ నాడూ అశ్లీలానికి, అసభ్యతకు తావిచ్చింది లేదు. శేఖర్ తీసే సినిమాలను ఎటువంటి నిరభ్యంతరంగా సకుటుంబసమేతంగా చూడవచ్చునని ప్రేక్షకుల విశ్వాసం. ఆ నమ్మకాన్ని నిలుపుకుంటూనే శేఖర్ సినిమాలు తెరకెక్కిస్తూ ఉంటారు. ధనుష్ హీరోగా కుబేర చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష